Nov 20,2023 10:50

సినిమాల్లో యాస, భాష అనేవి చాలా ప్రభావవంతమైనవి. నటీనటులు ప్రాంతీయ యాసను పలకడం అనేది ట్రెండీగా నడుస్తోంది. హైదరాబాద్‌, చిత్తూరు, రాయలసీమ, ఉత్తరాంధ్ర యాస ఇలా వేటికవే ప్రత్యేకం. ఇందులో అన్ని రకాల యాసల్ని మన దర్శకులు ఇప్పటికే విరివిగా వాడుతున్నారు. సన్నివేశాలు పండేందుకు వాడుతున్నారు. ఈ క్రమంలోనో ఆయా ప్రాంతాల జానపదులు వినిపించడమూ పరిపాటిగా మారింది. దీనికి ప్రేక్షకుల నుంచీ మంచి ఆదరణ లభిస్తుండటంతో.. ఇప్పుడీ తరహా ప్రయోగాలు చేసేందుకు అగ్ర కథానాయకులు ఆసక్తి చూపిస్తున్నారు.

88


        'చెప్పే కథ స్థానికంగా ఉంటే... దానికంత ప్రపంచ ఆదరణ' అంటూ కాంతార దర్శకుడు రిషబ్‌ చెప్పిన మాట అక్షరసత్యమే. పల్లె జీవనం వైవిధ్యంపై ఇటీవల మట్టి పరిమళాలు పులుముకొని వెండితెరపై గుబాళించిన పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్‌టాక్‌ను అందుకుంటున్నాయి. తెలంగాణా యాసలో భగవంత్‌ కేసరి సినిమాలో బాలకృష్ణ, శ్రీలీల మధ్య సాగే పాటలో 'చిచ్చా వచ్చిండు.. ఇగ కొట్టర కొట్టు సౌమారు' అంటూ చిందేస్తారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దసరాకు విడుదలైన వచ్చిన ఈ సినిమా తెలంగాణ ప్రాంత నేపథ్యంలో సాగింది. స్కంధ సినిమాలో హీరో రామ్‌ పోతినేని, విలన్ల మధ్య సన్నివేశాల్లో 'రింగులోకి దిగితే రీ సౌండే రావాలే... చూసుకుందాం బరాబర్‌ చూసుకుందాం' అంటూ డైలాగులో సాగుతాయి. రామ్‌-బోయపాటి శ్రీను కలయికలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ-ఆంధ్రా నేపథ్యాలతో ముడిపడి ఉన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించారు. ఈ కథా నేపథ్యానికి తగ్గట్లుగానే సినిమాలో రామ్‌తో పాటు పలు పాత్రలు ఆయా ప్రాంతాల తాలూకూ మాండలికాల్లో సంభాషణలు కొనసాగిన విషయం తెలిసిందే. ఈనెల 24న విడుదల కానున్న కోట బొమ్మాళి పీఎస్‌ సినిమాలో శ్రీకాకుళం యాసలో వచ్చిన 'లింగిడి.. లింగిడి' జానపద పాటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఆదికేశవ సినిమాలో కూడా తెలంగాణా యాసలో డైలాగులు ఉన్నట్లుగా ఇటీవల దర్శకులు ప్రకటించిన విషయం తెలిసిందే.

77


           'తొంగి తొంగి నక్కి నక్కి గాదే... తొక్కుకుంటూ పోవాలే... ఎదురొచ్చినోడ్ని ఏసుకుంటూ పోవాలే' అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ హీరోయిజాన్ని ప్రదర్శించి పండించారు. 'వాల్తేరు వీరయ్య'తో రవితేజ కూడా తెలంగాణ యాసలోనూ, చిరంజీవి శ్రీకాకుళం యాసలోనూ సంభాషణలు పలికి.. సినీప్రియుల్ని మురిపించారు. దసరాలో నాయకా నాయికలు నాని, కీర్తి సురేష్‌ గోదావరిఖని ప్రాంతవాసుల్లా తెలంగాణ యాసలో సంభాషణలు పలికి పౌరుషం ప్రదర్శించారు. నాగార్జున కథానాయకుడిగా ప్రసన్న కుమార్‌ బెజవాడ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తిగా కోనసీమ నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. ఇందుకు తగ్గట్లుగానే సినిమాలో నాగ్‌ ఆ ప్రాంతపు మాండలికంలో సంభాషణలు వినిపించనున్నట్లుగా తెలుస్తోంది. 'పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైరు' 'పుష్ప'లో చిత్తూరు యాసతో అలరించారు హీరో అల్లు అర్జున్‌. ఇప్పుడీ మ్యాజిక్‌ 'పుష్ప2'తోనూ కొనసాగనుంది. 'రంగస్థలం'లో గోదావరి యాసను వినిపించారు కథానాయకుడు రామ్‌చరణ్‌. యువ హీరో విశ్వక్‌ సేన్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో కష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి'. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ సినిమాలో ఆ ప్రాంతపు మాండలికంలో సంభాషణలు పలకనున్నట్లుగా ప్రచారం వినిపిస్తోంది. 'డీజే టిల్లు'లో మల్కాజ్‌గిరీ కుర్రాడిగా తెలంగాణ యాసలో అదరగొట్టారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడాయన 'టిల్లు స్క్వేర్‌'తో మరోసారి అదే యాసలో అల్లరి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో నైజాం యాసను నేర్చుకుని అచ్చం ఫలక్‌ నుమా ఏరియా కుర్రాడిలా నటించి మెప్పించాడు రామ్‌. గతంలో కీర్తిశేషులు రావు గోపాలరావు ఉత్తరాంధ్ర- గోదారి జిల్లాల యాసతో ఎంతో మెప్పించారు.

44

కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్‌ నటులు అన్ని ప్రాంతాల యాస, భాషలతో చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. చాలా కాలంగా ఉత్తరాంధ్ర నుంచి పలువురు నటీనటులు పరిశ్రమలో విరివిగా అవకాశాలు అందుకున్నారు. వారంతా తమ యాస, భాషతో ఎంతో పాపులరయ్యారు. రావు గోపాల్‌ రావ్‌ వారసుడిగా రావు రమేష్‌ కూడా గోదారి యాస భాషను పలకడంలో దిగ్గజం అని నిరూపించారు. అలాగే నైజాం కోనసీమ నుంచి కూడా పలువురు కమెడియన్లు తమ యాస భాషతో ఆకట్టుకున్నారు. సత్య అనే కోనసీమ కుర్రాడు అమలాపురం యాసతో సినిమాల్లో తనదైన యూనిక్‌ ముద్రను వేయగలిగాడు. ఇప్పుడున్న తెలుగు కమెడియన్లలో బిజీ ఆర్టిస్టుగా అతడు రాణిస్తున్నాడు. అలీ- బ్రహ్మానందం లాంటి సీనియర్‌ కమెడియన్లు తమ సినిమాల్లో అన్ని ప్రాంతాల యాసతో రాణించి మెప్పించారు.

55

'బలగం'లో తెలంగాణ యాస భాషను ఎంతో అందంగా ఆవిష్కరించారు. కమెడియన్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూర్తిగా తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. ఇటీవలి కాలంలో బిజీ ఆర్టిస్ట్‌ ప్రవీణ్‌ తూర్పు గోదావరి జిల్లా యాసతో ఎంతగానో మెప్పిస్తున్నారు. అతడు ఇతర తారలకు కూడా అవసరం మేర శిక్షకుడిగా కొనసాగుతున్నారు. నెల్లూరు-చిత్తూరు యాసతో కమెడియన్‌ సప్తగిరి.. సుదర్శన్‌ లాంటి నటులు ఎంతో మెప్పించారు. పుష్ప ఫేం జగదీష్‌ చిత్తూరు యాసతో ఎంతో ఆకట్టుకుంటున్నారు. అలాగే మధునందన్‌- ప్రియదర్శి లాంటి నటులు తెలంగాణ యాసతో చాలా పాపులరయ్యారు. భీమవరం వెస్ట్‌ గోదావరి సాంగ్‌తో పమ్మి సాయి తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. శేఖర్‌ కమ్ముల హ్యాపీడేస్‌ మొదలు చాలా సినిమాల్లో శ్రీకాకుళం యాసను యూనిక్‌గా ఆవిష్కరించారు. ప్రస్తుతం నాగచైతన్య- చందు మొండేటి శ్రీకాకుళం ప్రాంతం నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నారు.