
పువ్వులు ఉన్నవి ఎందుకు?
పరిమళమిచ్చేటందుకు!
నవ్వులు ఉన్నవి ఎందుకు?
నవ్యతనొందేటందుకు !
మువ్వలు ఉన్నవి ఎందుకు?
మధురిమలిచ్చేటందుకు!
గువ్వలు ఉన్నవి ఎందుకు?
స్వేచ్ఛగ ఎగిరేటందుకు!
మనసులు ఉన్నవి ఎందుకు?
ప్రేమలు పుట్టేటందుకు!
మాటలు ఉన్నవి ఎందుకు?
మమతలు చూపేటందుకు!
వానలు కురియును ఎందుకు?
పంటలు పండేటందుకు!
వనములు విరియును ఎందుకు?
సొగసులు రువ్వేటందుకు!
చేతులు ఉన్నవి ఎందుకు?
సాయం చేసేటందుకు!
కన్నులు ఉన్నవి ఎందుకు?
మంచిని చూసేటందుకు!
భాషలు ఉన్నవి ఎందుకు?
భావం తెలిపేటందుకు!
పొత్తములున్నవి ఎందుకు?
జ్ఞానం జుర్రేటందుకు!
- గద్వాల సోమన్న,99664 14580.