నగరం చీకటి దుప్పటి కప్పుకుని పడుకున్నపుడు
మన ఇంటిముందు మిణుగురులై ప్రకాశించింది వాళ్లే
బతుకుల్ని బట్టీల్లో కాల్చి
తందూరీలై మన ఆకల్ని తీర్చింది వాళ్లే
ఏ భవంతిని తడిమినా
ఇటుకలన్నీ వాళ్ళ స్వేదంతో తడిచిన, గతానుభవాలనే నెమరేసుకుంటాయి
ఫ్యాక్టరీలు పొగ ఆగిన గొట్టం నుండి వాళ్ళ రాక కోసమే ఎదురుచూస్తుంటాయి
అలాంటి వాళ్లపై ఉరుములేని పిడుగేదో వచ్చి పడింది
పేగు బంధాన్ని తెంచుకున్న నగరం
వేల మైళ్ళ ఆవలికి విసిరేసింది
తల్లి లాంటి నగరాన్ని తలుచుకుని గుక్కపట్టి ఏడుస్తూ
రహదారులపై రుధిర సంతకాలను చేస్తూ
కాలం చేసిన విషాద గాయంపై కన్నీళ్లతో మలాం రాస్తూ సాగిపోతున్నారు...
నిర్మానుష్యపు రహదారి పైనో
అర్థరాత్రి రైలుపట్టాల పైనో రాలిపోతున్నారు
నిజానికి చచ్చిన మన మానవత్వాన్ని కార్పెట్లా పరిస్తేనే
కదా వాళ్లిప్పుడిలా నడుస్తుంది...
అందుకే
వలస పాదాల ఎర్ర రక్తపు సిరాను ఒంపుకున్న కవి కలం
అక్షర తూటాలను దట్టించుకుని
సమాజంపై గురిపెట్టి ప్రశ్నిస్తుంది...
వలస కష్టం తీరేదెప్పుడని...?
వలస కాష్టం ఆరేదెప్పుడని....?
- జాబేర్ పాషా
0968 97663604