Jul 28,2023 22:17

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో బెయిలు దరఖాస్తు చేసుకోవడానికి నిందితుడు శివశంకర్‌రెడ్డి కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టత కోరవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇందులో తప్పేముందని ప్రతివాదుల్ని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారిని మార్చాలంటూ శివ శంకర్‌రెడ్డి భార్య తులసమ్మ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఆ పిటిషన్‌ విచారణ సమయంలో ఆరునెలల్లో ట్రయల్‌ ప్రారంభం కాకుంటే శివశంకర్‌రెడ్డి బెయిలు దరఖాస్తు చేసుకోవచ్చని జస్టిస్‌ ఎంఆర్‌షా, జస్టిస్‌ సిటి రవికుమార్‌ల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఒకవేళ విచారణ మొదలైతే ఎప్పటి వరకూ బెయిలు పిటిషన్‌ దాఖలు చేసుకొనే అవకాశం లేదో తెలపాలని కోరుతూ మార్చి 29 నాటి ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలంటూ తులసమ్మ మిస్‌లీనియస్‌ అప్లికేషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ సిటి రవికుమార్‌, జస్టిస్‌ సంజరు కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. బెయిలు పిటిషన్‌ దాఖలు చేసుకోవడానికి మార్చి 29 నాటి ఉత్తర్వులు అడ్డురావని స్పష్టత ఇవ్వాలని తులసమ్మ తరపు సీనియర్‌ న్యాయవాది గిరి ధర్మాసనాన్ని కోరారు. ఈ సమయంలో వివేకా హత్య కేసుకు సంబంధించి వేర్వేరు పిటిషన్లు మరో ధర్మాసనం విచారిస్తోందని సునీత నర్రెడ్డి తరపు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ అగర్వాల్‌ తెలిపారు. సంబంధం లేని వాదనలు చేస్తుంటే పిటిషన్‌లో ప్రధాన ప్రతివాది సిబిఐ న్యాయవాదులు ఏమీ మాట్లాడడం లేదని గిరి అసహనం వ్యక్తం చేశారు. వేసవి సెలవుల్లో జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం ఒక పిటిషన్‌ విచారణ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లు అన్నీ జత చేసి సిజెఐ సూచనలు తీసుకొని తగిన బెంచ్‌ ముందు జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించిందని, ప్రస్తుతం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం విచారణ జరుపుతోందని అగర్వాల్‌ తెలిపారు. ఆయా అంశాలకు ప్రస్తుత మిస్‌లీనియస్‌ అప్లికేషన్‌కు సంబంధం లేదని గిరి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు, అలాగే.. ఇప్పుడు కూడా సిబిఐ న్యాయవాదులు ఏమీ మాట్లాడడం లేదని గిరి అసహనం వ్యక్తం చేశారు. సిజెఐ ఉత్తర్వులు ఉంటే ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని జస్టిస్‌ సిటి రవికుమార్‌ పేర్కొన్నారు. అన్ని పిటిషన్లూ ఒకే ధర్మాసనం విచారించాలని ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అని ప్రశ్నించగా లేవని అగర్వాల్‌ సమాధానమిచ్చారు. ''మార్చి 29 నాటి ధర్మాసనంలో సభ్యుడిని. ఆ ఉత్తర్వుల ప్రకారం ట్రయల్‌ ప్రారంభం కాకపోతే నిందితుడు బెయిలుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రయల్‌ ప్రారంభమైతే నిందితుడు బెయిలు దాఖలు చేసుకోలేరు. దీనిపై స్పష్టత కోరుతున్నారు. తప్పేముంది'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవసరమైతే ఒకే ధర్మాసనం అన్ని పిటిషన్లు విచారించాలా అని ఏమైనా ఉత్తర్వులు ఉన్నాయేమో రిజిస్ట్రీ వద్ద వెరిఫై చేసుకుంటామన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ సోమవారం చేపడతామని స్పష్టం చేసింది.