Jun 20,2023 10:23

లక్నో : వడగాలులతో ఉత్తరాది రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలోనే గత 3 రోజుల్లో 98 మంది దాకా మరణించారు. మరో 400 మంది అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరారు. యుపిలో పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్క బలియా జిల్లాలోనే 3 రోజుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల వ్యవధిలో ఇక్కడ 34 మంది చనిపోవడం కలవరపెడుతోంది. యుపిలో అనేక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బలియా జిల్లాలో వడగాల్పుల కారణంగా 400 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ నెల 15న 23 మంది, తరువాత రోజు 20 మంది, తాజాగా 11 మంది ప్రాణాలు కోల్పోయారని బలియా జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారి మరణానికి అనేక అంశాలు కారణమని, అందులో వడదెబ్బ ఒకటని చెప్పారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు ఇతర కారణాలతో బాధితులు ఆసుపత్రిలో చేరుతున్నారని, గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, డయేరియాలతో చనిపోతున్నారని తెలిపారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వారేనని బలియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దివాకర్‌ సింగ్‌ తెలిపారు.
          బిహార్‌లోనూ మూడు రోజుల్లో 44 మంది చనిపోగా కేవలం రాజధాని పాట్నాలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. నలందా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో 19 మంది, పిఎంసిహెచ్‌లో 16 మంది మృతి చెందాయి. మరో 9 మరణాలు ఇతర జిల్లాల్లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బిహార రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్న దష్ట్యా అక్కడి విద్యా సంస్థలకు ఈ నెల 24 వరకు సెలవులను పొడిగించారు.