ముంబయి : ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన సామాజిక కార్యకర్త ఆనంద్ తెల్తుంబ్డే (73)కు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు , వెంటనే వారం రోజుల పాటు బెయిల్‌ను నిలిపివేస్తూ స్టే ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఈ పరిణామం చోటుచేసుకుది. సుప్రీంకోర్టులో బెయిల్ తీర్పును సవాల్ చేయడానికి వీలుగా తమకు కొంత గడువు కావాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) చేసిన విజ్ఞప్తితో జస్టిస్ ఎ.ఎస్.గడ్కరి, జస్టిస్ ఎం.ఎన్.జాదవ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకుఉత్తర్వులిచ్చింది. దీంతో బెయిల్ పొందినప్పటికీ వెంటనే బయటకురాలేని పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు నిర్ణయంపైనే బెయిల్ ఆదేశాల అమలు ఆధారపడి ఉంది. అంతకుముందు లక్ష రూపాయల పూచీకత్తుపై కోర్టు ఆయనకుబెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం నవీ ముంబయిలోనితలోజా జైల్లో తెల్తుంబ్డే ఉనాురు. బెయిల్‌ను ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో గతేడాది హైకోర్టును ఆయన ఆశ్రయించారు. 2017 డిసెంబరు 31న ఎల్గార్ పరిషద్ సమావేశం జరిగిన రోజున తానక్కడ లేనని, ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదని తెల్తుంబ్డే తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన మూడో నిందితుడు తెల్తుంబ్డే. ఇదే కేసులో వరవరరావుకు మెడికల్ బెయిల్ ఇవ్వగా, సుధాభరద్వాజ్‌కు సాధారణ బెయిల్ ఇచ్చారు.










