ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పలతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చాలామంది వైరల్ ఫీవర్లతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కాలంలో మండలంలో వైరల్ ఫీవర్లతో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే మండలంలో ఏ గ్రామానికి వెళ్లిన ఇంటిలో ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని ఈ వైరల్ ఫీవర్ ఇంటిలో ఒకరికి వచ్చిందంటే కుటుంబ సభ్యులందరికీ సోకుతోందని కూలీనాలీ చేసుకునే వారి పరిస్థితి చాలా దుర్భరంగా మారింది. ప్రస్తుతం మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారు మండలంలో ఏ గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంటే ఆ గ్రామానికి వెళ్లి చూపించుకుంటున్నారు. నడవడానికి చేతకాని వారు గత్యంతరం లేని పరిస్థితిలో గ్రామాలకు వచ్చే ఆర్ఎంపీల వద్దనే వందలాది రూపాయలు ఖర్చు చేస్తూ వైద్య సేవలు పొందుతున్నారు. మండలంలో పెరిగిన వైరల్ ఫీవర్ నియంత్రణ కొరకు నార్పల పప్పూరు ప్రాథమిక వైద్యశాలల పరిధిలో వైద్య సిబ్బంది గ్రామీణ ప్రాంతా ప్రజలకు అందుబాటులో ఉండి స్థానిక ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల సహకారంతో వైరల్ ఫీవర్ ల నియంత్రణకు కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు. నీటి ప్రభావమే కారణమంటున్న వైద్యులు.... మండల వ్యాప్తంగా ఇటీవల కాలంలో వైరల్ ఫీవర్లు అధికమైనది నీటి ప్రభావమే కారణమని నార్పల ప్రాథమిక వైద్యశాల వైద్యులు ప్రవీణ్ కుమార్ పప్పూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులు రవిశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ ప్రభావము వలన నీటిలో మార్పులు రావడంతోనే నార్పల మండలంలో ఇటీవల కాలంలో వైరల్ జ్వరాలు అధికమయ్యాయని మండలంలో సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో తాము తమ సిబ్బంది కూడా పర్యటిస్తున్నామని తెలిపారు. ఈ వైరల్ ప్రభావంతో 100 లోపల ఉండే ఓ పి గత వారం రోజుల నుండి 150 నుండి 300 వరకు ఉంటుందని వైద్యులు తెలిపారు. అదేవిధంగా జ్వరం ఒకరి నుండి ఒకరికి సక్రమించకుండా వైద్యం కంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని గంట గంటకి చేతులు శుభ్ర పరుచుకుంటూ, నీరు కాచి వడగట్టి తాగాలని రాత్రి సమయంలో దోమతెరలు వాడాలని ప్రయాణాలు చేసేటప్పుడు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వినియోగించడం వలన సాధ్యమైనంత వరకు ఇది ఇతరులకు వ్యాపించదని వైరల్ ఫీవర్లు అదుపులోకి వచ్చేంతవరకు కరోనా సమయంలో పాటించిన నియమ నిబంధనలు పాటించడం మంచిదని వైద్యులు ప్రవీణ్ కుమార్, రవిశంకర్ అంటున్నారు.










