Oct 29,2023 07:34
  • సహజంగా మహిళలు తమ ఆరోగ్యం విషయంలోనూ కుటుంబంలో చివరి ప్రాధాన్యత ఇస్తారు. దాని ఫలితమే వారు ప్రాణాంతకమైన వ్యాధులను చివరిదశలో తెలుసుకుంటుంటారు. ఇంటికి వెలుగు ఇల్లాలు అని మాటల్లో కాకుండా.. ఆ వెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత ఆమెతో పాటు ఇంటిల్లిపాదిదీ. ఇటీవల మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తోంది. అదీ మొదటిదశలో తెలుసుకునేవారు తక్కువ. దశలు దాటిపోయాకే తెలుసుకుంటున్నారు. అయితే ఇటీవల బ్రెస్ట్‌లో ఏమైనా ట్యూమర్లు ఉన్నాయేమో చెప్పే ఒక వేరబుల్‌ అల్ట్రాసౌండ్‌ డివైజ్‌ వచ్చింది. ఇది బ్రా కప్‌లో పెట్టుకునేలా ఉంటే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన వచ్చింది ఒక వైద్యురాలికి. ఫలితంగా రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించే పరికరం తయారైంది. వివరాల్లోకి వెళితే..

ఇది కాఫీ తాగినంత సేపట్లో పరీక్షించి, ఫలితాన్ని చూపించగలదు. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) మీడియా ల్యాబ్‌లో తుర్కియే శాస్త్రవేత్త డాక్టర్‌ కనన్‌ దాదేవిరేన్‌, ఆమె బృందం కలిసి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. తన ఆంటీ రొమ్ము క్యాన్సర్‌తో చనిపోవడంతో, ఆమె గౌరవార్థం ఈ సాంకేతికతను రూపొందించారు. మమోగ్రామ్‌ పరీక్షల మధ్యలో అత్యధిక రిస్క్‌ ఉన్న రోగులను తరచూ పర్యవేక్షించేందుకు ఈ డివైజ్‌ ఉపయోగపడనుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం 2020లో రొమ్ము క్యాన్సర్‌ వల్ల 6,85,000 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 23 లక్షల మంది మహిళలకు ఇది నిర్ధారణైంది. మహిళల మరణాలకు రెండో ప్రధానకారణంగా రొమ్ము క్యాన్సర్‌ ఉంటోంది. రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తించినప్పుడు, ఐదేళ్ల రిలేటివ్‌ సర్వైవల్‌ రేటు అంటే నిర్ధారణ తర్వాత ఐదేళ్ల వరకూ బతికే రేటు 99 శాతంగా ఉంటుందని అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ తెలిపింది. క్యాన్సర్‌ను ఆలస్యం చేసి, అది నాలుగో దశకు చేరుకున్న తర్వాత గుర్తిస్తే మనుగడ రేటు మహిళల్లో కేవలం 22 శాతంగానే ఉంటుందని డాక్టర్‌ దాదేవిరెన్‌ చెప్పారు. మహిళల్ని బతికించే అవకాశాలను పెంచేందుకు ఈ డివైజ్‌ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.

  • ఎలా పనిచేస్తుంది?

ఈ సాంకేతికతలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ సాయం లేకుండానే మహిళలు వేసుకునే 'బ్రా'కి ఒక ఫ్లెక్సిబుల్‌, రీయూజబుల్‌ డివైజ్‌ను అతికించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ కనుగొనవచ్చు. తేనెతుట్ట ఆకారంలో ఉండే ఈ పరికరంలో ఆరు స్లాట్లు ఉంటాయి. ఒక స్లాటులో చిన్న ఆల్ట్రాసౌండ్‌ కెమెరా అతికించడం ద్వారా, అది ఈ ఆరు స్లాట్ల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో రొమ్ము లోపల భాగాన్ని అన్ని వైపుల నుంచి చూసుకోవచ్చు. ఆల్ట్రాసౌండ్‌ జెల్‌ అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. ప్రాథమిక దశలో ఉండే ట్యూమర్లను, అత్యంత చిన్నగా డయా మీటర్‌లో 0.3 సెంటిమీటర్లు ఉండే తిత్తిలను కూడా ఇది గుర్తించగలదని డాక్టర్‌ దాదేవిరేన్‌ చెప్పారు. ఇది చాలా కచ్చితత్వంతో పనిచేస్తుందని తెలిపారు.

  • ఎవరి కోసం..?

రెగ్యులర్‌ మామోగ్రామ్‌ల మధ్యలోనూ బ్రెస్ట్‌ ట్యూమర్లు అభివృద్ధి చెందుతూ ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. వీటినే ఇంటర్వల్‌ క్యాన్సర్లు అంటారు. మొత్తం రొమ్ము క్యాన్సర్‌ కేసులలో 20 నుంచి 30 శాతం ఉంటున్నాయి. తరచూ చెకప్‌ల సమయంలో బయటపడే వాటి కంటే ఈ ట్యూమర్లు చాలా శక్తిమంతమైనవిగా ఉంటాయని ఎంఐటీ టీమ్‌ చెప్పింది. ప్రధానంగా రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అత్యధిక ప్రమాదమున్న మహిళల కోసం ఈ డివైజ్‌ను ఆవిష్కరించారు. రెండు మామోగ్రామ్‌ల మధ్యలో / స్వీయ పరీక్షల ద్వారా ట్యూమర్లను గుర్తించేందుకు వారికి ఇది సాయం చేస్తుంది. ఈ ప్రక్రియలో ఏదైనా తేడాను గుర్తిస్తే, మామోగ్రామ్‌ అవసరమని నిపుణులు చెప్పారు.

  • దీని అభివృద్ధి తీరు..

ఈ వేరబుల్‌ హెల్త్‌ డివైజ్‌ను అభివృద్ధి చేసేందుకు ఎంఐటీ టీమ్‌ ఆరున్నర నెలల పాటు పనిచేసింది. ఆగస్టులో దీనికి అమెరికా పేటెంట్‌ లభించింది. మరిన్ని మానవ ప్రయోగాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఒక డివైజ్‌ ధర సుమారు వెయ్యి డాలర్ల వరకు ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.8,300 పైనే. పెద్ద మొత్తంలో వీటిని తయారుచేస్తే ఈ ధర తగ్గుతుందని డివైజ్‌ రూపకర్తలు చెప్పారు. ఈ పరికరం నాలుగు నుంచి ఐదేళ్లు పనిచేస్తుంది. రోజూ మీరు టిస్యూను స్కాన్‌ చేయాలనుకుంటే ఒక స్కాన్‌ను కాఫీ తాగినంత సేపట్లో చేసేసుకోవచ్చని ఆ బృందం తెలిపింది.

  • స్త్రీలకు సరికొత్త ఆశ..

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రొమ్ము క్యాన్సర్‌ వల్ల చనిపోతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉండేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి చివరి దశలలో దీనిని గుర్తించడమని చాలా అధ్యయనాలు తెలిపాయి. దీంతో పాటు అవసరమైన ఆరోగ్య సర్వీసులు అందుబాటులో ఉండటం లేదు. డబ్ల్యూహెవో డేటా ప్రకారం, అత్యధిక ఆదాయ దేశాల్లో ఐదేళ్ల మనుగడ రేటు బ్రెస్ట్‌ కేన్సర్‌ రోగులలో 90 శాతం కంటే అధికంగా ఉంది. అదేవిధంగా భారత్‌లో ఈ రేటు 66 శాతంగా, దక్షిణాఫ్రికాలో 40 శాతంగా ఉంది. శరీరంలో ఇతర భాగాలనూ స్కాన్‌ చేసే సామర్థ్యం ఈ డివైజ్‌కు ఉందని డాక్టర్‌ దాదేవిరేన్‌ చెప్పారు.