Apr 24,2023 22:25
  • పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారు
  • వేలాదిమంది ఉపాధ్యాయుల ర్యాలీ, కలెక్టరేట్‌ వద్ద ధర్నా
  • కలెక్టర్‌ హామీతో పోరాటం తాత్కాలిక వాయిదా

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (పార్వతీపురం) : పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటన సందర్భంగా డిఇఒను, ఎంఇఒలను, ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ, అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు సోమవారం పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యాన వేలాది మంది పార్వతీపురంలోని జిల్లా విద్యా శాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నిరసన తెలిపారు. 'ప్రవీణ్‌ ప్రకాష్‌ గో బ్యాక్‌', 'తప్పెవరిది-శిక్ష ఎవరికి' అంటూ నినాదాలు చేశారు. డిఆర్‌ఒ జె.వెంకటరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రవీణ్‌ ప్రకాష్‌ పర్యటనలో భాగంగా వీరఘట్టం మండలం కెజిబివి పాఠశాలను సందర్శించినప్పుడు ఎనిమిదో తరగతి విద్యార్థులకు సరిపడా పుస్తకాలు లేవని గుర్తించి దీనికి బాధ్యులను చేస్తూ డిఇఒ ఎస్‌డివి రమణను, ఎంఇఒ, జిసిడిఒలను, స్పెషలాఫీసర్‌ను సస్పెండ్‌ చేయడం సరికాదన్నారు. సరిపడా పుస్తకాలు సకాలంలో ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైనందున అధికారులు, ఉపాధ్యాయులు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. నూటికి 30 శాతం మంది విద్యార్థులకు పుస్తకాలు అందకపోయినా, వంద శాతం అందాయని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని అప్పట్లో విద్యా శాఖాధికారులు ఒత్తిడి చేశారని తెలిపారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉద్దేశ పూర్వకంగానే ఉపాధ్యాయులను, అధికారులను వేధిస్తున్నారన్నారు. అక్రమంగా సస్పెండ్‌ చేసిన అధికారులను, ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌రావు, పిఆర్‌టియు నాయకులు విజరు, ఎపిటిఎఫ్‌ నాయకులు ఎన్‌.బాలకృష్ణ, వి.రాధ, ధనుంజయరావు, ఎస్‌టియు నాయకులు శ్రీనివాసరావు, హెచ్‌ఎం అసోసియేషన్‌ నాయకులు సిహెచ్‌.శ్రీనివాసరావు, యు.గోవింద, ఎస్‌ఎపిఎఫ్‌ నాయకులు ఎం.మధు, పిఇటి అసోసియేషన్‌ నాయకులు, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గన్నారు.

  • కలెక్టర్‌ చర్చలు 

ఉపాధ్యాయుల సంఘాల నాయకులతో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ చర్చలు జరిపారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ చర్యల్లో ఉపాధ్యాయుల ఆందోళనపై సిఎంఒ కార్యాలయం నుంచి ఆరా తీశారని కలెక్టర్‌ తెలిపారు. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తమతో మాట్లాడారని, వెంటనే రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని సూచించారని చెప్పారు. పాఠ్యపుస్తకాల పంపిణీపైనా, సస్పెషన్లపైనా విచారణ అధికారిగా తనను నియమించారని, రెండు రోజుల్లో విచారణ చేపట్టి సస్పెన్షన్లను ఎత్తివేస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. దీంతో, పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు తెలిపారు.