మెగా అల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. తేజ్‌కి బైక్ యాక్సిడెంట్ జరిగిన రెండేళ్ల తర్వాత విడుదలైన తొలిచిత్రం ఇది. ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఏమేరకు రీచ్ అయిందో తెలుసుకుందాం..!
కథ
90వ దశకంలో సాగే కథ ఇది. 1979లో రుద్రవనం అనే గ్రామంలో వెంకటాచలం (కమల్ కామరాజ్) అతని భార్య క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో ఆ ఊరి ప్రజలు ఆ దంపతులను చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేస్తారు. ఆ సమయంలో వెంకటాచలం భార్య పుష్కరకాలంలో ఈ ఊరు వల్లకాడవుతుందని శపిస్తుంది. ఆమె అన్నట్టుగానే పుష్కరకాలం తర్వాత ఆ ఊరిలో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అదే సమయంలో ఆ ఊరి జాతరకి సూర్య (సాయిధరమ్‌తేజ్) వస్తాడు. ఆ ఊరి చావులను అరికట్టేందుకు ఆ ఊరి నుంచి బయటకు వెళ్లకూడదని, బయట నుంచి ఆ ఊరికి రాకూడదని ఆ ఊరి పెద్దలు నిర్ణయించి అష్టదిగ్బంధనం చేస్తారు. ఆ ఊరి సర్పంచ్ కూతురు నందిని (సంయుక్త)ని చూసి సూర్య తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆ వరుస హత్యల్లో తన ప్రియురాలు కూడా ఉందని తెలుసుకున్న సూర్య.. ఆ హత్యని ఆపగలిగాడా? అసలు ఆ ఊరిలో హత్యలు చేస్తున్నదెవరు? ఎందుకు చేస్తున్నారు? అనే మిస్టరీని తెలుసుకునే ప్రయత్నంలో అతనికెలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటినెలా ఎదుర్కొన్నాడు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
డైరెక్టర్ ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని ప్రేక్షకులకు ట్రైలర్ ద్వారా ముందే చెప్పాడు. అయితే దర్శకుడు తాను రాసుకున్న కథకు నూరుపాళ్లు న్యాయం చేశాడా? అనే దానికొస్తే.. ప్రేక్షకుడిని రెండున్నర గంటలపాటు ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ కార్తీక్ దండు విజయం సాధించాడు. ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్టాఫ్‌లో వెంకటాచలం దంపతుల హత్యతో స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందో ప్రేక్షకుడికి ముందే తెలిసిపోయింది. ఆ తర్వాత హీరో సాయిధరమ్‌తేజ్ ఎంట్రీ అదిరిపోతుంది. రామచంద్రవనం సర్పంచ్ రాజీవ్ కనకాల కుమార్తె సంయుక్తను సూర్య చూడడం.. ప్రేమలో పడడం రొటీన్‌గా ఉంది. ఇక ఊరిలో చనిపోయిన వెంకటాచలం భార్య శపించినట్టుగా ఆ ఊరిలో ఊహించనివిధంగా హత్యలు జరగడం కథలో ఆసక్తిని కలిగిస్తుంది. ఆ హత్యల్లో హీరో చెల్లెలు (యాంకర్ శ్యామల)కూడా ఉంటుంది. దీంతో సూర్య ఆవేదనకు గురై.. ఆ మర్డర్‌ల మిస్టరీని చేధించడానికి హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత హత్య ఎవరిదనే విషయాన్ని రివీల్ చేస్తూ విరామం వస్తుంది. ఇక సెకండాఫ్‌లో హీరోహీరోయిన్లకి స్కోప్ దక్కింది. ఆ హత్యల వెనుకున్న మిస్టరీని కనుక్కునేందుకు హీరో ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. చివరికి క్లైమాక్స్ అలరిస్తుంది. ఈ చిత్రంలో సంయుక్త నటన సినిమాను మరోస్థాయిలో నిలబెట్టింది. సాయిధరమ్‌తేజ్ నటన కూడా ఆకట్టుకుంది. ఆయన ప్రమాదానికి గురైన ఛాయలు ఈ చిత్రంలో ఎక్కడా కనిపించకుండా తేజ్ తన నటనతో మెప్పించాడు. సుకుమార్ ప్రతిభ స్క్రీన్‌ప్లేలో కనిపిస్తుంది. కార్తీక్ దండు ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ట్విస్టులతో, కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..
హీరో తేజ్ నటన బాగుంది. హీరోయిన్ సంయుక్త ఆ పాత్రకు వందశాతం న్యాయం చేసింది. రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సాయిచంద్, రవి నటన తదితర నటీనటులు వాళ్ల పాత్రల పరిధిమేరకు నటించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.










