హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కలకలర రేగింది. భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై చర్యలు చేపడుతున్నాయి. దేశంలో ఇప్పటికే రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
ఒక్కరోజే 7,633 పాజిటివ్ కేసులు..!
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. మంగళవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 7,633 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 61,233కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 5,31,152కి చేరింది.
తెలంగాణలో కరోనా కలవరం...
తెలంగాణలోనూ కరోనా కలవరం మొదలైంది. తాజాగా రాష్ట్రంలో మరో 21 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, మహబూబాబాద్ జిల్లాలో నెల రోజుల్లోనే దాదాపు 40 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
5 లక్షల డోసుల కార్బో వ్యాక్సిన్లు కొనుగోలు...
కొంతకాలంగా రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత కారణంగా... బూస్టర్ డోస్ పంపిణీ నిలిచిపోయింది. అయితే, కోవిడ్ వ్యాక్సిన్‌లను రాష్ట్రాలు స్వయంగా కొనుగోలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ సూచనతో, హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ బయోలాజికల్ నుండి 5 లక్షల డోసుల కార్బో వ్యాక్సిన్‌లను కొనుగోలు చేశారు.
నేటి నుండి మళ్లీ వ్యాక్సినేషన్ : డిహెచ్ జి.శ్రీనివాసరావు
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. నేటి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో మొదటి రెండు డోసులు, కోవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకాలు వేయించుకున్నావారు బూస్టర్ డోస్ గా కార్బేవ్యాక్స్ తీసుకోవచ్చన్నారు.