Nov 19,2020 08:15

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ తెలుగు విప్లవ కవి వరవరరావు (వివి)ను తక్షణమే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలని బాంబే హైకోర్టు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరోగ్యం పూర్తిగా విషమించి, చికిత్స కోసం అభ్యర్థిస్తుంటే కుదరదని ఎలా చెప్పగలుగుతున్నారని జస్టిస్‌ ఎస్‌ఎస్‌ షిండే, జస్టిస్‌ మాధవ్‌ జమ్‌దార్‌ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వరవరరావు నవీముంబైలోని తలోజా జైళ్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావును తలోజా జైలు ఆస్పత్రి నుంచి తక్షణమే నానావతి ఆస్పత్రికి మార్చి, మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన భార్య హేమలత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. ప్రైవేటు ఆస్సత్రి అయిన నానావతి హాస్పిటల్‌లో వరవరరావు చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ తరుఫు న్యాయవాది స్పందిస్తూ.. నానావతి ఆస్సత్రిలో చేర్చి, 15 రోజులపాటు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో వరవరరావును చూసేందుకు ఆస్పత్రి నిబంధనల మేరకు ఆయన కుటుంబసభ్యులను అనుమతించాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణను డిసెంబర్‌ 3కి వాయిదా వేసింది.