- నేటి ఆధునిక కాలంలో ఇంటర్నెట్‌పై ఆధారపడే అన్ని సేవలూ కొనసాగుతున్నాయి. నిత్యావసరాలు సైతం ఇంటర్నెట్‌తో ముడిపడిపోయాయి. ఇంటర్నెట్ లేకపోతే ఒక్క క్షణం కూడా పని జరగని పరిస్థితిలోకి మనిషి నెట్టబడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే- ఇంటర్నెట్ మనిషి అవయవాల్లో ఒకటిగా మారిపోయింది. ఇల్లు, ఆఫీసు, బయట... ఇంటర్నెట్ తప్పనిసరి. దీనికోసం రకరకాల నెట్‌వర్క్‌లు అందుబాటులో వున్నాయి. వాటిలో ఒకటి వైఫై (ఔఱ-ఖీఱ). ఇది ఒక కనెక్షన్ తీసుకుంటే ఇంటిల్లిపాదీ వాడుకోవచ్చు. ఇప్పుడు వైఫై (ఔఱ-ఖీఱ) రూటర్ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటోంది. దీని ద్వారా మొత్తం ఇంట్లో ఉన్న స్మార్ట్ పరికరాలను కనెక్ట్ చేయవచ్చు. స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, ఎయిర్ కండీషనర్, సిసిటీవి కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ అసిస్టెంట్ పరికరాలను వైఫైకి కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వైఫై సహాయంతో సినిమాలు చూడటం, హెచ్‌డి క్వాలిటీ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆఫీస్ వర్క్ వంటి ఎన్నో పనులు చేసుకోవడానికి అవసరమైన ఇంటర్నెట్‌ను వైఫై ద్వారా పొందవచ్చు. అదే సమయంలో ఈ వైఫైని సరైన స్థలంలో వుంచడం కూడా ముఖ్యమే. లేదంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే.
సాధారణంగా వైఫై రూటర్ ఎలక్ట్రోమాగెటిక్ రేడియేషన్‌ను, విద్యుదయస్కాంత వికిరణాన్ని విడుదల చేస్తుంది. ఇది మన శరీరంపై ప్రభావం చూపుతుంది. తద్వారా అనేక వ్యాధులకు కారణమౌతుంది. ఇంటర్నెట్‌ను వాడే క్రమంలో దాని సిగల్స్ సరిగా వస్తున్నాయో లేదో, నెట్ వస్తున్నదో రావట్లేదో మాత్రమే చూసుకుంటాం తప్ప.. దీనివల్ల ఎదురయ్యే సమస్యలు చాలా మందికి అవగాహన ఉండదు. అవగాహన వున్న వారు కూడా పెద్దగా పట్టించుకోని పరిస్థితి వుంది. వైఫై రూటర్ వున్న ప్రదేశంలో నిద్రించేవారు నిద్రలేమితో బాధపడవచ్చు. వైఫై రూటర్ నుంచి వెలువడే ఎలక్ట్రోమాగెటిక్ రేడియేషన్ కిరణాలే దీనికి కారణం. దీనివల్ల ఏర్పడే నిద్రలేమి సమస్య భవిష్యత్తులో చాలా తీవ్రంగా మారొచ్చు. శరీరంలో అలసట, మైగ్రేన్ వంటి సమస్యలకు కూడా కారణమౌతుంది.
వైఫై రూటర్‌ని ఉపయోగించేవారు దీన్ని నిర్ణీత దూరంలో వుంచడం.. నిద్రించే ప్రదేశాలకు దూరంగా వుంచడం.. నిర్ణీత సమయంలో మాత్రమే ఉపయోగించుకోవడం.. పని ముగిసిన వెంటనే.. స్విచ్ ఆఫ్ చేయడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. కానీ.. చాలా మంది వైఫై రూటర్‌ను రాత్రింబవళ్లూ ఆన్ చేసే ఉంచుతుంటారు. తద్వారా రూటర్ నుంచి వెలువడే రేడియేషన్ కిరణాలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అల్జీమర్స్ వంటి సమస్య కూడా వచ్చే ప్రమాదం వుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి వైఫై రూటర్‌ని సరైన స్థానంలో వుంచడం వల్ల విద్యుదయస్కాంత వికిరణం ప్రభావం నుంచి తప్పించుకునే అవకాశం వుంది. అలాగే.. రూటర్‌ను మనుషులు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశంలో ఉంచొద్దు. ఇంట్లోని డెస్క్, టేబుల్, షెల్ఫ్ వంటి ప్రాంతాల్లో రూటర్‌ను ఉంచకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో విద్యుదయస్కాంత వికిరణాన్ని పెంచడంలో సహాయపడతాయి. అలాగే.. వైఫై రూటర్ నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావం నుంచి కొంత దూరంగా ఉండటానికి రూటర్‌ను ఇంటి మూలల్లో.. ఎక్కువగా మనుషులు తిరగని ప్రదేశంలో వుంచే ప్రయత్నం చేయాలి. రూటర్‌ను ఇరుగ్గా లేదా సిగల్ రాని చోట పెడితే ఇంటర్నెట్ స్పీడ్ రాదని చెబుతున్నారు. గాలి తగిలే చోట, సిగల్ ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో చూసుకొని, అక్కడ రూటర్‌ని ఉంచితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. మన యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లీక్ అయితే, మన చుట్టుపక్కల వారు ఎవరైనా కూడా ఉపయోగించే అవకాశం వుంది. దానివల్ల మీకు వచ్చే నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. కనుక తరచూ వైఫై పాస్వర్డ్ మారుస్తూ ఉండాలి. రాత్రిపూట, ఇంటర్నెట్ వినియోగించని సమయంలో టైమర్ / స్విచ్‌ని ఉపయోగించి రూటర్ ఆఫ్ చేసుకోవడం అన్నివిధాలా మంచిది.
స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి ఐప్యాడ్స్, స్మార్ట్ టీవీలు లాంటివి అందరి ఇళ్లలోకీ వచ్చేశాయి. అయితే ఇన్ని డివైజ్‌లు ఒకేసారి వైఫైకి కనెక్ట్ చేస్తే సమస్యలు తప్పవని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఎక్కువ డివైజ్‌లు వైఫైకి కనెక్ట్ చేస్తే డేటా స్పీడ్ తగ్గడంతో పాటు ఒక్కోసారి కనెక్షన్ పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. రూటర్‌కు కనెక్ట్ చేసుకున్న డివైజ్‌లలో వాడని వాటిని డిస్కనెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంటర్నెట్‌ను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. ఈ వైఫై రూటర్‌తో అశ్రద్ధ అనారోగ్యానికి మూలమని గుర్తించాలి.