
- వాస్తవంగా 2021-22లో దేశంలోని అన్ని స్టీల్‌ప్లాంట్లు భారీగా లాభాలు ఆర్జించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా 5.14 మిలియన్ టన్నుల ఉత్పత్తితో రూ.28245 కోట్ల టర్నోవర్ సాధించింది. పాత రికార్డులను బద్దలుకొట్టింది. గత ఐదేళ్ల నుండి వస్తున్న నష్టాలను అధిగమించి ఏకంగా రూ.1008 కోట్లు లాభాలు పొంది నరేంద్ర మోడీ నోరు మూయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక ప్రభుత్వాలకు రూ.4 వేల కోట్లు పన్నుల రూపంలో చెల్లించింది. బిజెపి ఆటంకాలు సృష్టించకుండా వున్నట్లయితే, బ్యాంకుల నుండి కనీసం ముడి సరుకుల కొనుగోలుకు అవసరమైన రుణాలు మంజూరు చేసినట్లైతే మరో 3 వేల కోట్లు లాభం పొందేది.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మటానికి కేంద్ర బిజెపి సర్కార్ గత ఏడాదిన్నర నుండి శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే న్యాయ, ఆర్థిక సలహా సంస్థలను నియమించింది. తాజాగా ప్లాంట్ ఆస్తుల మదింపుకు కూడా ఒక సంస్థతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలతో కమిటీని నియమించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. కార్మికులు పట్టుదలతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దాంతో బిజెపి తన ఎజెండాను వేగంగా ముందుకు తీసుకెళ్ళలేక పోతున్నది. ఈ పరిస్థితుల్లో కొత్త కుట్రలకు తెరలేపింది. ప్లాంట్‌ను నష్టాలు పాల్జేసే చర్యలకు పూనుకున్నది.
గత 6 నెలల నుండి ఉత్పత్తిని దారుణంగా తగ్గించారు. అనేక ఆంక్షలు విధించారు. స్టీల్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లలో ఒక దాన్ని పూర్తిగా గత జనవరి నుండి మూసేశారు. మరొక బ్లాస్ట్ ఫర్నేస్‌లో 30 శాతం ఉత్పత్తి కోత పెట్టారు. దీని వల్ల బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్‌తో నడిచే 120 మెగా వాట్ల సామర్ధ్యం గల క్యాప్టివ్ పవర్‌ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బయట నుండి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి వస్తున్నది. ఆరు రోలింగ్ మిల్స్‌లో నాలుగు చోట్ల ఉత్పత్తి నిలిపివేశారు. ఆరవ కోక్ ఓవెన్ బ్యాటరీని నిర్మించకుండా రెండేళ్ల నుంచి అనుమతులు నిరాకరిస్తున్నారు. ముఖ్యమైన స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్.ఎం.ఎస్)లో 30 శాతం ఉత్పత్తి కోత పెట్టారు. టన్ను రూ.80 వేలు అమ్ముతున్న స్టీల్ రాడ్ల ఉత్పత్తిని తగ్గించి రూ.45 వేలకు అమ్మే బ్లూమ్స్‌ను ఉత్పత్తి చేస్తూ ప్లాంట్ ఆదాయానికి గండి కొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు చేయకపోతే స్థానిక యాజమాన్యాన్ని వెంటనే తొలగించి నేరుగా స్టీల్ జాయింట్ సెక్రటరీని నియమిస్తామని నీతి ఆయోగ్ ద్వారా మోడీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బొగ్గు గనుల వేలం ద్వారా 2019లో విశాఖ స్టీల్‌ప్లాంట్ జార్ఖండ్ లోని రభోది బొగ్గు గనులను దక్కించుకుంది. దాదాపు 30 ఏళ్లకు సరిపడ 133 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్ సామర్ధ్యం కలిగినది ఈ బొగ్గు గని. ఇటీవల దీనిని బిజెపి సర్కార్ ఏకపక్షంగా రద్దు చేసి ప్రైవేట్ సంస్థకి ధారాదత్తం చేసింది. సొంత బొగ్గు గనులు ఉంటే విదేశాల మీద ఆధారపడే స్థితి తగ్గిపోతుంది. అంతేకాక ఉత్పత్తి వ్యయంలో 10 నుండి 15 శాతం తగ్గుతుంది. ఇదే అదనుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం కూడా విజయనగరం జిల్లా వద్ద విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి గల 67 హెక్టార్ల లోని రివర్ శాండ్ మైన్‌ను రద్దు చేసింది. విదేశాల నుండి దిగుమతి చేసుకునే కోకింగ్ కోల్ ధర పెరిగిందనే సాకుతో దిగుమతి తగ్గించుకోవడం వల్ల థర్మల్ పవర్ ప్లాంట్ (టిపిపి) విద్యుత్ ఉత్పత్తిని 300 నుండి 200 మెగావాట్లకి తగ్గించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని బిజెపి...తడిగుడ్డతో ఎలా గొంతు కోస్తున్నదనేదానికి మరో ఉదాహరణ ఏమిటంటే...తాజాగా నిర్మించిన రైల్ వీల్ ప్లాంట్. ఈ ప్లాంట్ ను రాజకీయ అవసరాల కోసం ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి లో నిర్మించారు. దీనిలో విశాఖ స్టీల్‌ప్లాంట్ రూ.2 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఏడాదికి లక్ష రైలు చక్రాలు తయారు చేసే సామర్ధ్యం వుంది. ఉత్పత్తి వ్యయంపై 15 శాతం అధికంగా ధర చెల్లించి ఏడాదికి లక్ష చక్రాలు కొనుగోలు చేస్తామని విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో భారత రైల్వే శాఖ ఒప్పందం చేసుకుంది. 2021లో ఉత్పత్తి ప్రారంభించింది. కానీ బిజెపి చక్రాలను కొనుగోలు చేయవద్దని హుకుం జారీ చేసింది. ఫలితంగా రైల్‌వీల్ ఫ్యాక్టరీ కేవలం 687 చక్రాలు తయారు చేసి ఉత్పత్తి నిలిపివేసింది. మోడీ ఆదేశాలతో రైల్వే శాఖ నూతనంగా ప్రారంభిం చిన 400 భారత రైళ్లకు అవసరమైన చక్రాలను చైనా కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్‌ని నిలువునా ముంచింది. అలాగే ఒరిస్సా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో ముడి ఇనుప గనుల కోసం సుమారు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టింది. కానీ ఈ ఏడేళ్ల కాలం నుండి ఒక్క టన్ను ముడి ఖనిజాన్ని కూడా తీసుకోనీయకుండా అనేక ఆటంకాలు కలిగిస్తున్నది. అంతేగాక ప్లాంట్‌కి సొంత క్యాప్టివ్ ఇనుప గనులు కేటాయించకుండా ప్లాంట్‌ని నష్టాల పాల్జేస్తున్నది.
ఈ కుట్రల వల్ల స్టీల్ ఉత్పత్తి గత జనవరి నుండి భారీగా తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5.5 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది సాధించాలంటే రోజుకి కనీసం 15100 టన్నులు లేదా నెలకి 4.53 లక్షల స్టీల్ ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు ఎంత చేస్తుందో తెలుసా? రోజుకి సగటున 12000 టన్నులు లేదా నెలకు 3.60 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నది. కనీసం ఈ స్థాయిలోనైనా ఉత్పత్తి సాగితే ఈ ఏడాది చివరికి 4.3 మిలియన్లు మాత్రమే ఉత్పత్తి సాధిస్తుంది. నిర్దేశించుకున్న లక్ష్యానికి 12 లక్షల టన్నులు, గత ఏడాది సాధించిన ఉత్పత్తికి 9 లక్షల టన్నులు ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల జరిగే పరిణామం ఏమిటి? తక్కువ ఉత్పత్తి వల్ల ఉత్పత్తి వ్యయం అధికమవుతుంది. ఓవర్‌హెడ్స్ ఎక్కువవుతాయి. మార్కెట్‌లో పలికే స్టీల్ ధర కన్నా విశాఖ స్టీల్ ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. ఫలితంగా ప్లాంట్ భారీగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. బిజెపి కోరుకుంటున్నది ఇదే. ఈ విధంగా నష్టాలపాలైతే ప్రజల్లో ప్లాంట్‌పై దురబి óప్రాయం కలుగుతుంది. స్టీల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నష్టాలు వచ్చాయంటే కార్మికులు పనిచేయడం లేదనే భావన ప్రజల్లో కలుగుతుంది. దీంతో బిజెపి ప్లాంట్‌ను అమ్మేయాలనుకున్న లక్ష్యం నెరవేరుతుందనేది బిజెపి ఎజెండా. అంతేగాక విస్తరణ కోసం ప్లాంట్ వద్ద వున్న 9 వేల ఎకరాల భూమిని కూడా ప్లాంట్ నుండి వేరుచేసి అమ్మటానికి కుట్ర సాగుతున్నది.
వాస్తవంగా 2021-22లో దేశంలోని అన్ని స్టీల్‌ప్లాంట్లు భారీగా లాభాలు ఆర్జించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా 5.14 మిలియన్ టన్నుల ఉత్పత్తితో రూ.28245 కోట్ల టర్నోవర్ సాధించింది. పాత రికార్డులను బద్దలుకొట్టింది. గత ఐదేళ్ల నుండి వస్తున్న నష్టాలను అధిగమించి ఏకంగా రూ.1008 కోట్లు లాభాలు పొంది నరేంద్ర మోడీ నోరు మూయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక ప్రభుత్వాలకు రూ.4 వేల కోట్లు పన్నుల రూపంలో చెల్లించింది. బిజెపి ఆటంకాలు సృష్టించకుండా వున్నట్లయితే, బ్యాంకుల నుండి కనీసం ముడి సరుకుల కొనుగోలుకు అవసరమైన రుణాలు మంజూరు చేసినట్లైతే మరో 3 వేల కోట్లు లాభం పొందేది.
ఇప్పుడు ప్లాంట్ కనీస స్థాయిలోనైనా అంటే 5.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలంటే ప్లాంట్ వద్ద కనీసం రూ.14 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అవసరం. ఇది బ్యాంకుల నుండి ప్లాంట్ యాజమాన్యం సమకూర్చు కోవాలి. బ్యాంకులు ఈ స్థాయిలో రుణాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్లాంట్ భూములు రాష్ట్రపతి పేరు మీద వున్నాయి. దీని వల్ల భూములను తనఖా పెట్టటం కుదరదు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మద్దతు గానీ లేదా బ్యాంకు రుణాలు గ్యారంటీ గాని ఇవ్వడం లేదు. దీంతో ప్లాంట్ ఉత్పత్తి సాగించటా నికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ఈ సమస్య అంతిమం గా బలవంతపు ఉత్పత్తి కోతకు దారితీస్తుంది.
నేడు ప్లాంట్ సామర్ధ్యం 7.3 మిలియన్ టన్నులు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సామర్ధ్యాన్ని ఉపయోగించుకొని 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తే నాలుగేళ్లలో అప్పులన్నీ తీరిపోతాయి. రిజర్వ్ నిధులను సృష్టించుకునే స్థితికి చేరుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో స్టీల్ సప్లరు కొరత కొనసాగుతున్నది. దీనికి ప్రధాన కారణం కోవిడ్ వల్ల నిలిచిపోయిన వివిధ రకాల ప్రాజెక్ట్లులు తిరిగి ప్రారంభం కావడంతో స్టీల్ డిమాండ్ బాగా పెరిగింది.
ధరలు రెట్టింపయ్యాయి. రెండో వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ దేశాల నుంచి ముఖ్యంగా యూరప్ దేశాలకు ఎగుమతి అయ్యే స్టీల్‌కు అంతరాయం ఏర్పడింది. చైనా స్టీల్ ఎగుమతులను తాత్కాలికంగా తగ్గించింది. ఈ పరిస్థితులు మన దేశంలోని స్టీల్ పరిశ్రమలకు గత ఏడాది బాగా లాభాలు తెచ్చిపెట్టాయి. ఫలితంగా 2021-22లో మన దేశంలో 118 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి జరిగింది. 13.5 మిలియన్ టన్నుల స్టీల్ ఎగుమతి చేసి లక్ష కోట్లు ఆదాయం పొందాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఎగుమతుల ద్వారా రూ.5614 కోట్లు ఆదాయం సంపాదించింది. ఈ ఏడాది కూడా మన దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అందుకే దేశంలోని అన్ని స్టీల్ పరిశ్రమలు తమ స్థాపిత శక్తిని పూర్తిగా వినియోగించుకొని భారీగా లాభాలు పొందటానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తిని మొత్తం దెబ్బ తీసి నష్టాలపాలు చేయటానికి బిజెపి సర్కార్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. నరేంద్రమోడీ ప్రభుత్వం నిలువునా స్టీల్‌ప్లాంట్‌ను ముంచేస్తుంటే రాష్ట్రం లోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైయస్‌ఆర్‌సిపి, టిడిపి, జనసేన పార్టీలు నోరెత్తి మాట్లాడటం లేదు. బిజెపి కి లొంగిపోవడం, చెట్టపట్టాలు వేసుకొని స్టీల్ ప్లాంట్‌కి హాని చేస్తున్నాయి. పైకి స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకూడదంటూనే అంతర్గతంగా బిజెపి తో లాలూచీ పడుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ స్టీల్‌ప్లాంట్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయి. బిజెపి కి మేలు చేస్తున్నాయి. ఈ పార్టీల అవకాశవాద వైఖరిపై కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోరాడవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. లేకపోతే 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ చేజారిపోయే ప్రమాదం ముంచుకొస్తున్నది.
-డా||బి. గంగారావ్