
మార్చి 8 మహిళా హక్కుల దినోత్సవం. 1910 నుండి క్లారా జెట్కిన్ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యమించిన దీక్షా పథం. హక్కులను సాధించుకున్న చరిత్ర. ఇది మహిళల పండుగ మాత్రమే కాదు .మహత్తర కార్యాచరణకు మార్గదర్శి కూడా .మగవారికి దీటుగా చదువుల్ల్లో, ఉద్యోగాల్లో ముందు పీఠిన నిలబడడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నా.... నేటికీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలు వెనుకబడే ఉన్నారు.
స్త్రీలపై హింస పెరిగింది. ఆక్స్ ఫామ్, ఐక్యరాజ్యసమితి తదితర సంస్థలు... పురుషుల కంటే మహిళల శ్రమ ఎక్కువ అని లెక్కించాయి. మధ్యతరగతి సహా మహిళలు విపరీతమైన హింసకు, సామాజికంగా అణచివేతకు, కుటుంబాలలో హింసకు గురవుతున్నారు. పురుషుల్లో మద్యం, మత్తుమందుల ప్రభావంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. చదువుకున్న యువతులు సైతం సామాజిక అణిచివేత ఫలితంగా కట్నాలు, పెళ్లి ఖర్చుల కింద లక్షల రూపాయలు కాబోయే భర్త కుటుంబానికి చెల్లింపులు సాగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలకు ఇచ్చిన ఆస్తులపై భర్త పెత్తనం అంగీకరించకపోతే వేధింపులు తగ్గడం లేదు. ఇంకా సామాజికంగా ఆమోదం పొందుతూనే ఉంది. కుటుంబ హింసనుండి రక్షణ కల్పించే ఐపిసి 498 నీరుకార్చబడింది. ఎవరైనా తమపై జరుగుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేయబోతే పోలీస్ యంత్రాంగం గానీ, సమాజంగాని ఇంకా స్వీకరించే స్థితి లేదు.
మెజారిటీ ప్రజానీకంతోపాటుగా మహిళలు చేస్తున్న శ్రమ అనేక రూపాల్లో అదానీ, అంబానీలు, వారి మిత్రుల బొక్కసాలలో చేరుతున్నది. కోట్లాదిమంది శ్రామిక మహిళలను కార్మికులుగా గాని, ఉద్యోగులుగా గాని గుర్తించడం లేదు. ఏ విధమైన సంక్షేమ చర్యలూ లేవు. ఉన్న సంక్షేమ పథకాల మూలంగానే అభివృద్ధి లేదన్న తప్పుడు ప్రచారాలు రాజ్యమేలుతున్నాయి. అదానీలకిచ్చే రాయితీలు, సదుపాయాలు అభివృద్ధి కోసమని నమ్మబలుకుతున్నారు. గ్రామీణ వ్యవసాయ కూలీ, రైతాంగ మహిళలకు నిర్దిష్టమైన పని గంటలు లేవు. పని దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. చేసిన చాకిరీకి ఫలితం గాని, పనికి తగిన కూలి కానీ వస్తుందన్న నమ్మకం లేదు. ఉపాధి హామీ చట్టం ఉన్నా అందరికీ ఉపాధి కల్పించడం లేదు .చేసిన పనికి వేతనాలు చెల్లింపులు కూడా సరిగా లేవు. నూటికి 30శాతం కుటుంబాలు ఒంటరి మహిళలు వంటి చేతితో నడిపించాల్సిన స్థితికి నెట్టబడ్డాయి.
ఇటీవలి కేంద్ర బడ్జెట్ మహిళల కోసం ఒక్క శాతం కూడా కేటాయించలేదు. ఫలితంగా స్త్రీలలో, కుటుంబాల్లో పెరుగుతున్న కష్టాలకు, నష్టాలకు, బాధలకు విరుగుడు మేం చూపిస్తామంటూ ప్రవక్తలు, ప్రవచన కారులు మహిళలపై వల విసురుతున్నారు. వలలో చిక్కిన చేపల మాదిరిగా కొందరు భ్రమల్లో కొట్టుకుపోయి జీవిత వాస్తవాలను చూడడానికి నిరాకరించే పరిస్థితికి నెట్టబడుతున్నారు. దేవుడి దయ పేరిట నిస్సహాయులవుతున్నారు. అయినా పెరుగుతున్న కష్టాలు, ఆర్థిక మాంద్యం, ఉపాధి లేకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, వచ్చినా గ్యారెంటీ లేకపోవడం, పెరుగుతున్న కుటుంబ కలహాలు ఇవి అన్ని మహిళలను పోరాటాల్లోకి లాక్కొస్తున్నాయి.
లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయ మిత్రులైన మహిళలు విజయవాడలో మహత్తర ప్రదర్శనలో పాల్గొన్నారు. లక్షలాదిమంది స్కీం వర్కర్లు జిల్లా కలెక్టరేట్ల దగ్గర కదం తొక్కారు. భూములు కోల్పోతున్న మహిళలు, ధరల భారాన్ని మోయలేని మహిళలు, జీతాలు సక్రమంగా లేని, రాని మహిళలు వీధుల్లోకి వస్తున్నారు. వీరిపై నిర్బంధాన్ని మోపుతున్నారు. జివో నం.1, ఉపా చట్టాలు అసమ్మతిని సహించలేని నిర్బంధ చట్టాలు.
మహిళల సమానత్వాన్ని ఆకాంక్షించే శక్తులు ఈనెల 10 వ తేదీ వరకూ ఎక్కడికక్కడ బడిలో, గుడిలో, అంగన్వాడీ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలి. మహిళల హక్కులను చాటి చెప్పే సాంస్కతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇద్దాం. హింసను అరికట్టాలి. ఉపాధి హామీలో బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ధరలు తగ్గించాలి. నిత్యావసర వస్తువులను చౌక ధరలకు సబ్సిడీ మీద సరఫరా చేయాలి. మహిళల విద్యావకాశాలు హరించే నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించాలి. కేరళ రాష్ట్రం మాదిరి జెండర్ బడ్జెట్ పెంచాలి. నెలసరి సెలవులు ఇవ్వాలి. వీటి సాధనకు మహిళలతో పాటు సమానత్వాన్ని కోరే వారందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
(8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
రచయిత : డి రమాదేవి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి