
న్యూఢిల్లీ : ఆరుగాలం కష్టించి పండించే పంటను కార్పొరేట్ల వశం చేసేందుకు మోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో కర్షకులు రెండున్నర నెలలుగా ఉద్యమ పోరు సాగిస్తున్నారు. రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి తోడ్పడుతుందని నిరూపించేందుకు గడ్డకట్టే చలిని తట్టుకుని...ఇంటిని, కుటుంబాన్ని వదిలేసి అకుంఠిత దీక్షతో పోరుబాట చేపట్టారు. కేంద్రం చట్టాలను ఉపసంహరించుకునేది లేదని మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నా... రద్దే తమ సమస్యలకు పరిష్కారమని ఖరాఖండిగా రైతు సంఘాలు తెగేసి చెబుతున్నాయి. అప్పుడే ఆందోళనలను విరమించుకుంటామని స్పష్టం చేశాయి. ఈ ఆందోళనలకు వేదికలుగా నిలిచిన సింఘు, ఘాజిపూర్, టిక్రీ వంటి సరిహద్దుల వద్ద టార్పాలిన్స్‌తో టెంట్లు ఏర్పాటు చేసుకుని అన్నదాతలు ఇన్ని రోజులగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఆందోళనలు ఒకెత్తు కాగా...ఇక నుండి మరో ఎత్తు కానున్నాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
రానున్నది మండు వేసవి. ఇప్పటి వరకు ఉద్యమకారులు ఏర్పాటు చేసుకున్న టార్పాలిన్ టెంట్లు నీడనే కాకుండా చలిని తట్టుకునేందుకు సాయపడ్డాయి. అయితే ఇప్పుడు వేసవి కాలంలో కూడా ఉద్యమం కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయం కోసం రైతు సంఘాల నేతలు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. షెడ్లు, దోమ తెరలు, ఫ్యాన్లు, కూలర్లు వంటివి ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు.
కూలర్లు, ఫ్యాన్లు ఆర్డర్ చేసిన రైతులు
ఘాజిపూర్ వద్ద నిరసనలు చేపడుతున్న భారతీయ కిసాన్ యూనియన్ సభ్యుల్లో ఒకరైన మన్ను త్యాగి మాట్లాడుతూ రానున్నదీ వేసవి కాలం కాబట్టి...కూలర్లు, ఫ్యాన్లను ఇప్పటికే ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ఈ నెల చివరికి చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు. వేసవి కాలానికి అవసరమైన ఇతర వస్తువులు కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా.. ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉద్యమం కొనసాగేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదేవిధంగా పలు రైతు సంఘాలు సైతం కూలర్లు, దోమ తెరలు, ప్లాస్టిక్ షీట్లు, సమ్మర్ టెంట్లు మొదలైనవి ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం ఇక్కడ జరిగిన ఓ సమావేశంలో కూడా వేసవి నేపథ్యంలో ఉద్యమకారులకు తగిన ఏర్పాట్లు చేస్తామన్న హామీ ప్రకటన ఒకటి జారీ అయ్యింది. మనమంతా ఉద్యమాన్ని కొనసాగించాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..కిసాన్ ఏక్తా మోర్చా అన్ని ఏర్పాట్లు చేసిందని ఆ ప్రకటన సారాంశం. చలికాలంలో సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అయినప్పటికీ అందరం కలిసి వాటిపై పోరాడామని ప్రకటన పేర్కొంది.
ఎక్కువ నీటిని అందుబాటులో ఉంచుతాం : రైతులు
జనవరి 26 తర్వాత ఘాజిపూర్ వద్దకు చేరుకున్న ముజఫర్‌నగర్‌కు చెందిన మహేంద్ర పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పుడు వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో తమ టెంట్లకున్న టార్పాలిన్ కవర్లను తొలగించి...దోమ తెరల ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కూలర్లు, ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నామన్నారు. అదేవిధంగా అవసరమైన దుస్తులను.. ఫ్యాన్లను, కూలర్లను ఇంటి నుండి తెచ్చుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలిపారు. చల్లని నీరు వంటి ఏర్పాట్లు చేస్తామని భాగ్‌పట్‌కు చెందిన రైతు రాజ్‌బీర్ సింగ్ పేర్కొన్నారు. రైతులు డీహైడ్రెషన్‌కు గురికాకుండా ఉండేందుకు పానీయాలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఎక్కువ నీటిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. వేసవిలో ఉద్యమాన్ని కొనసాగించడానికి అవసరమైన సదుపాయాలు ఏర్పాట్లు చేయడానికి గురుద్వారా కమిటీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఈ నల్ల చట్టాలు రద్దు చేయకపోతే..తాము ఈ ఏర్పాట్లు చేసుకుంటామని సింఘా బోర్డర్ రైతులు చెబుతున్నారు. రానున్నదీ వేసవి కాలం కావడంతో ఈ వేడిమి తాపానికి ఆందోళనలు చేపట్టలేమని, కచ్చితంగా ఓ నీడ కావాలని...ఈ ఆందోళన కొనసాగుతూ ఉంటే తాము ఇటువంటి ఏర్పాట్లు చేసుకుంటామని పాటియాలా స్వతంత్ర రైతు డానియేల్ మూసా తెలిపారు. ఒకవేళ విద్యుత్ సరఫరాను కేంద్రం స్థంభింపచేస్తే...ఫ్యాన్లు, కూలర్ల తిరిగేందుకు జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఖర్చును తగ్గించుకునేందుకు సోలార్ ప్యానల్స్ వంటి సౌకర్యాలను ఏర్పరుచుకుంటామని తెలిపారు.