Dec 31,2020 07:40

రైతుల పోరాటం రెండో నెలలోకి ప్రవేశించింది. వారి మనుగడపై తీవ్ర ప్రభావం చూపనున్న కొత్త వ్యవసాయ చట్టాలను ఆ రైతులతోచర్చించకుండానే మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ ఉద్యమం ఒక కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఇదేదో కేవలం మద్దత్తు ధరలకోసమే జరుగుతున్న ఆందోళన అని అనుకుంటే పొరపాటు. ఆహార ధాన్యాల సేకరణ, పంపిణీ కి సంబంధించిన ప్రజా వ్యవస్థను కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటం ఇది. మన దేశ ఆహార ధాన్య ఉత్పత్తి ప్రధానంగా ఉత్తర భారత దేశంలో జరుగుతుంది. ఆ ఉత్పత్తి ఆర్ధికంగా గిట్టుబాటు అయేలా చూడడం అవసరం. అలా జరగకపోతే ఆహార ధాన్యాల సేకరణ, పంపిణీ కొనసాగడం అసాధ్యం అయిపోతుంది. ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్ని లోపాలున్నప్పటికీ దేశంలోని అత్యధిక జనాభాకు ఎంతో కొంత ఆహార భద్రత కల్పిస్తున్నది ఈ వ్యవస్థే.

మళ్ళీ వలస పాలన నాటి రోజులు వస్తాయా?
మన వంటి ఉష్ణ, సమ శీతోష్ణ ప్రాంతాల్లో పండే చాలా పంటలు అమెరికా, కెనడా, యూరపియన్‌ యూనియన్‌ దేశాలలో పండవు. ఇక్కడ పండే ఆ పంటలకు ఆ దేశాలలో చాలా డిమాండ్‌ ఉంది. అక్కడి వాతావరణంలో ఏడాదికి ఒక్క పంట మాత్రమే పండించే వీలుంది. ఆ విధంగా అక్కడ పండించే ఆహార ధాన్యాలు, డెయిరీ ఉత్పత్తులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఈ మిగిలిపోతున్న నిల్వలను అమ్ముకోడానికి ఆ దేశాలకు మార్కెట్‌ కావాలి. అందుకోసం గత రెండు దశాబ్దాలుగా అమెరికా, ఇతర యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు మూడవ ప్రపంచ దేశాలపై నిరంతరాయంగా వత్తిడి తెస్తున్నాయి. అందులో భాగంగానే మన దేశంలో ప్రభుత్వ సంస్థల ద్వారా ధాన్య సేకరణ చేయడం మానుకోవాలని, తమ వద్దనుండి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలని, ఇక్కడి భూముల్లో ఆహార పంటలు పండించే బదులు ఎగుమతులకు పనికివచ్చే ఇతర పంటలను పండించాలని, అందుకోసం కాంట్రాక్టు వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని వత్తిడి చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వలస పాలన నాటి ఆర్ధిక పరిస్థితులను తిరిగి తీసుకురావాలని యత్నిస్తున్నాయి.

ఆసియా లోని ఫిలిప్పీన్స్‌ నుండి ఆఫ్రికాలోని బోత్స్వానా వరకూ డజన్లకొద్దీ దేశాలు ఈ వత్తిడులకు లంగిపోయాయి. తమ దేశాలలోని ఆహార ధాన్యాలను అమెరికా, ఇ.యు. దేశాలకు ఎథనాల్‌ ఉత్పత్తి నిమిత్తం మళ్ళించాయి. 2007 నాటికల్లా ప్రపంచ మార్కెట్‌లో ఆహార ధాన్యాల ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఆహార ధాన్యాలకోసం దిగుమతులమీద ఆధారపడవలసిన పరిస్థితిలో ఉన్న 37 దేశాలలో తిండిగింజలకోసం అల్లర్లు, లూటీలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రధానంగా పట్టణ ప్రజానీకం తిండిగింజలు కొనలేక దుర్భర దారిద్య్రంలోకి దిగజారారు.

దేశ ఆహార భద్రత అనేది ప్రపంచ మార్కెట్‌ దయాదాక్షిణ్యాలకు వదలిపెట్టాల్సిన విషయం కాదు. ప్రభుత్వం ఆహారధాన్యాలను నిల్వచేయరాదంటూ అదేపనిగా వస్తున్న వత్తిడులకు ఒక దశాబ్దం క్రితం ప్రభుత్వం దాదాపు లంగిపోయింది. 2002-2008 మధ్య కాలంలో ధాన్య సేకరణ ధరలను పెంచలేదు. దాంతో రైతుల ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల లేకుండా స్తంభించింది. 2008లో తెలివి తెచ్చుకుని ధాన్యసేకరణ ధరను ప్రభుత్వం పెంచింది. అప్పుడు పంజాబ్‌ రైతులు మళ్ళీ ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచారు. దాంతో నిల్వలు కూడా పెరిగాయి. కాని ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలేవీ చేపట్టనందువలన, వారు ఎక్కువగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయలేకపోయారు. ఆ తర్వాత 2016లో చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రజల ఆదాయాన్ని బాగా దెబ్బ తీసింది. దానినుండి కోలుకోక మునుపే వచ్చిపడిన ఆర్ధిక సంక్షోభం, అదే సమయంలో విరుచుకుపడిన కరోనా విలయం ప్రజల కొనుగోలు శక్తిని, నిరుద్యోగాన్ని గతంలో ఎన్నడూ లేనంత దిగువ స్థాయికి దిగజార్చాయి.
 

మార్కెట్‌ దోపిడీకి బలౌతున్న రైతులు
వారివైపునుండి ఎటువంటి లోపమూ జరగకపోయినా, రైతులు మాత్రం మార్కెట్‌ దోపిడీకి, ప్రపంచ మార్కెట్‌ లోని ధరల ఎగుడు దిగుడు లకు గురై మోయలేని రుణ భారాన్ని, దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. పంజాబ్‌ లోని ఒక్క గ్రామంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలు 57 మంది వితంతువులుగా బతుకులీడుస్తున్నారు!
ఈ సంపన్న దేశాలు తమ దేశాలలోని రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయి. కాని మూడో ప్రపంచ దేశాలలో మాత్రం రైతులకు ఎటువంటి సబ్సిడీలూ ఇవ్వరాదంటూ నిబంధనలు పెట్టి ఒప్పందాలు చేసుకోమంటూ వత్తిడి చేస్తున్నాయి. దీని పర్యవసానాల గురించి పెద్దగా పట్టించు కోకుండానే భారత దేశంతో సహా అనేక మూడవ ప్రపంచ దేశాలు ఆ ఒప్పందంపై సంతకాలు చేసేశాయి! అమెరికాలో కేవలం 20 లక్షల మంది రైతులున్నారు. ఆ దేశంలో ఉత్పత్తి అయే పంట విలువలో దాదాపు సగం మేరకు వారికి అక్కడి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఐతే ఇందుకు తన వార్షిక బడ్జెట్‌లో అయే ఖర్చు 1 శాతం మాత్రమే. మరి మన దేశంలో 12 కోట్లమంది రైతులున్నారు. వారు పండించే పంట విలువలో నాలుగో వంతు వరకైనా సబ్సిడీగా ఇవ్వాలంటే మన వార్షిక బడ్జెట్‌లో 50 శాతం ఖర్చవుతుంది. ఇది అసాధ్యం. అటువంటి పరిస్థితుల్లో మన రైతులు సంపన్న దేశాల రైతులతో ఏ విధంగా పోటీ పడగలుగుతారు?

న్యాయమైన ధరనే రైతులు కోరుతున్నారు
మన రైతులు ప్రభుత్వంనుండి ఎటువంటి దయాధర్మ భిక్షనూ ఆశించడం లేదు. ఈ దేశ అవసరాలను తీర్చే కీలకమైన పంటలను వారు పండిస్తున్నారు. ఆ పంటలు పండించడానికి అయ్యే ఖర్చుతోబాటు తమ కనీస అవసరాలు తీరే విధంగా ఆ పంటలకు ధర చెల్లించాలని మాత్రమే వారు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస మద్దత్తు ధర కల్పించడమొక్కటే ఆచరణ సాధ్యమైన పరిష్కారం. పంజాబ్‌ లో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. తక్కువ నీటితో పంటలను పండించే కొత్త పద్ధతులను ప్రవేశ పెట్టడం దానికి పరిష్కారం అవుతుంది కాని వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించుకోవడం పరిష్కారమా? తలనెప్పి వచ్చిందని చెప్పి ఎవరైనా ఆ తలనే తెగనరుక్కుంటారా?

కాని ఈ మద్దతు  ధర విషయంలోనే సంపన్న దేశాలు పట్టుబట్టి తమ మాట నెగ్గించుకునే విధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. 2018 మేలో ప్రపంచ వాణిజ్య సంస్థ లో వ్యవసాయం ఒప్పందం మీద జరిగిన చర్చల్లో 1986ా88 నాటికున్న పంట ఉత్పత్తి ధరలను ప్రామాణికంగా నిర్ణయించారు. ఆనాటికి ఒక డాలరు విలువ రూపాయల్లో రు.12.5 మాత్రమే. అదే మారకపు రేటుతో లెక్కగట్టి 2013ా14లో వరికి రు. 235 గాను, గోధుమకు రు.354గాను కనీస మద్దత్తు ధర నిర్ణయించారు! వాస్తవంగా ఆనాటికి ఉండాల్సిన మద్దత్తు ధర వరికి రు. 1348, గోధుమకు రు. 1386. తేడా దాదాపు రు.1000 ఉంది. అనుమతించిన 10 శాతం మద్ధత్తు కన్నా ఇది 77 శాతం ఎక్కువగా ఉందని, ఇది ఒప్పంద ఉల్లంఘన కింద వస్తుందని, భారత దేశం ఇందుకు ఆంక్షలు ఎదుర్కోవలసివుంటుందని అమెరికా హెచ్చరించింది.

నిజానికి 2013 - 14నాటికి డాలరుారూపాయి మారకపు రేటు రు.60.5 ఉంది. ఆ లెక్కన చూస్తే ప్రభుత్వం పండిన పంటకు అయే ఖర్చునైనా మద్దత్తు ధరగా ప్రకటించలేదని స్పష్టం అవుతుంది. కాని దానిని కూడా సహించే స్థితిలో అమెరికాలేదు.
వాస్తవ పరిస్థితి
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగానే ఆహార ధాన్యాల డిమాండ్‌ పడిపోయింది. గోధుమ, వరి ధరలు గతంలో లేనంత తక్కువ స్థాయికి అంతర్జాతీయంగా పడిపోయాయి. సంపన్న దేశాలు తమ రైతులకిచ్చే సబ్సిడీలు అత్యంత ఎక్కువ స్థాయికి చేరుకున్నాయి. కనుక ఎలాగైనా తమవద్ద పేరుకుపోయిన నిల్వలను వదిలించుకోవాలని ఆ సంపన్న దేశాలు చూస్తున్నాయి. ఇటువంటిదశలో మోడీ ప్రభుత్వం ఈ కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చింది. వీటివలన మన బడా కార్పొరేట్లు బాగా ప్రయోజనం పొందుతారని రైతులు వేసిన అంచనా వాస్తవమే. ఐతే అంతకన్నా ఎక్కువగా విదేశీ అగ్రో బిజినెస్‌ కార్పొరేట్ల నుంచిప్రమాదం పొంచివుంది.

పంజాబ్‌, హర్యానా రైతులు ఇప్పటికే కాంట్రాక్టు వ్యవసాయం అంటే ఏమిటో చవిచూసివున్నారు. కాంట్రాక్టు నిబంధనలకు గాని, ముందుగా ఒప్పుకున్న ధరకు గాని, చెల్లింపులకు గాని కట్టుబడివుంటారన్న గ్యారంటీ ఏమాత్రమూ లేని, అత్యంత శక్తివంతులైన బడా కార్పొరేట్లతో తాము వేగలేమని వారికి తెలుసు. వారికన్నా, ఎంత అసమర్ధంగా నిర్వహిస్తున్నా, ఎంత ఆలస్యంగా చెల్లింపులు చేసినా ప్రభుత్వ సంస్థల ద్వారా నిర్దేశించిన మద్దత్తు ధరకు అమ్ముకోవడమే మేలు అన్న నిర్ధారణకు వారు వచ్చారు. ఈ విషయంలో మన రైతులు నూటికి నూరు శాతమూ సరైన అంచనాకే వచ్చారు. ఒకసారి మార్కెట్‌ నియంత్రణలు సడలించాక విచ్చలవిడిగా ప్రవేశించేవారు ఈ స్వదేశీ కార్పొరేట్లే కాదు, విదేశీ కార్పొరేట్లు కూడా. ఏదైనా తేడా వస్తే వారిని ప్రభుత్వం కూడా నియంత్రించలేదు. పైగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సేకరణ వ్యవస్థ కాస్తా ధ్వంసం అవుతుంది. దానితోబాటే మద్దత్తు ధర కూడా కనుమరుగౌతుంది.

సంపన్న దేశాలనుండి ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటే మన పేదలకు చౌకగా ఆహారం దొరుకుతుందని అభిప్రాయ పడుతున్న మేధావులున్నారు. సంపన్న దేశాలలో వాహన ఇంధనాల కాలుష్యాన్ని అరికట్టడానికి ఎథనాల్‌ ఉపయోగించాలన్న వత్తిడి పర్యావరణ ఉద్యమంనుండి వస్తోంది. అందుచేత మరింత ఎక్కువగా ఆహార ధాన్యాలను ఎథనాల్‌ తయారీకి మళ్లించాల్సివుంటుంది. ప్రస్తుతానికి మనకు ధాన్యం చౌకగానే దిగుమతి కావొచ్చు. కాని ఎథనాల్‌ తయారీకి మళ్ళించడం పెరుగుతున్నకొద్దీ వాటి ధరలు విప రీతంగా పెరుగుతాయి. మన దేశంలో మన రైతులు పండించే ధాన్యాన్ని వదిలిపెట్టి దిగుమతులపై ఆశలు పెట్టుకోవడం తెలివితక్కువతనమే అవుతుంది. మన రైతుల పట్ల గాని, పేదరికంలో మగ్గుతున్న మన దేశ ప్రజానీకం పట్ల కాని ఏమాత్రం శ్రద్ధ, బాధ్యత ఉన్నా రైతుల డిమాండ్లను అంగీకరించాలి. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల కుట్రలనుండి వారిని కాపాడాలి.

 

విదేశీ ఆగ్రో - బిజినెస్‌ సంస్థలనుండి రానున్న ముప్పు

 

 

 

 

 

 

(స్వేచ్ఛానుసరణ)

ప్రొ. ఉత్సా పట్నాయిక్‌