ప్రస్తుతం నడుస్తున్న రైతాంగ పోరాటంలో వివిధ వ్యవసాయ వర్గాల మధ్య ఐక్యత స్పష్టంగా కనబడుతుంది. తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం కారణంగా, 1995 నుండి ఐదు లక్షల మంది రైతులు అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంఘటన ప్రధానంగా రైతాంగం నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సంఘటితం కావటానికి దారి తీసింది. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు, వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులకు దారి తీస్తున్నాయి. రాజ్యాంగం యొక్క ఫెడరల్ స్వభావాన్ని ఉల్లంఘిస్తున్నాయి. అదేవిధంగా బడా కార్పొరేట్ శక్తులు ఒక వైపు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, పేదలు, మధ్య తరగతి రైతులు మరొకవైపు, ధనిక వ్యవసాయదారులు, పెట్టుబడిదారీ భూస్వాములు మరొకవైపు సంఘటితపడ్డారు. పెట్టుబడిదారీ భూస్వాముల మధ్య కూడా తేడాలున్నాయి. ఈ వర్గ పోరాటానికి ట్రేడ్ యూనియన్ నాయకత్వంలో, వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు బేషరతు మద్దతు లభించడం ప్రధాన శక్తిగా మారింది. వివిధ రైతాంగ వర్గాల మధ్య పెరుగుతున్న ఐక్యతను ప్రధానమైన పురోగమనంగా చూడాలి. ఈ ఐక్యతే నయా ఉదారవాద విధానాలను తిరస్కరించడానికి దేశవ్యాప్త రాజకీయ పరిణామాలకు దారి తీస్తుంది.
ఈ నేపథ్యం లోనే ప్రధాన రాజకీయ పార్టీ బిజెపి కి దేశవ్యాపితంగా ప్రాంతీయ పార్టీలు తమ విధేయత నుండి దూరం అవుతున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలకు, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పంజాబ్ లో రైతాంగ ఉద్యమం ఉధృతం అవుతున్న నేపథ్యంలో బిజెపి కి చిరకాల భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ ఎన్‌డిఏ ని వదిలి అనివార్యంగా బయటకు రావలసి వచ్చింది. దీనికి కొనసాగింపుగానే, బిజెపి కి సానుకూలంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు తన పంథాను మార్చుకుని రైతాంగ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. వీటిలో టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌పి, టిడిపి, ఎస్.పి, ఆర్‌జెడి, టిఎంసి, జేఎంఎం లాంటి అన్ని ప్రాంతీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. డిసెంబర్ 8న జరిగిన భారత్ బంద్ నాటకీయంగా బిజెపి ని రాజకీయంగా ఏకాకిని చేసింది. 2019 సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో వ్యవసాయ రంగంలో స్వేచ్ఛా మార్కెట్ విధానాన్ని ప్రకటించినప్పటికీ, తన పంథాను మార్చుకొని అనివార్యంగా రైతాంగ పోరాటాలకు మద్దతు పలకవలసి వచ్చింది. రైతాంగ ఉద్యమాల వల్ల దేశవ్యాప్తంగా నూతన రాజకీయ సమీకరణలకు ద్వారాలు తెరిచినట్లు స్పష్టంగా కనబడుతున్నది.
ఈ ఉద్యమం ప్రధాని నరేంద్ర మోడీ నోటి వెంట వెలువడిన కార్పొరేట్ శక్తుల నినాదం ''ఒకే దేశం-ఒకే మార్కెట్'' యొక్క ఆట కట్టించింది. రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల విధాన హక్కులను తిరస్కరిస్తూ అమలు చేస్తున్న జిఎస్‌టి విధానం వల్ల భారతదేశ ఫెడరల్ స్వభావం దాడికి గురయింది. కార్పొరేట్ శక్తులు మరియు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి భారతదేశ మొత్తం వనరులను బలవంతంగా దోచుకోవడానికి సిద్ధపడుతున్నది. వ్యవసాయ భూములను, వ్యవసాయ ఉత్పత్తులను, వ్యవసాయ మార్కెట్లను, గ్రామీణ వ్యాపారాన్ని, రవాణా సదుపాయాలను స్వేచ్ఛగా ఆక్రమించుకోవడానికి సిద్ధపడుతున్నది. మనం రాజ్యాంగంలో రూపొందించుకున్న ఫెడరల్ స్వభావం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాల వల్ల కార్పొరేట్ల చొరబాటును ఒక మేరకైనా కట్టడి చేయగల అవకాశాన్ని ఇచ్చింది. ఏది ఏమైనా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంలో వున్న కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి ని బలవంతంగా అమలు చేయడం ద్వారా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా కొనసాగడానికి ఉపకరించిన ఫెడరల్ విధానాన్ని ధ్వంసం చేయడానికి దోహదపడింది.
కార్పొరేట్ శక్తులు, వారి అంతర్జాతీయ భాగస్వాములు భారత ఆర్థిక వ్యవస్థపై తమ ఆధిపత్యం ఉండాలని కోరుకుంటున్నాయి. దీనిలో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయంలో, వేతన నిర్ణయంలో, అదేవిధంగా పని గంటల నిర్ణయంలో, తమకు స్వేచ్ఛ కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బహుళజాతి సంస్థలు నిరంతరం భారతదేశం యొక్క స్వదేశీ ఆహార మార్కెట్లపై దృష్టి సారిస్తున్నాయి. అంతులేని దురాశతో కూడిన లాభాలను సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఆ మూడు వ్యవసాయ చట్టాలను, నాలుగు లేబర్ కోడ్స్‌ను తెస్తూ, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దొడ్డి దారిన కార్పొరేట్ల ద్వారా బహుళజాతి కంపెనీలు ప్రవేశించి, రెండు విభాగాలుగా మిళితమై, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్‌టి అమలుకు అంగీకరించటం వల్ల రాష్ట్రాలు వనరుల కొరతను ఎదుర్కొంటూ, కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక సహకారం కోసం ఎదురు చూడవలసిన స్థితి ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటి (ఎఐకెఎస్‌సిసి) కార్యనిర్వాహక వర్గం... జిఎస్‌టి సమస్య, మూడు వ్యవసాయ చట్టాలు మరియు విద్యుత్ సవరణ బిల్లుపై పోరాటానికి సిద్ధపడిన బిజెపి యేతర ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాజకీయ ఏకీకరణ చేసే ప్రయత్నాలకు సహాయకారిగా ఉంటుంది. అన్ని తరగతుల ప్రజల సమాన అభివృద్ధికి ఉపకరిస్తుంది. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం సామ్యవాదం, ఫెడరలిజం లాంటి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఈ ఐక్యత ఒక మైలురాయిగా నిలుస్తుంది.
రాజకీయ రంగంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఉత్పత్తికి మూలమైన కార్మిక, కర్షకుల మధ్య ఐక్యత పెంపొందటం. సెప్టెంబర్ 2020 పార్లమెంట్ సమావేశాల్లో హడావిడిగా చర్చ లేకుండా మూడు వ్యవసాయ బిల్లులను, నాలుగు లేబర్ కోడ్సును చట్టం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం యొక్క కార్పొరేట్ అనుకూల నగ వైఖరి బయటపడింది. ఈ చట్టాలు కార్మికులు, రైతులు తమ హక్కులను రక్షించుకోవడం కోసం అనివార్యంగా ఐక్యం చేశాయి. ఈ విధమైన కార్మిక కర్షక మైత్రి నవంబర్ 26న అఖిల భారత రైతాంగ పోరాటం, డిసెంబర్ 8న జరిగిన అఖిల భారత బంద్ విజయవంతం కావడంతో రుజువయింది. రెండు వారాల వ్యవధిలో అలాంటి గొప్ప సమ్మెలు ప్రజా వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి ప్రజల సంసిద్ధతను తెలియజేశాయి.
కార్మికులు, రైతాంగంతో పాటు, భూమి కలిగిన రైతులు...వారితో పాటు చిన్న వ్యాపారులు, చిన్న ఉత్పత్తిదారులు భారీగా ఉద్యమాల్లో పాల్గనడం అపూర్వమైనదే కాక, గతంలో ఎన్నడూ జరగనిది. ప్రస్తుత పోరాటాన్ని ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభ నేపథ్యంలో భాగంగా అంచనా కట్టాలి. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు తమ సంక్షోభాలను అధిగమించడానికి, పునాది వర్గాలను మరింత దోపిడీ చేయడానికి, వారు హుందాగా జీవించడానికి అవసరమైన ధరలు, వేతనాన్ని ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు వ్యతిరేక పోరాటం సరైన మార్గంలో ప్రజా ఉద్యమంగా మారి అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల ఉత్పత్తులను, సేవలను బహిష్కరించాలనే నినాదంతో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నినాదం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా స్వీకరించబడింది. రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ వర్గాలలో విస్తృతమౌతున్న ఐక్యత భారత దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ పోరాటం మరింత సంఘటితం అవడమే కాక, రైతాంగ ఉద్యమాలను చీల్చే ప్రయత్నం చేసిన మోడీ ప్రభుత్వ మొండి వైఖరిని దృఢంగా తిప్పికొట్టాయి. అసంఘటిత రైతు సంఘాల పేరుతో ఉన్న (పేపరు సంఘాలతో) మూడు వ్యవసాయ బిల్లులకు కార్పొరేట్ అనుకూల చట్టాలకు అనుకూలంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాపితంగా లక్షలాది మంది రైతులు పాల్గంటున్న నేపథ్యంలో వారి ప్రయత్నాలు వృధా అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా దమనకాండ ప్రయోగించడమే కాక రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి దేశ సమైక్యతకే ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తుంది. అన్ని రాష్ట్రాలలో పెరుగుతున్న మద్దతు, నిరంతర నిరసన పిలుపులు రైతాంగ ఉద్యమానికి మరింత విశ్వాసాన్ని ఇస్తున్నాయి. ఈ విశ్వాసం మూడు వ్యవసాయ బిల్లులను, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకునే వరకు ఉద్యమం తీవ్రతరం చేయబడుతుంది. దానికి అవసరమైన బలాన్ని చేకూరుస్తుంది.
ప్రధానమంత్రి ఈ సమస్యను సొంత వ్యవహారంగా భావిస్తూ రైతాంగ సమస్యలను పరిష్కరించడానికి గానీ, చట్టాలను వెనక్కి తీసుకోవడానికి గాని ప్రయత్నించడం లేదు. ఈ మూర్ఖపు పట్టుదల వల్ల అనేక వర్గాలు ఈ పోరాటంలో భాగస్వాములు కావడానికి దోహదపడుతుంది. మోడీ అనుసరిస్తున్న ఈ వైఖరి అతని నైజాన్ని బహిర్గతం చేయటమే కాక, ఒక బలహీనమైన, నిస్సహాయ పాలకునిగా రుజువు చేసింది. కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీయై, నెల రోజులకు పైగా రైతులు రాత్రింబవళ్ళు ఎముకలు కొరికే చలిలో లక్షల సంఖ్యలో ఉద్యమంలో పాల్గొంటూ ఢిల్లీ రహదారులను దిగ్బంధం చేసినా, వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఇప్పటికే ప్రమాదాల్లో, ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో జబ్బునపడి 33 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయిన ప్రధాని, రైతాంగం చేస్తున్న మహోన్నతమైన పోరాటాన్ని గుర్తించటానికి గాని, వారి డిమాండ్లను పరిష్కరించడానికి గానీ సిద్ధపడటం లేదు. పాలకుల ఈ క్రూరమైన ఆలోచనా విధానం...శిలా సదృశ్యమైన రైతాంగ పోరాటం ముందు ఓడిపోక తప్పదు.
(వ్యాసకర్త ఎఐకెఎస్ జాతీయ కోశాధికారి)

పి. కృష్ణప్రసాద్










