ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : మంచి ఆహారపు అలవాట్లతో గుండె వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని సూర్య గ్లోబల్ హాస్పిటల్ అధినేత డా.బి.హెచ్. పి.ఎస్. వీర్రాజు పేర్కొన్నారు. ప్రపంచ గుండె వ్యాధులు దినోత్సవం సందర్భంగా మాధవ పట్నం లోని హాస్పిటల్ ప్రాంగణం నుండి కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ గుండె ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. రోజురోజుకూ గుండె జబ్బులు పెరుగుతున్నాయని, చిన్న పెద్ద,స్త్రీ పురుష తేడా లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయన్నారు. ఆహార నియమాలు, దుర అలవాట్లు, అధిక ఒత్తిడి, వంశపారంపర్యంగాను గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. సరైన వ్యాయామం లేకపోవడం, జీవన శైలి మారిపోవడం కూడా ఒక కారణం అవుతోందని, బీపీ, షుగర్ వ్యాధులు కూడా ఒక కారణంగా నిలుస్తున్నాయన్నారు. మసాలా కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయని, తద్వారా గుండె జబ్బులకు కారణం అవుతుందన్నారు. వ్యాయామం చేస్తూ తగిన వైద్య సలహాలు పాటిస్తే గుండె వ్యాధులకు అవకాశం లేదన్నారు. గుండె జబ్బులు పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. యోగ, మెడిటేషన్, ఆహార నియమాలు పాటించాలని హాస్పిటల్ చైర్మన్ డా.వీర్రాజు పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యం గుండె పనివిధానంపై ఆధారపడి ఉంటుందని.బీపీ షుగరు కంట్రోల్ చేస్తూ, ఎంత అవసరమో అంతే ఆహారం తీసుకోవాలన్నారు. వ్యాయామం చేయడం తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో యోగా గురువులు సూర్యనారాయణరావు సూర్యనమస్కారాల ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో డైటీషియన్ వరలక్ష్మి, డా.ఎస్.ఎన్.పండు, డా.వి.ఆదినారాయణ, డా.శ్రీనివాస్, సూర్యనారాయణ, పర్యవేక్షకులు రాజా, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.










