Dec 23,2020 07:13

2020 సంవత్సరం ముగింపునకు వస్తున్న కొద్దీ కరోనా మహమ్మారిని తరిమి కొట్టే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాపితంగా పరుగులు వేగం పుంజుకున్నాయి. ఈ పరుగుల వెనుక రకరకాల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొన్ని దేశాలు ప్రజారోగ్యం కాపాడాలన్న ఆతృతతో పరుగు తీస్తుంటే బహుళజాతి కంపెనీలు లాభాల కోసం, ప్రజారోగ్యం గాలికొదిలేసిన ట్రంప్‌, మోడీ, బోల్సనారో వంటి మితవాద ప్రభుత్వాలు పోయిన పరువు కాపాడుకోడానికి ఈ పని చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ లోకి ఏ బహుళజాతి మందుల కంపెనీ ముందుగా అడుగు పెడితే దానికే భారీ లాభాలు పోగు చేసుకునే అవకాశం దక్కుతుంది. స్టాక్‌ మార్కెట్‌లో దాని విలువ అమాంతం పెరుగుతుంది. కనుక మీడియాలో ఈ కంపెనీల ప్రచారార్భాటం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రచారంలో వాస్తవాలు చాలా వరకు మరుగున పడిపోతున్నాయి.
వ్యాక్సిన్ల ప్రస్తుత పరిస్థితి
గత జనవరిలో చైనా శాస్త్రవేత్తలు కోవిడ్‌-19 (సార్స్‌-కోవి-2) వైరస్‌ యొక్క జనిటిక్‌ కోడ్‌ను లేక జీనోమ్‌ను ఛేదించి ఇంటర్‌నెట్‌లో పెట్టడంతోనే వ్యాక్సిన్‌ తయారీ ప్రయత్నాలు ముమ్మరమైనాయి. మామూలుగా అయితే ఒక సురక్షితమైన, సమర్ధవంతమైన వ్యాక్సిన్‌ తయారు చేయడానికి దశాబ్దాలు పడుతుంది. కానీ పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ఒక్క ఏడాది కాలంలోనే వ్యాక్సిన్‌ రూపొందించే అవకాశాలు కల్పించింది. అందువల్ల వచ్చే ఏడాది వేసవి నాటికి వ్యాక్సిన్‌ను బయటకు తెచ్చేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ ఈలోగా కోవిడ్‌ ప్రమాదం మరింత పెరగడంతోపాటు బహుళజాతి కంపెనీల పోటీ, అంతర్జాతీయ రాజకీయ వ్యూహప్రతి వ్యూహాల వల్ల పరీక్షలు పూర్తికాక ముందే అంటే మూడవ దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతుండగానే అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్‌ మార్కెట్‌ లోకి వచ్చేసింది. చైనా, రష్యా, బ్రిటన్‌, అమెరికా, యుఎఇ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వడం ప్రారంభమైపోయింది.
అత్యవసర అనుమతులు
ప్రపంచ వ్యాపితంగా శాస్త్రవేత్తలు 200కు పైగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు. వాటిలో సుమారు 50 వ్యాక్సిన్లు క్లినికల్‌ పరీక్షల్లో ఉన్నాయి. మరో 150 వ్యాక్సిన్లు వివిధ అభివృద్ధి దశల్లో అంటే లాబొరేటరీ, జంతువులపై పరీక్షల దశల్లో ఉన్నాయి. వివిధ దేశాల్లో 9 వ్యాక్సిన్లను అత్యవసర అనుమతి పొంది ప్రజలకు ఇస్తున్నారు. వీటిలో చైనాకు చెందిన 4, రష్యాకు చెందిన 2, అమెరికా, బ్రిటన్‌ బహుళజాతి సంస్థలకు చెందిన 3 వ్యాక్సిన్లు అత్యవసర అనుమతులు పొందాయి. భారత్‌కు చెందిన కోవ్యాక్సిన్ల అనుమతుల కోసం వేచి చూస్తున్నది. అమెరికా, బ్రిటిష్‌, రష్యా వ్యాక్సిన్లను మన దేశంలో రెడ్డి ల్యాబ్స్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వంటి ప్రయివేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. అనేక దేశాలకు చెందిన ఇంకో 40 వరకు వ్యాక్సిన్లు 1 నుండి 3వ దశ వరకు క్లినికల్‌ పరీక్షల్లో వున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్ధం ముగిసే సరికి వీటిలో చాలా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు లభించవచ్చు.
అత్యవసర అనుమతి అంటే ఏమిటి? మామూలుగా అయితే మూడవది, చివరిది అయిన దశలో పెద్ద సంఖ్యలో విభిన్న తరహా ప్రజలకు వ్యాక్సిన్‌ ఇచ్చి సహజ వాతావరణంలో వారిలో ఇమ్యూనిటీ ఎలా తయారవుతుందో పరీక్షిస్తారు. విశ్లేషిస్తారు. వ్యాక్సిన్‌ 100 శాతం సురక్షితంగా, సమర్ధవంతంగా ఉందని నిర్ధారించుకున్నాక ప్రజలకు ఇవ్వడం మొదలు పెడతారు. కానీ కొన్ని అత్యవసర సమయాల్లో 3వ దశ పరీక్షలు ముగియక ముందే, విశ్లేషణలు జరపక ముందే 1.2 దశల పరీక్షల ఫలితాల ఆధారంగా వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చు. ఇప్పుడు దాదాపు అన్ని దేశాలూ ఈ సడలింపులను ఇచ్చి పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాయి. అంటే ఒక రకంగా మూడవ దశ వ్యాక్సిన్‌ ప్రయోగాలు ప్రజల మీద నేరుగా జరుపుతున్నట్టే.
వ్యాక్సిన్లలో తేడాలు
చైనా, భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ను సంప్రదాయ పద్ధతిలో అంటే రసాయనాలతో నిర్వీర్యం గావించబడిన వైరస్‌లను వ్యాక్సిన్ల రూపంలో మనుషుల శరీరంలోకి ఎక్కించడం ద్వారా వారిలో ఇమ్యూనిటీని పెంచే పద్ధతిలో తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లను నిల్వ చేయడానికి 2 నుండి 7 సె.డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన మామూలు రిఫ్రిజిరేటర్లు సరిపోతాయి. అందువల్ల ఈ వ్యాక్సిన్‌ రవాణా చేయడం, ప్రజలకు ఇవ్వడం సులభం. కానీ బ్రిటన్‌, అమెరికా ఇతర కొన్ని యూరోపియన్‌ సంస్థలు ఆర్‌ఎన్‌ఎ ఆధారంగా కొత్త పద్ధతిలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌ నిల్వ చేయాలంటే -70 సె.డిగ్రీ ఉష్ణోగ్రతలు గలిగిన అత్యంత శీతల రిఫ్రిజిరేటర్లు కావాలి. ఈ రిఫ్రిజిరేటర్ల ఖరీదు, నిర్వహణ వ్యయం ఎక్కువ. రవాణా చేయడం, సిబ్బంది వాటిని వినియోగించడం రిస్క్‌తో కూడిన పని. అందువల్ల చైనా, భారత్‌లు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లు పేద దేశాలకు అనుకూలంగా ఉంటాయి.
వ్యాక్సిన్‌ రేస్‌లో అమెరికా-చైనా
వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీ విషయంలో అమెరికా చైనాల ధోరణుల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ మితవాద ప్రభుత్వం వ్యాక్సిన్‌ విషయంలో కూడా ''అమెరికా ఫస్ట్‌'' (అమెరికాకే మొదటి పీట) అనే వైఖరి తీసుకున్నది. బహుళజాతి ఔషధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని మొదటి 30 కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్‌ను ముందుగానే కొనేసింది. ఐరోపాకు చెందిన అనేక ధనిక దేశాలు కూడా ఇదే పద్ధతిలో మార్కెట్‌లో కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నాయి. వ్యాక్సిన్‌ను ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వాలనీ, పేద దేశాల సంగతి పట్టించుకోవాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) చేసిన విజ్ఞప్తులను అవి పెడచెవిన పెట్టాయి. ట్రంప్‌ గత ఎన్నికల్లో గెలవడానికి కరోనా వ్యాక్సిన్‌ను ఒక రాజకీయ సాధనంగా వాడుకోడానికి ప్రయత్నించారు. ఎన్నికలకు ముందుగానే దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందజేస్తున్నట్లు ప్రకటించారు (బీహార్‌ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రచారమే చేసింది). వ్యాక్సిన్‌ విషయంలో అమెరికాగానీ, ధనిక యూరప్‌ దేశాలుగానీ పేద దేశాల విషయమే పట్టించుకోలేదు. డబ్ల్యుహెచ్‌ఓ మాత్రం పేద దేశాలకు సుమారు 200 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అందించేందుకు దాతల నుండి డబ్బు పోగుచేసింది.
చైనా వైఖరి పశ్చిమ దేశాల వైఖరికి భిన్నంగా ఉంది. చైనా తయారుచేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ను 'ప్రపంచ ప్రజల సంక్షేమానికి' ఉపయోగిస్తామని, వ్యాక్సిన్‌ ''వర్థమాన దేశాల ప్రజలకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటేట్లు'' చూస్తామని చైనా అధ్యక్షడు సి జిన్‌పింగ్‌ గత మే నెలలో డబ్ల్యుహెచ్‌ఓ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఈ హామీకి అనుగుణంగానే చైనా నేడు ప్రపంచం లోని దాదాపు 100 దేశాలకు ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాలోని పేద దేశాలకు వ్యాక్సిన్‌ పంపిస్తోంది. గత జూన్‌ లోనే చైనా లోని రెండు వ్యాక్సిన్లు సినోవాక్‌, సినోఫామ్‌లకు ప్రభుత్వం అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. దాదాపు 10 లక్షల మంది చైనీయులు ముఖ్యంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు ఉద్యోగ వ్యాపారాల కోసం వెళ్లేవారు, విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు వ్యాక్సిన్‌ వేసుకున్నారు. దేశంలో కరోనా వ్యాప్తిని మొదట్లోనే కట్టడి చేసిన చైనాకు వ్యాక్సిన్‌ అత్యవసరం కాకపోయినప్పటికీ ప్రపంచ దేశాలకు దాన్ని సరఫరా చేస్తోంది. దాని కోసం షెంజన్‌ నగరంలో ఒక పెద్ద గోదాము నిర్మించింది. ఆఫ్రికా లోని దాదాపు 40కి పైగా దేశాలకూ, కాంబోడియా, మయన్మార్‌, లావోస్‌, థారులాండ్‌, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్‌, మలేషియా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, యుఎఇ, బ్రెజిల్‌, ఇతర అనేక లాటిన్‌ అమెరికా దేశాలకు చైనా వ్యాక్సిన్‌ సరఫరా అవుతోంది. వీటిలో పలు దేశాలకు ఉచితంగా అందిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను మామూలు ఫ్రిజ్‌లలో రవాణా చేయవచ్చు గనుక పేద దేశాలకు అనుకూలంగా ఉంది. చైనా ప్రారంభించిన బెల్ట్‌, రోడ్‌ ప్రాజెక్టులో వున్న దేశాలన్నిటికీ అది వ్యాక్సిన్‌ సరఫరా చేస్తోంది. అందుకే దాన్ని 'ఆరోగ్య సిల్క్‌ రోడ్‌' అంటున్నారు. దీంతోపాటు పేద దేశాలు కరోనాపై పోరాడ్డానికి రానున్న రెండేళ్లలో 200 కోట్ల డాలర్లు (సుమారు రూ.15,000 కోట్లు) సహాయం చేస్తామని, కరోనా వ్యాక్సిన్‌ కొనుగోలు చేయడానికి లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాలకు సుమారు రూ. 7500 కోట్లు రుణం ఇస్తామని చైనా అధ్యక్షుడు ప్రకటించారు.
భారత్‌లో...
మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్‌), ప్రయివేటు సంస్థ అయిన భారత్‌ బయోటెక్‌ కలిసి ఉత్పత్తి చేసిన దేశవాళీ ''కోవ్యాక్సిన్‌'' మూడవ దశ క్లినికల్‌ పరీక్షలు జరుపుకుంటూ ప్రభుత్వం నుండి (డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా నుండి) అత్యవసర అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాపితంగా 26,000 మంది మీద ఈ వ్యాక్సిన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఒకటి రెండు దేశవాళీ వాక్సిన్లు క్లినికల్‌ పరీక్షల్లో వున్నాయి. ఇవి వచ్చే ఏడాది మధ్యకు పూర్తికావచ్చు. భారత దేశంలో తయారయ్యే ఈ వ్యాక్సిన్లను మామూలు ఫ్రిజ్‌లలో రవాణా చేయవచ్చు గనుక ఖర్చు, ప్రయాస తక్కువ. కానీ మన దేశానికి చెందిన ప్రయివేటు సంస్థలు బ్రిటిన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌, ఫిజర్‌, మోడెర్నా తదితర బహుళ జాతి సంస్థలతో కలిసి దేశంలోనే వ్యాక్సిన్‌ డోస్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లను వచ్చే నెల నుండి అత్యవసర గ్రూపులకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ వ్యాక్సిన్లను -70 సె.డిగ్రీల వద్ద వుంచడం, రవాణా, పంపిణీ చాలా సంక్లిష్టమైన విషయం గనుక దీనిపై దేశవ్యాపితంగా సిబ్బందికి పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తోంది.
కొనుగోలు చేయగల వినియోగదారలకు బహుళజాతి సంస్థల వ్యాక్సిన్లు వచ్చే ఏడాది నుండి అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. దాంతో డబ్బున్న వారు దీన్ని కొనుగోలు చేస్తారు. పేద ప్రజలు ప్రభుత్వాల మీదనే ఆధారపడాలి. వ్యాక్సిన్లు అన్ని దేశాల్లోని ప్రజలందరికీ అందాలంటే రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. మన దేశంలో 25 శాతం మందికి వచ్చే ఏడాది పూర్తయినా వ్యాక్సిన్‌ అందుబాటు లోకి వచ్చే అవకాశం లేదంటున్నారు. అసమానతలతో కూడిన ప్రపంచంలో పేదలు ఎప్పుడూ చివరిలోనే ఉంటారు.

                                                                                            వ్యాక్సిన్‌: ఆరోగ్యం, వ్యాపారం, రాజకీయం          - ఎస్ వెంకట్రావు