May 17,2023 12:26
  • సిఐటియు, ట్రాన్స్పోర్ట్ సంఘాల డిమాండ్

ప్రజాశక్తి-కాకినాడ : రవాణా వాహనాలపై క్వార్టర్లీ ట్యాక్స్ భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు ట్రాన్స్పోర్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, ట్రాన్స్ పోర్ట్ కన్వీనర్ కె సత్తిబాబు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ రంగం కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్నారు. ఇప్పటికే ఫైనాన్స్లు చెల్లించలేక, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, స్పేర్ పార్ట్ల ధరలు పెరిగి, రోడ్లు సక్రమంగా లేక ట్రాన్స్ పోర్ట్ రంగం చాలా ఇబ్బందులు పడుతుందన్నారు. ప్రక్క రాష్ట్రాల్లో వందల రూపాయలుగా ఉన్న గ్రీన్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది రూపాయలు వసూలు చేయడం చాలా దారుణమన్నారు. రవాణా వాహనాలపై రోడ్ ట్యాక్స్ 25 నుండి 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు ట్రాన్స్ పోర్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ట్రాన్స్ పోర్ట్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వీరబాబు, సత్తిబాబులు  కోరారు.