Jan 18,2023 21:12
  • లైంగిక వేధింపులతో ఆత్మహత్య చేసుకోబోయా: వినేశ్‌
  • తిట్టేవారు, కొట్టేవారు : భజరంగ్‌
  • జంతర్‌మంతర్‌ వద్ద స్టార్‌ రెజ్లర్ల ఆందోళన

న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బిజెపి ఎంపి, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను తక్షణం తొలగించాలంటూ జంతర్‌ మంతర్‌ వద్ద మహిళా రెజ్లర్లు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో వినేశ్‌ పోగాట్‌, సాక్షిమాలిక్‌, సంగీతా ఫొగాట్‌, సోనమ్‌ మాలిక్‌, సరితా మోర్‌, అన్షు, భజరంగ్‌ పూనియాతోపాటు 30మంది స్టార్‌ రెజ్లర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. బ్రిజేశ్‌, కోచ్‌ల లైంగిక వేధింపులు తట్టుకోలేక తాను ఓసారి ఆత్మహత్య చేసుకోబోయానని, ఎందుకూ పనికిరావని ఎంతో మానసిక క్షోభకు గురి చేసేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. జాతీయ శిబిరాల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న కొందరు కోచ్‌లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని, అందులో బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ కూడా ఒకరని తెలిపారు. చాలామంది యువ రెజ్లర్లు తనవద్దకు వచ్చి ఏడ్చేవారని, తనకు తెలిసినంతవరకు 20మంది బాలికలు జాతీయ శిబిరంలో లైంగిక వేధింపులకు గురౌతున్నట్లు తెలిపారని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయాన్ని ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధపడేవారని, ఎవరికైనా ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదని ఆమె తెలిపారు. తమ గాయాల గురించి అస్సలు పట్టించుకోరని, వారిపై ఫిర్యాదు చేసినందుకు వెళ్తే.. చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయి'' అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. బ్రిజ్‌ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేవరకు తాము ధర్నా కొనసాగిస్తామని, అప్పటిదాకా ఏ అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొనబోమని స్పష్టం చేశారు. 2011 నుంచి బ్రిజ్‌ భూషణ్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019లో వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రెజ్లర్లను కొట్టేవారు: భజరంగ్‌ పూనియా
స్టార్‌ రెజ్లర్‌ భజరంగ్‌ పూనియా మాట్లాడుతూ.. ''ఫెడరేషన్‌లో ఉన్నవారికి ఆట గురించి ఏ మాత్రం తెలియదని, రెజ్లర్లను వారు చాలా వేధిస్తున్నారని తెలిపాడు. బ్రిజ్‌ భూషణ్‌ మమ్మల్ని తిట్టేవారు, కొట్టేవారు కూడా. మా పోరాటం ప్రభుత్వం, 'స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా'పై కాదు. కేవలం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌పైనే'' అని చెప్పాడు.