Jul 19,2022 06:54

     చట్టబద్ధతే లేని ఎ.పి. పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ను పట్టుకొని కొన్ని దశాబ్దాలుగా పౌరుల అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్న ప్రభుత్వ దమననీతికి హైకోర్టు ముకుతాడు వేసింది. తమకు గిట్టని, తమను ప్రశ్నించే వారిపై పోలీసులను ప్రయోగించి రౌడీ షీట్‌ తెరిచి వేధించడం పాలకులకు అలవాటైన విద్య. అకారణంగా పోలీస్‌ స్టేషన్లకు పిలిపించడం, గంటల కొలది వేచి ఉండేలా చేయడం, అర్ధరాత్రి అపరాత్రి అనుమానితుల ఇళ్లపై దాడులు, నిఘా సర్వసాధారణమై పోయింది. ఠాణాల్లో ఫొటోలను ప్రదర్శించడం రివాజుగా మారింది. ఇటువంటి నిరంకుశ చర్యలు ఇక కుదరదని న్యాయస్థానం చేసిన హెచ్చరిక రాజ్యం వేధింపులకు గురవుతున్న ప్రజాతంత్ర ఉద్యమాలకు ఊరట. దేశ వ్యాప్తంగా రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య, మానవ, పౌర హక్కుల హననం సాగుతున్న ప్రస్తుత తరుణంలో వ్యక్తులపై ఇష్టానుసారం బనాయిస్తున్న రౌడీషీట్ల వ్యవహారానికి కోర్టు అడ్డుకట్ట వేయడం మంచి పరిణామం. రౌడీషీట్ల కొనసాగింపుపై దాఖలైన 57 వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు ప్రభుత్వ నిర్బంధకాండను తూర్పారబట్టింది. రాజ్యాంగాన్ని, చట్టాలనే కాకుండా న్యాయస్థానాల తీర్పులను సైతం ఏ విధంగా ప్రభుత్వం విచక్షణారహితంగా, యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నదో బయట పెట్టింది.
ఎ.పి. పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ఎప్పుడో 1960లో రూపొందించబడి క్రమానుగతంగా సవరణలు జరిగాయి. మార్గదర్శకాలు మాత్రమేనని జీవోల్లో పేర్కొన్నారు. వీటిని పట్టుకొని ప్రభుత్వాలు పౌరులను రాచిరంపాన పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థలో క్షమించరానిది. ఏ వ్యక్తిపైనైనా నేరం అనుమానాన్ని వ్యక్తం చేయడానిక్కూడా సరైన సాక్ష్యం కావాలి. అలాంటిది నేరస్తులనే ముద్ర వేసి రౌడీషీట్‌లతో క్షోభ పెట్టడం అమానవీయం. స్టేషన్‌ పరిధి దాటాలంటే పోలీస్‌ల అనుమతి తీసుకోవాలి. ఎన్నికలు, పండుగలు, ప్రముఖుల పర్యటనల సమయంలో స్టేషన్‌కు బైండోవర్‌ కావాలి. ఈ చర్యలు ఆరోపణలెదుర్కొంటున్న వ్యక్తులను, వారి కుటుంబాలను సమాజం నుండి వెలివేస్తాయి. వేలి ముద్రల, సంతకాల సేకరణ, స్టేషన్లలో ఫోటోల ప్రదర్శన, వ్యక్తిగత వివరాల వెల్లడి ఇవన్నీ పౌరులకు రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును హరించేవి. కెఎస్‌ పుట్టుస్వామి కేసు సహా పలు మార్లు పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పోలీస్‌ ఆర్డర్స్‌ అతిక్రమిస్తున్నాయన్న హైకోర్టు వ్యాఖ్య ముమ్మాటికీ నిజం. నేరస్తులను అరెస్ట్‌ చేయడానికి ఐపిసి, సిఆర్‌పిసి, 1962-ఎ.పి. నేరస్తుల చట్టంలోని పలు సెక్షన్లను పోలీసులు ఉపయోగించుకునే వీలుంది. కానీ చట్టబద్ధత లేని పోలీస్‌ ఆర్డర్స్‌ను ఎంచుకోవడం ప్రభుత్వ నిరంకుశ, అసహన ధోరణిని తెలియజేస్తోంది.
    ప్రభుత్వాల నయా-ఉదారవాద విధానాలు ప్రజలకు భారంగా పరిణమించాయి. ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సహించలేని ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలపై, హక్కుల కార్యకర్తలపై కంటగింపు చర్యలకు పూనుకుంటున్నాయి. రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్య విలువలను అతిక్రమిస్తున్నాయి. కేంద్రంలో బిజెపి వచ్చాక ఒక పథకం ప్రకారం సిద్ధాంతంగానే ప్రతిపక్షాలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు, నిర్బంధాలు తారాస్థాయికి చేరాయి. హేయమైన రాజద్రోహం, ఉపా చట్టాల బనాయింపునకూ వెనుకాడట్లేదు. దిశ రవి, జర్నలిస్టు జుబెర్‌, తీస్తా సెతల్వాద్‌ అరెస్ట్‌లు మోడీ సర్కార్‌ అసహనానికి కొన్ని ఉదాహరణలు. రాష్ట్రాలు సైతం అదే ఒరవడిలో నడుస్తున్నాయి. గతంలో టిడిపి, ప్రస్తుత వైసిపి హయాంలో ఎ.పి.లో ఏడాది పొడవునా సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 పేరిట పౌరుల కదలికలపై ఆంక్షలు రుద్దబడుతున్నాయి. ప్రతిపక్షాలు, ముఖ్యంగా సిపిఎం, వామపక్షాల, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తల హౌస్‌ అరెస్టులు, ముందస్తు నిర్బంధాలు నిత్యకృత్యమయ్యాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్బంధ చర్యలను విడనాడాలి. దేశంలో జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీలలో 80 శాతం విచారణా ఖైదీలేనని స్వయంగా సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఉటంకింపు మన న్యాయ వ్యవస్థను, రాజ్యాన్ని తప్పక ప్రశ్నిస్తుంది. ఎ.పి. పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేనా ?