Nov 22,2023 10:32

'నేను ఏ భారతదేశం నుండి వచ్చానంటే.. అక్కడ రెండు భారతదేశాలు ఉన్నాయి' అంటూ రెండేళ్ల క్రితం దేశ వాస్తవ పరిస్థితులను, మహిళలపై జరుగుతున్న అకృత్యాలను, రాజకీయ నాయకుల తీరుతెన్నులను, రైతులపై చేస్తున్న అన్యాయాలను ప్రతి ఒక్క అంశాన్ని ఓ ఆరు నిమిషాల వీడియోలో కుండబద్దలు కొట్టి చెప్పిన నోయిడాకు చెందిన స్టాండప్‌ కమెడియన్‌ వీర్‌ దాస్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై భారత్‌ పాలకులు నిప్పులు చెరిగారు. 'దేశద్రోహి' అన్నారు. 'తీవ్రవాది' అని నిందించారు. ఇంకా, కామెడీ షోలు చేసుకుని ఆదాయం సంపాదించే అతనిపై నిషేధాజ్ఞలు జారీచేశారు. ముందుగా నిర్ధారణ చేసుకున్న షోలను నిర్వాహకులతో బలవంతంగా రద్దు చేయించారు. అడుగడుగునా అతన్ని నిలువరించారు. ఆర్థికంగా కుంగదీశారు. ఈ రెండేళ్లలో అతను ఎంత క్షోభ అనుభవించాడో.. సరైన ఆదాయం లేక ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో.. అనుభవించిన అతడికి మాత్రమే తెలుసు. నటీనటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు ఈ ఏడాది అతన్ని వరించింది. అవార్డు తీసుకుంటూ దాస్‌ గత స్మృతులను నెమరువేసుకున్నాడు. ఈ సందర్భంగా మన 'దేశ భక్త' పాలకులకు అంతలా మింగుడుపడని వీర్‌ దాస్‌ వ్యాఖ్యలను ఒకసారి పునరావలోకనం చేసుకుందాం.

jeevana 02


         2021 నవంబరు 20, అమెరికా వాషింగ్టన్‌ డీసీలోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ స్టేడియం. స్టాండప్‌ కామెడీ షో నిర్వహించేందుకు సిద్ధమైన ఆ స్టేడియం ఆరోజు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి వుంది. అప్పుడే 42 ఏళ్ల వీర్‌దాస్‌ స్టేజీ మీద ఉన్న మైక్‌ దగ్గరకు చేరుకున్నాడు. అతన్ని చూడగానే అభిమానులంతా హర్షధ్వానాలు చేశారు. వారందరినీ పలకరించిన అతడు తన వెంట తెచ్చుకున్న కాగితంలో ఓ కవితను చదవడం ప్రారంభించాడు.
       'ఇక్కడ నన్ను మీరంతా భారతదేశం నుండి వచ్చానని గుర్తిస్తారు. అయితే నేను ఏ భారతదేశం నుండి వచ్చానంటే, అక్కడ రెండు భారతదేశాలు ఉన్నాయి.
         నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ మాస్కులు ధరించిన చిన్నారులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటారు. అలాగే ముసుగులు ధరించకుండా ఆలింగనాలు చేసుకునే రాజకీయ నాయకులూ ఉంటారు. కోవిడ్‌ సమయంలో కరోనా మార్గదర్శకాలు పాటించమని దేశప్రజలకు సూచించిన పాలకులు వాటిని తుంగలో తొక్కిన విధానాన్ని ఈ వ్యాఖ్యల్లో ఎండగట్టారు. ఇంకా..
       నేను భారత దేశం నుండి వచ్చాను. అక్కడ లైంగికతను అపహాస్యం చేస్తారు. కానీ కోట్లాదిమంది నాలుకలపై అసభ్య పదజాలాలు అలవోకగా నాట్యమాడుతాయి.
నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ జర్నలిజం చనిపోయింది. ఫ్యాన్సీ స్టూడియోస్‌లో ఫ్యాన్సీ సూట్‌లు వేసుకున్న పురుషులు తమకు ఇష్టమైన వ్యక్తుల కోసం పనిచేస్తారు. ల్యాప్‌ట్యాప్‌లు పట్టుకున్న మహిళలు వీధుల్లో నిజాలు చెప్పేందుకు శ్రమపడుతుంటారు.
నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ గాలి స్వచ్ఛత 9000 ఎక్యూఐ ఉంటుంది. అయితే మేము ఇప్పటికీ ఇంటి పైకప్పులపై పడుకుని రాత్రిపూట నక్షత్రాలను చూస్తాం.
నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ మేము పగటిపూట స్త్రీలను పూజిస్తాం. రాత్రుళ్లు సామూహిక అత్యాచారాలకు పాల్పడతాం. నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ పాత నాయకులు తమ చనిపోయిన తండ్రుల గురించి మాట్లాడటం మానరు. కొత్త నాయకులు తమ జీవించి ఉన్న తల్లుల మార్గాన్ని అనుసరించడం ఎప్పటికీ ఆపరు. నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు అత్యధికం. కానీ వారు ఇప్పటికీ 75 ఏళ్ల నాయకుల నుండి 150 ఏళ్ల ఆలోచనలను వినడం ఆపలేదు.
నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ క్లబ్‌ల బయట వీధుల్లో నిద్రిస్తారు. అలాగే ఏడాదికి 20 సార్లు వీధుల్లో క్లబ్‌లు నిర్వహిస్తారు.
నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ మేము శాకాహారులుగా ఉన్నందుకు గర్విస్తాం. అయితే ఆ కూరగాయలు పండించే రైతన్నలను చితకబాదుతాం.
నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ ఎప్పుడూ నోరు మూసుకోని భారతదేశం కనపడుతుంది. అలాగే ఎప్పుడూ మాట్లాడని దేశం కూడా ఉంటుంది.
నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ మేం బాలీవుడ్‌ కారణంగా ట్విట్టర్‌లో విడిపోయాం. కానీ అదే బాలీవుడ్‌ కారణంగా థియేటర్‌ చీకటిలో కలిసిపోయాం.
నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ మా సంగీతం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మా భావోద్వేగాలు చాలా మృదువైనవి.
నేను భారతదేశం నుండి వచ్చాను. అక్కడ మాకు ప్రధాని రక్షణ గురించిన సమాచారం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. కానీ ఆ ప్రధాని ప్రజల కోసం తలపెట్టే విధానాల సమాచారం అందించే పిఎంకేర్‌ వివరాల పొందలేం.
నేను భారతదేశం నుండి వచ్చాను. వందల ఏళ్లు పాలించిన బ్రిటీష్‌వాళ్లను తరిమికొట్టి స్వతంత్ర పాలనలోకి వచ్చిన భారతదేశం మాది. అక్కడ చీరలు, షూలు ధరించిన మహిళలు ఉంటారు. కానీ వారంతా జీవితంలో ఎప్పుడూ చీరలు, షూ వేసుకోని ముసలివాళ్ల మాటలు వినడానికి ఇష్టపడతారు' అంటూ దేశ తీరుతెన్నులను తన కవితలో వినిపించారు దాస్‌.
ఆ ప్రయాణం ముగించుకుని అతను భారత్‌కి ఇంకా తిరిగి రాకముందే ఆయనపై విద్వేషమూకలు విరుచుకుపడ్డాయి. రోడ్లమీదకి వచ్చి అతని దిష్టిబొమ్మలను తగలబెట్టారు. దేశం పరువు తీశాడంటూ పాలకులు, పెద్దలు, వంతపాడే మీడియా నోరేసుకుని పడిపోయింది. అంతటితో ఆగక అతని కామెడీషోలను రద్దు చేయించారు. కఠిన ఆంక్షలు జారీచేశారు. పోలీసు కేసులు నమోదుచేశారు. అందుకే ఈ అవార్డు తీసుకునే కొన్ని గంటల ముందు..
'ఈ విశ్వం సంపూర్ణ వృత్తం. దీనికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా చీకటిలో ఉంటే సూర్యకాంతి వచ్చేవరకు ఉండండి. అధైర్యపడవద్దు. నిరుత్సాహం వద్దు. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడికి ఈ విశ్వం మిమ్మల్ని తీసుకుపోతుందని నమ్మండి. నేను భారతీయుడిని. నా అణువణువు భారతదేశ పౌరునిగా గర్విస్తుంది. అంతమాత్రాన మీ ఆలోచనలతో నేను ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అనేక విధానాలున్నాయి. వాటిలో నేను ఎంచుకున్న మార్గం నాకు భారతీయునిగా గుర్తింపునిస్తుంది' అంటూ తన స్టాండప్‌ కమెడియన్‌ ప్రయాణాన్ని, 'టు ఇండియాస్‌' వీడియో చేసినందుకు తనపై జరిగిన దౌర్జన్యాన్ని, ఈ రెండేళ్లలో తను పడిన వేదనను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. అవార్డు తీసుకుంటూ 'ఇది నా దేశం భారత్‌కి అంకితమ'ని వ్యాఖ్యానించారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఇండియన్‌ కమెడియన్‌గా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.