ప్రతిభ, ప్రయత్నమూ ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చునని వెండితెర సాక్షిగా నిరూపించారు డాక్టర్ కుమార్ నాయక్. చిన్ననాటి నుంచే ఉన్న కళాతృష్ణ ఆయన్ని నిరంతరం ఓ కళాకారుడిగానే ఎదగనిచ్చింది. చిన్ననాడు కోయ నృత్యం ద్వారా కళాకారుడిగా గుర్తింపు పొందిన ఆయన.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే- అనేక సాంఘిక, పౌరాణిక నాటకాల్లో నటించారు. హాస్టల్ వార్డెన్‌గా మూడు దశాబ్దాలపాటు విధులను నిర్వహించి, ఉత్తమ అధికారిగా ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. తన అభిరుచికి అనుగుణంగా షార్ట్, టెలిం ఫిలింలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై, వివిధ పాత్రలతో అలరిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ గ్రామానికి చెందిన డాక్టర్ కుమార్ నాయక్ ఇప్పటివరకూ 22 సినిమాల్లో నటించారు. ఆరు సినిమాలు విడుదల కాగా, మిగతావి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో హీరోయిన్లకు తండ్రి పాత్ర గానూ, విలన్‌గాను, రాజ గురువుగానూ, కమెడియన్‌గానూ, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పిస్తున్నారు
కుమార్ నాయక్... కాశీబుగ్గ గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో సురేఖ, హాడియ నాయక్‌ల రెండో సంతానంగా 1961లో జన్మించారు. తన ఎనిమిదో యేటనే గ్రామీణ ఉత్సవాల్లో జరిగే కోయ నృత్య బృందంలో చేరారు. వందలాది కళా ప్రదర్శనలు ఇచ్చారు. డబుల్ ఎంఎ చదివి, 1982లో శ్రీకాకుళం జిల్లాలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 2021లో ఉద్యోగ విరమణ తరువాత తన కళారంగ కృషిని మరింతగా కొనసాగించారు. సినిమా, టీవీ రంగాల ద్వారా సామాజిక చైతన్యానికి శ్రీకారం చుడుతున్నారు.
వెండి తెరపై ...
వీర గున్నమ్మ, రెండక్షరాల ప్రేమ, నాకొక శ్రీమతి కావాలి, సురభి 70 ఎంఎం, పలాస 1978, వాడు ఎవడు వంటి సినిమాల్లో నాయక్ నటించారు. ఆయన నటించి ఇంకా విడుదల కాని సినిమాల్లో దివ్య 87, దామినివిల్లా, ఎవడి సిన్మాకి వాడే హీరో, నీ వెంటే నేనుంటా, పాంచాలి, ప్రత్యంగరదేవి, మావూరి మంకినమ్మ, లఫ్ ఆఫ్ లక్ష్మీపురం, సత్యాన్వేషి, అంతర్యామి, పల్లె గూటికి పండగొచ్చింది, రెడ్డిగారి అబ్బాయి, గీత, హిట్లర్ (ఒడియా), క్రేజీ 3, అల్లరి గూఢచారులు వంటివి ఉన్నాయి. ఆయన నటించిన అసమర్ధుడు, బాణామతి, దొంగలొస్తున్నారు జాగ్రత్త, గారాల పుత్రుడు, రాజకీయం, సంతానం, ఝాన్సీ వెడ్స్ రామకష్ణ, బంధం వంటి సింగిల్ ఎపిసోడ్స్ ఈటీవీ2లో ప్రసారం అయ్యాయి. విజ్ఞప్తి, జీవితం, సప్త వర్ణాలు, గాంధమ్మోరు, మిస్సడ్‌కాల్, వైశాలి, చినుకు, బ్రహ్మరాక్షసి, వీరగున్నమ్మ, తీరని పగ, మనసు, ఐతే ఓకే, మేలు కొలుపు, అంజు అంజు, ఇది కథ కాదు, మంజరి వంటి టెలిఫిలింలలో తన నటనతో అలరించారు.
వివిధ పాత్రల్లో ...
వీరగున్నమ్మ సినిమాలో మందస సామంతరాజుల కథను ఇతివత్తంగా తీసిన ఈ సినిమాలో రాజగురువుగా తన నటనతో ఆకట్టుకున్నారు. రాజులకు సలహాలు ఇచ్చే కన్నింగ్ పాత్రలో నటించి తన డైలాగులతో అలరించారు. 'రెండక్షరాల ప్రేమ' సినిమాలో హీరోయిన్‌కు తండ్రి పాత్రలో చదువు- సంస్కారం ఉంటేనే పుట్టినింట, మెట్టినింట బతక గలవమ్మా అంటూ చెప్పి స్కూలు బస్సు ఎక్కించిన ఘట్టం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 'నాకొక శ్రీమతి కావాలి' సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు. ఆడపిల్ల తండ్రి మనసులో ఏర్పడిన సంఘర్షణ బయటకు చెప్పలేక లోలోపల మధనపడుతున్న ఘట్టాలు ప్రేక్షకులకు హత్తుకున్నాయి.
'పలాస 1978' సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య పాటల పోటీలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 'పల్లెగూటికి పండగొచ్చింది' సినిమాలో ప్రముఖ నటుడు సాయికుమార్‌తో 'సామాన్యుడికి సినిమాలో ఛాన్స్ ఎక్కడ ఉంటుంది సార్. నేటి హీరో హీరోయిన్ల తెర వెనుక తల్లితండ్రుల ప్రోత్సాహమే ఉంది కదా?' అని డైలాగు చెప్పే సన్నివేశం ఉంది. 'వాడు ఎవడు' సినిమాలో హీరోయిన్ తండ్రిగా అల్లుడు చేతిలో హత్యకు గురైన తన కూతురును చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆధునిక యుగంలో ఆడపిల్లలకు ఎంత ఇచ్చినా.. ఎంత చక్కగా పెంచినా రక్షణ లేకుండా పోయిందంటూ హృద్యంగా నటించారు. పొలిమేర సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో నటించారు. అంతర్యామి సినిమాలో ప్రముఖ నటి ఆమనితో కలిసి ఒక సన్నివేశంలో 'ఏంటి మా అబ్బాయి మీ అమ్మాయిని చంపేశాడా... నేనైతే నమ్మలేకపోతున్నాను. అయ్యో రామా.. సరేనమ్మా.. మీరు ఏం చేస్తారు? నా కొడుక్కి కఠిన శిక్ష విధిస్తే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదమ్మా' అంటూ సాగిన సన్నివేశంలో నటించారు. ఒరియా సినిమా అంతర్యామిలో కమెడియన్‌గా నటించారు. ఒరియాలో తానే డబ్బింగ్ కూడా చెప్పారు. సాంఘిక, పౌరాణిక నాటకాల్లో కూడా నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు కుమార్ నాయక్. ఇటీవల హైదరాబాదులో బెస్ట్ డైలాగ్ ఆర్టిస్ట్‌గా ప్రముఖ నటుడు సుమన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2003లో ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో చేతుల మీదుగా ఉత్తమ టెలిఫిలిం ఆర్టిస్టుగా అవార్డును అందుకున్నారు.
సినీ కళాకారుల సంక్షేమం కోసం ...
సినిమా పరిశ్రమలోని 26 క్రాఫ్ట్స్ (యూనియన్లు) సంబంధించిన కళాకారుల సంక్షేమం కోసం ఎపి చలనచిత్ర టీవీ కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్ర వైస్‌చైర్మన్‌గానూ, ఎపి తెలుగు ఫిలిం అండ్ ఆర్టిస్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా, కళాతపస్వి ఫిలిం అసోసియేషన్ (పలాస) అధ్యక్షుడిగానూ, ఎపి తెలుగు ఫిలిం అండ్ టివి ఫిలిం ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానూ డాక్టర్ కుమార్‌నాయక్ ఉన్నారు.
- యడవల్లి శ్రీనివాసరావు