
ఆ ఘోరం 2007 ఆగస్టు 20న జరిగింది. విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయితీ వాకపల్లి గ్రామంలో కూంబింగు పేరుతో గ్రేహౌండ్స్ పోలీసులు చొరబడి స్వైరవిహారం చేశారు. వాకపల్లి గ్రామంలోని కోండు తెగకు చెందిన 11 మంది ఆదివాసీ మహిళలను అత్యంత అమానుషంగా, ఘోరంగా అత్యాచారం చేశారు.
ఘటన జరిగి పదిహేనేళ్లయినా ఇంతవరకు నిందితులు ఎవరో దోషులు ఎవరో తేల్చని ప్రజాస్వామిక దేశం మనది. న్యాయ వ్యవస్థ మనది. బాధిత మహిళల్లో ఇద్దరు మరణించారు. ఆ ఘటన నేటికీ మానని గాయంలా సలుపుతూనే ఉంది. ఈ రోజుకి కూడా ఆ గ్రామంలో నివసిస్తున్న ఆదివాసీ కుటుంబాలు పోలీసుల వేధింపులకు గురవుతూనే వున్నాయి. అక్కడ ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను, పోలీసులు ఇవ్వజూపిన డబ్బును నిర్మొహమాటంగా తిరస్కరించి నిందితులైన గ్రేహౌండ్ పోలీసులను శిక్షించాలని ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా న్యాయ పోరాటం సాగిస్తున్నప్పటికీ...ఈ బూర్జవా బూటకపు న్యాయస్థానాలలో ఆదివాసీ మహిళలకు నేటికీ న్యాయం దొరకని పరిస్థితి. వాకపల్లి సంఘటనకు సంబంధించి నేర నిర్ధారణ సరిగా లేదని, సిబిఐ తో విచారణ చేయించి నిజాలు రాబట్టాలని, దోషులను శిక్షించాలని మొదటి నుండి ఆదివాసీ సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆ సంఘటన జరిగిన వాటి నుండి అనేక ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో...ఆ రోజు వాకపల్లికి గ్రేహౌండ్స్ పాలీసులు వెళ్ళినట్టు ఒప్పుకోవడమే కాకుండా వారి వివరాలతో కూడిన జాబితా విడుదల చేసింది. ఈ కేసును అణగదొక్కడానికి వైద్య వివేదికల చుట్టూ తిప్పాలని చూశారు. ఆ నివేదికను అడ్డుపెట్టుకొని రాష్ట్ర హోంశాఖ అసలు అత్యాచారమే జరగలేదని బుకాయించింది. నాటి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నాగిరెడ్డి విచారణ జరిపి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. ఆ నివేదికను నాటి పాలక వర్గాలు తొక్కిపెట్టాయి. విచారణను పక్కదారి పట్టించాయి. 2007 డిసెంబర్ 14వ తేదీన సిఐడి ఎసిపి శివానందరెడ్డి తన తుది నివేదికలో సంఘటనకు సంబంధించిన పరిస్థితులపై సాక్ష్యం ఆధారపడవచ్చని బుకాయించారు. సాక్ష్యం చెప్పేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొర్లవచ్చు. కాని ఈ కేసులో వైద్య నివేదిక పరిస్థితులన్నింటిని పరిగణలోకి తీసుకుంటే అసలు అత్యాచారమే జరగలేదని, నమ్మశ్యకంగా లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆదివాసీ మహిళలు ప్రతిఘటించకపోవడం అసహజంగా ఉందనే అనుమానం వ్యక్తం చేస్తూ నివేదికలోని మొత్తం అంశాలను పోలీసులకు అనుకూలంగా తయారు చేశారు.
ఆ గ్రామానికి వెళ్ళింది సామాన్యులు కాదు. ప్రతిఘటించడానికి వాళ్లు మామూలు వ్యక్తులు కారు. రాష్ట్ర ప్రభుత్వం కనుసైగలో పని చేస్తున్న సాయుధ గ్రేహౌండ్స్ పోలీసుల రూపంలో ఉన్న రాబందులు. పోలీస్ శాఖలో భాగమైన సిఐడి అధికారులు ఆదివాసీల పక్షాన కాకుండా పోలీసుల పక్షాన వివేదిక ఇచ్చారు. ఆదివాసీ మహిళలకు అన్యాయం చేశారు. సిబిసిఐడి ఎసిపి ఇచ్చిన నివేదికతో అసంతృప్తి చెందిన వాకపల్లి ఆదివాసీలు 2008 ఏప్రిల్ 16న పాడేరు ప్రథమ శ్రేణి జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో నిరసన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ నిందితులపై ఎస్.సి, ఎసి.టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే పాడేరు మేజిస్ట్రేట్ 2008లో చేపట్టిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని 2008 సెప్టెంబర్ 2న నిందితులు హైకోర్టులో దాఖలు చేశారు. పాడేరు మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌పై హైకోర్టు 2008 సెప్టెంబర్‌లో స్టే విధించింది. దాంతో ఆదివాసీ మహిళలు దోషులను శిక్షించాలని సుప్రీం కోర్టుకు అప్పీలు చేశారు. దానిని అనుసరించి రేపో మాపో భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. దాని కోసం బాధిత ఆదివాసీ మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈ న్యాయ పోరాటంలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు వారికి అండగా నిలవాలని...న్యాయం జరగాలని కోరుకుందాం.
- వూకె రామకృష్ణ దొర