Dec 17,2020 06:51

ఈ సంవత్సరం కరోనా విజృంభణతో గతంలో ఎన్నడూ ఎరగని సమస్యలు విద్యారంగాన్ని పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించే బదులు తన అసంబద్ధ వైఖరితో మరిన్ని సమస్యలకు కారణమౌతోంది. దీంతో ఏం జరుగుతోందో అర్ధం కాని స్థితిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చిక్కుకున్నారు. ఉపాధ్యాయులది కూడా ఇదే స్థితి. డిసెంబర్‌ మాసాంతానికి వచ్చినప్పటికీ విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. కేజి నుండి పి.జి వరకు ఇంకా అయోమయమే రాజ్యమేలుతోంది. తరగతులు లేవు. పుస్తకాలు లేవు. పాఠాలు లేవు! అన్‌లైన్‌లో జరిపామని చెప్పినా అరకొరే! ఆధునిక సౌకర్యాలు అందుబాటులో లేని విద్యార్థులకు బోధన శూన్యంగా మారింది. ఆన్‌లైన్‌లో విన్న వారిలో కూడా అర్ధం కాలేదని చెబుతున్న వారే ఎక్కువ! నెల రోజుల క్రితం కొన్ని విద్యా సంస్థలను తెరిచినప్పటికి హాజరవుతున్న వారి సంఖ్య స్వల్పమే. ల్యాబ్‌లు ఇంకా తెరుచుకో లేదు. ప్రాక్టికల్స్‌ జరగడం లేదు. అవి చేసి తీరాల్సిన వారి పరిస్థితి ఏమిటి? విద్యా సంవత్సరాన్ని రద్దు చేస్తారా..పొడిగిస్తారా? పరీక్షలు జరుపుతారా...జరపరా? విద్యార్థులు ఒక సంవత్సరాన్ని నష్టపోవాల్సిందేనా? వేరే ప్రత్యామ్నాయం ఉందా? ప్రభుత్వం మాత్రమే జవాబు చెప్పగలిగిన ప్రశ్నలివి. జనవరి నెల కూడా ప్రారంభమవుతోంది కాబట్టి ఈ సమస్యలపై ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా దృష్టి సారించాల్సి ఉంది.


కరోనా వ్యాప్తితో ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రైవేటువి మూతపడ్డాయి. దానిని కూడా లాభార్జనకు అనువుగా మార్చుకున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు ఆన్‌లైన్‌ విద్యాబోధన పేరుతో కష్టకాలంలోనూ తల్లిదండ్రులను జలగల్లా పీడించాయి. మరో మార్గం లేక, అనేక మంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు మార్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు చూపిన చొరవ, కృషితో పాటు, నాడు-నేడు పేరుతో కొద్దిమేరకైనా వసతులు మెరుగుపడటం కూడా తల్లిదండ్రుల మీద కొంత మేర ప్రభావం చూపింది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఈ దిశలో తరువాత జరగాల్సింది ఏమిటి? విద్యార్థులందరికి ఉత్తమ బోధన అందేలా చూడటం! అలా జరిగితేనే కదా ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట పెరిగేది! కానీ, జరుగుతున్నదేమిటి? 2017 తరువాత ఇప్పుడు బదిలీల ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం, అదే సమయంలో హేతుబద్దం కాని క్రమబద్దీకరణ (రేషనలైజేషన్‌)ను ముందుకు తెచ్చింది. దీంతో ఉపాధ్యాయ లోకం భగ్గుమంటోంది. ప్రతి పాథమిక పాఠశాలకూ కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని చెబుతూనే, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు కేటాయించేది లేదని చెప్పడం లోని అంతరార్థం ఏమిటి? ఇది ఒక ఉపాధ్యాయుడు సెలవు పెడితే బడి మూయకుండా తెరవడానికి పనికొస్తుంది కానీ, నాణ్యమైన బోధనకు, వ్యక్తిగత పర్యవేక్షణకు పూచీ పడదే! అంటే, ఇప్పుడు కాకపోతే మరో రెండు మూడేళ్ల తరువాతైనా తల్లిదండ్రులు లెంపలేసుకుని కార్పొరేట్ల గుమ్మం తొక్కాల్సిందే కదా! దశ, దిశ మార్చడమంటే ఇదేనా? విద్యారంగ పరిరక్షణ ఇలాగేనా?


నిజానికి చేయాల్సింది ఏమిటి? పెరిగిన విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని, నాణ్యమైన బోధన అందించడమే లక్ష్యంగా ఖాళీలను గుర్తించి, డిఎస్‌సి నిర్వహించి, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. ప్రతి ఏడాది ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా నిర్వహించాలి. ఆ పని చేస్తే ఖాళీలను బ్లాక్‌ చేయాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది? దానిని సమర్ధించుకోవాల్సిన దుర్గతి ఎందుకు పడుతుంది? వెబ్‌ కౌన్సిలింగ్‌లో బదిలీలు వద్దు మొర్రో అని ఉపాధ్యాయులు అంటుంటే అలాగే చేస్తామనడంలో అర్ధం ఏమిటి? ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఒక ఉమ్మడి అవగాహనకు రావడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఈ తరహా ఏకపక్ష ధోరణి మంచిది కాదు. ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఉన్న అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడమే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమవుతుంది.