- విజయ్ ఆంటోని చాలామందికి ఓ హీరోగా మాత్రమే తెలుసు. కానీ అతనిలో దాగి ఉన్న ప్రతిభ చాలా కొద్ది మందికే తెలుసు. సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా ఇలా పలు క్రాఫ్ట్స్‌లో అనుభవం ఉన్న విజయ్ ఆంటోని జీవితంలో ఎన్నో కష్టాలను చవిచూశారు. అయినా కొత్త విషయాలు నేర్చుకోవడంలోనూ, తెలుసుకోవడంలోనూ ఆయన ఎప్పుడూ వెనకాడలేదు. ఈ మధ్య ఆయన పెద్ద కూతురు చనిపోయారు. ఆ బాధ నుంచి బయటపడకముందే, ఇచ్చిన డేట్స్ ప్రకారం, మేకర్స్ ఇబ్బంది పడకూడదని షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన డెడికేషన్ చూసి చిత్రయూనిట్ ఆశ్చర్యపోయింది. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం.
'మాది తమిళనాడులోని నాగర్‌కోయిల్. నాన్న గవర్నమెంట్ ఆఫీస్‌లో క్లర్క్‌గా పని చేసేవారు. ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. మా చెల్లికి ఐదేళ్లు. నాన్న ఆత్మహత్య మా వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. నాన్న చనిపోయిన తర్వాత మమ్మల్ని పోషించడానికి అమ్మ చాలా కష్టపడింది. ఆ సమయంలో కుటుంబ భారం మొత్తం అమ్మపైనే పడింది. సొంత ఇల్లు లేదు. ఎక్కడ ఉండాలో కూడా తెలియదు.. అప్పుడు బంధువుల ఇళ్లల్లో కొన్నాళ్లు ఉన్నాం. ఆ తర్వాత నాన్న ఉద్యోగం అమ్మకు ఇచ్చారు. అమ్మకు ఉద్యోగం వచ్చిందనే ఆనందంలో ఉండగా.. కష్టాలు ఎదురైనాయి. అమ్మకు ఉద్యోగం వచ్చిన చోట.. ఉండటానికి మాకెవరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదు. దీంతో అమ్మ ఎంతో బాధపడింది. ఆ చుట్టుపక్కల ఉన్న వేర్వేరు హాస్టల్స్‌లో మేము ముగ్గురం జాయిన్ అయ్యాం. మమ్మల్ని కలవడానికి అమ్మ ప్రతిరోజూ మేముండే హాస్టల్‌కి వచ్చేది. కానీ హాస్టల్ వాళ్లు రావద్దని కండిషన్ పెట్టారు. అలా రోజూ వస్తే.. మిగతా పిల్లలు బాధపడతారని చెప్పి అమ్మను హాస్టల్‌కు రావద్దని అన్నారు. అప్పటి నుంచి మేమంతా వారానికి ఒక్కసారి మాత్రమే కలుసుకునేవాళ్లం. అప్పుడే అమ్మకి వేరేచోటకి ట్రాన్స్‌ఫర్ అయింది. చెల్లిని తీసుకుని అమ్మ అక్కడికి వెళ్లిపోయింది. వారు వెళ్లిన కొన్ని రోజులకు నేనుండే హాస్టల్‌కు సెలవులు ఇచ్చారు. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక శ్రీలంక శరణార్థ విద్యార్థులతో కలిసి కొన్నాళ్లు ఉండిపోయాను. అప్పుడు కేవలం అరటిపళ్ళే నా ఆహారం. అలా చాలా రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది.
పెద్దయ్యాక సినిమా ఇండిస్టీలోకి రావాలనుకున్నా. ఈ విషయం అమ్మకు చెప్పా. ఆ తర్వాత చదువు నిమిత్తం చెన్నైకి వచ్చేశా. చదువుకుంటూనే స్నేహితుల వద్ద సౌండ్ ఇంజనీరింగ్‌లో మెళకువలు నేర్చుకున్నా. నేను కట్టిన కొన్ని ట్యూన్స్‌ను సీడీగా చేసి ఓ సంస్థకు పంపించా. వాళ్లే నాకు సీరియల్స్‌లో అవకాశం ఇచ్చారు. అలా.. ఎలాంటి శిక్షణ లేకుండానే మ్యూజిక్ డైరెక్టర్‌ని అయ్యాను. 'డిష్యుం'తో మ్యూజిక్ డైరెక్టర్‌గా సక్సెస్ అందుకున్నా. ఆ తర్వాత తమిళం, కన్నడతోపాటు తెలుగులో వచ్చిన 'మహాత్మ', 'దరువు' చిత్రాలకు స్వరాలు అందించాను. అదే సమయంలో కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా కూడా పని చేశా. విజరు ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్' అనే బ్యానర్ స్థాపించి.. 'నాన్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చా. ఇదే చిత్రాన్ని తెలుగులో 'నకిలీ' పేరుతో విడుదలై మంచి విజయం అందుకుంది. 'బిచ్చగాడు' సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి నా ప్రతి సినిమా తెలుగులో విడుదల చేస్తున్నాము' అన్నారు విజరు.
విజయ్ 'కిజక్కు కదల్కరై సలై',TN 07 AL4777, నాన్, సలీం, భారతదేశం పాకిస్తాన్, పిచైక్కారన్, నంబియార్, సైతాన్, యమన్, ముప్పరిమానం, అన్నాదురై, కాళీ, ట్రాఫిక్ రామస్వామి, తిమిరు పుడిచావన్, కొలైకారన్ వంటి సినిమాల్లో నటించారు. విజరు ఆంటోనికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. తీరిక సమయాల్లో విహారయాత్రలకు వెళుతుంటారు.
పూర్తి పేరు : విజయ్ చంద్రప్రకాష్ ఆంటోని
వృత్తి : సంగీత నిర్మాత, నటుడు, వాయిస్ క్యాస్ట్, గాయకుడు, ఎడిటర్ , గీత రచయిత, దర్శకుడు , రచయిత
జననం : జూలై 24, 1975
అవార్డులు : 2009లో బెస్ట్ ఆఫ్ మ్యూజిక్ విభాగంలో కేన్స్ గోల్డెన్
లయన్ అవార్డు, వెట్టైకరణ్ నుంచి చిన్న తామరై (విజయ్ అవార్డు), జీవిత భాగస్వామి : ఫాతిమా విజరు ఆంటోనీ