
'హాయ్' డెస్క్ దగ్గర నుండి కొలీగ్‌కి వాట్సాప్ మెసేజ్ చేసింది.
'హే హాయ్ ' ..'స్పేర్ ఉందా?' ..'నీకా?'..'అవును'
'లేదు. మొన్ననే బ్యాగ్లో ఉన్న లాస్ట్‌ది వాడేశాను. సారీ.. అర్జెంటా?'
'హా.. జస్ట్ స్టార్ట్ అయ్యింది.'.. 'అయ్యో! ఎలా మరి?'
'తెలీట్లేదు. మన వాళ్లందరినీ అడిగాను. ఎక్కడా లేదు. నీ దగ్గర జాకెట్ లాంటిది ఏదైనా ఉందా?'
'వింటర్ కోట్ ఉంది.'.. 'ఇస్తావా? నడుం చుట్టూ కట్టుకుంటాను. ఇంటికి వెళ్లిపోతాను.'.. 'ష్యూర్.. ఒకవేళ కనిపిస్తే?'
'చేసేదేముంది? వెనక నుండి గట్టిగా కడతాను'
'సరే, వస్తున్నా నీ డెస్క్ దగ్గరకి. నేను అడ్డం నిలబడతా. గోడకి నుంచుని కట్టుకో.'.. 'చాలా థాంక్స్' ముడేస్తూ.
'పర్లేదు.. జాగ్రత్త. అందరం లంచ్‌కి ఆఫీస్ ఎదురుగా ఉన్న పిజ్జా కింగ్‌కి వెళ్తున్నాం. ఒక పిజ్జా కొంటే ఇంకోటి ఫ్రీ ఆఫర్ ఉందట! నిన్ను మిస్ అవుతాం' అంది మెట్ల వరకూ వస్తూ.
సన్నగా నవ్వింది.
వెనక నుండి, 'మేడం ఏంటిది? సమ్మర్‌లో వింటర్ కోట్? ఆడవాళ్లకి ఇప్పుడిది కొత్త ట్రెండా..' వెకిలిగా నవ్వాడు పైఫ్లోర్ ఫైనాన్స్ అతను.
'అవును. ఈ ట్రెండ్ బ్రేక్ చేయలేకపోతున్నాం' అంది కాస్త చిరాగ్గా పక్కకి తప్పుకుంటూ'.
కోట్ నడుము చుట్టూ సర్దుకుంటూ అందరు దిగే వరకూ ఆగి, అప్పుడు మెట్లు దిగి బయటకి వచ్చింది. ముందువైపు హ్యాండ్ బ్యాగ్‌తో కవర్ చేసింది. నొప్పి మొదలైంది. పొత్తి కడుపులో ఉండ చుట్టుకుంటున్నట్టు ఒకటే నొప్పి. నడుము నొప్పి ఇక చెప్పక్కర్లేదు. నడుము మధ్యభాగం నుండి ఎడమ కాలు చిన్న వేలు వరకూ ఒకటే లాగుతుంది. వెనక్కి వొంగి, బ్యాక్ చూసుకుంటూ గేట్ బయటకొచ్చి ఆటో కోసం చూసింది. ఎదురుగా పిజ్జా ప్లేస్. బయట బ్యానర్ కట్టుంది. వన్ ప్లస్ వన్ ఆఫర్ అట. చుట్టూ ఉన్న ఆఫీసుల నుండి వచ్చిన జనంతో కిటకిటలాడుతోంది. ప్రపంచీకరణ వెంట పట్టుకొచ్చిన కితకితలివి. బాగా డెవలప్ అయ్యాం. ఒకటి కొంటే మరో పిజ్జా ఫ్రీగా దొరుకుతోంది. అవసరానికి ఒక శానిటరీ ప్యాడ్ దొరకదు తనకి. 'డెవలప్ అయ్యామా?' అనుకుంది మనసులో.
పక్కనే చలివేంద్రం. అక్కడ ఆగిన వాళ్లకి నీళ్ల గ్లాసులు అందిస్తున్నారు ఇద్దరు. అలా అవసరమున్నప్పుడు అందుబాటులో ప్యాడ్స్ ఉంటే ఎంత బాగుండేది? కానీ దొరకవ్. దొరికే వరకూ అడగాలి. ఫెసిలిటీస్ బాగున్న ఆఫీసుల్లో టాయిలెట్‌లో వెండింగ్ మెషిన్‌లు ఉంటాయి. అవి కూడా ఎప్పుడోకాని దొరకవ్. స్టాక్ లేదంటారు.
ఆటో వచ్చింది. మీటర్ వేయడట, డబుల్ రేట్ చెప్పాడు. బేరం ఆడే ఓపిక, టైం రెండూ లేవు. సీట్ కింద కోటు సర్దుకుంటూ ఎక్కి కూర్చుంది.
ఇంజన్ స్టార్ట్ చేసి, హుషారుగా యూ టర్న్ తీసుకున్నాడు. 'పరదేశి పరదేశి జానా నహీ' చెవులు పగిలిపోయేటట్టు స్పీకర్ ఆన్ చేశాడు. అసలే చిరాకులో ఉంది. వెంటనే ఆపమని చెప్పింది. పాట కట్టేశాక వాడి హుషారు తగ్గి, ర్యాష్ డ్రైవింగ్ మొదలైంది. ట్రాఫిక్‌లో షార్ప్ కట్స్ చేశాడు. కుర్రాడు ఎవరో రోడ్డు దాటుతుంటే సడన్ బ్రేక్ వేసి, 'అరే, మోమో! జల్దీ హట్ నా' అరిచాడు. ఆ అబ్బాయి వంక చూసింది. నార్త్ ఈస్ట్ నుండి అనుకుంటా. వీడు అతన్ని పట్టుకుని 'మోమో' అనేశాడు. 'హౌ మీన్! అంతేలే, అమ్మాయిలకే ఇంకా ఇంక్లూసివ్‌గా అనిపించడం లేదు. ఇక వేరే ప్రాంతం నుండి అంటే ఇలాగే ఉంటారేమో' అనుకుంది మనసులో. ఎదురుగా వస్తున్న స్పీడ్ బ్రేకర్ చూస్కోకుండా బండి ఎత్తేశాడు. ఆ ప్రెషర్‌కి తనకి ఒకటేసారి ఫ్లష్ అయ్యింది. వెంటనే బ్యాగ్‌లో నుండి స్కార్ఫ్ తీసి ఉండ చుట్టి కాళ్ల మధ్యన పెట్టింది. కత్తితో పొడుస్తున్నట్టు ఉంది నొప్పి. పొత్తి కడుపు పట్టుకుని ముందుకు ఒంగింది.
'భయ్యా. ఆరామ్ సే చలో. తబియత్ ఠీక్ నహీ హై' అంది నీరసంగా.
వాడు విన్నాడో లేదో మరి, ఆటోని మాత్రం దారి పొడుగునా గుంటల్లో పడేసి, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎత్తేశాడు. ఇంటికి చేరేసరికి మనిషి వేడిగాడ్పు తగిలిన కలువపూవు వలె వడిలిపోయింది. రోజూ ఎక్కే మెట్లే. పక్కింటి పిల్లాడితో ఆట్లాడుతూ పోటీగా రెండేసి ఎక్కేది. ఇవ్వాళ ఒక మెట్టు ఎక్కడానికి ఓపిక లేదు.
రెండో రోజుకి నొప్పి పెద్దగా తగ్గకపోయినా, ఆఫీస్‌కి వెళ్లడం తప్పలేదు. హెడ్ ఆఫీస్ నుండి బాస్ వస్తుందని ముందే తెలుసు. ఫీల్డ్‌వర్క్ కూడా ఉంటుందని తెలుసు. ఫీల్డ్‌వర్క్‌లో ఉన్నప్పుడు తాగడానికి వాటర్ బాటిల్ అయితే వెంట తీసుకువెళ్లింది కానీ మధ్యలో టాయిలెట్ బ్రేక్‌కి వెళ్లలేక ఇబ్బంది పడింది. నీళ్లు తాగితే టాయిలెట్‌కి వెళ్లాలి. చుట్టూ ఎక్కడా టాయిలెట్స్ కనపడవు. షాప్స్‌లో అడిగితే 'ఓన్లీ ఫర్ స్టాఫ్' అంటారు. అలాగే అసహనంగా ఆమెతో పాటు తిరిగింది.
మూడో రోజుకి సూది గుచ్చిన్నట్టు నొప్పి మొదలైంది. ఇలాంటి నొప్పి ఎప్పుడూ లేదే? తొడలు దగ్గర అక్కడక్కడా ర్యాష్ కూడా వచ్చింది. హాఫ్ డే లీవ్ పెట్టి, డాక్టర్ దగ్గరికి వెళ్లింది.
'ప్యాడ్ ర్యాష్ ఇది. చాలా ఎక్కువగా ఉంది. ప్యాడ్ చేంజ్ చేయడంలో ఏమైనా ఆలస్యం అయ్యిందా? యూరిన్ రిపోర్ట్ కూడా చూశాను. ఇన్ఫెక్షన్ ఉంది. యాంటిబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది.'
'అంటే డాక్టర్.. నిన్నా, మొన్నా పని ఒత్తిడి ఎక్కువైంది. బ్రేక్ దొరకలేదు. ప్యాడ్ టైంకి చేంజ్ చేయలేకపోయాను.'
'నో నో. అలా ఉండకూడదు. ప్యాడ్ వెంటనే చేంజ్ చెయ్యాలి. లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ర్యాష్‌కి క్రీం రాస్తున్నాను. వారం తర్వాత తగ్గకపోతే రండి. లూస్ అండ్ కాటన్ క్లోథింగ్ వేసుకోండి. యూరినరీ ఇన్ఫెక్షన్‌కి ఈ యాంటిబయోటిక్స్ కోర్స్ వాడండి. నీళ్లు తాగడం తప్పనిసరి.'
ర్యాష్ వల్ల మంట. ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి. గబగబా నడవలేదు. మెల్లగా బయటకొచ్చి ఫార్మసీలో మందులు కొనుక్కుంది. పక్కన పాన్‌షాపులో చిప్స్, గుట్కా ప్యాకెట్లు, వేలాడేసున్నారు. రకరకాల పాన్ ఫ్లేవర్స్ వరసగా గాజు అల్మారాలో పెట్టున్నాయి. ఎవరికి నచ్చింది వాళ్లు స్వేచ్ఛగా కొనుక్కుంటున్నారు. 'ఇలా ప్యాడ్స్ ఎప్పుడు అమ్ముతారో? అసలు అలా అమ్ముతారా? ఒకవేళ అలా అనుకుందని తెలిస్తే తనని జడ్జ్ చేస్తారా?'
'ఔట్ ఔట్' అరుస్తున్నారు గ్రౌండులో పిల్లలు. కాదని అవతల టీం వాదనకి దిగింది. తన యూనివర్సిటీ రోజులు గుర్తొచ్చాయి.
ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్స్‌లో తన టీం ఫైనల్స్‌కి వచ్చింది. ఎప్పుడూ కిక్ ఇచ్చే సున్నం జల్లిన కోర్ట్ బౌండరీ, వార్మ్ అప్ చేస్తున్న టీమ్స్, రెఫరీల విజల్స్ ఇప్పుడు ఆమెను కంగారుపెట్టాయి. తనకి అప్పుడే నొప్పి మొదలైంది. స్ట్రెస్ వల్ల ఏమో పీరియడ్స్ ముందే వచ్చేటట్టు ఉంది. కాసేపట్లో ఫైనల్ మ్యాచ్. అర్జెంటుగా ప్యాడ్ కావాలి. దొరకలేదు. ఫ్రెండ్ ఒకామె నాలుగు కర్చీఫ్‌లు కలిపి, రెండువైపులా పిన్నీసులు పెట్టిచ్చింది. అది తీస్కుని టాయిలెట్ కోసం పరుగులు తీసింది.
నీలం రంగు సింథటిక్ చీర పైకి దోపి ప్లాస్టిక్ సీసాలో నుండి ఫినాయిల్ పోస్తూ కారిడార్ కడుగుతున్న ఆయమ్మ దగ్గరికి పరిగెత్తింది.
'ఆయమ్మా, టాయిలెట్ ఎక్కడీ'
అదేదో మార్స్‌కి దారి అడిగినట్టు ఆమె నిటారై చూసింది. ఆ ప్రాంగణంలో ఆమె ఎప్పుడూ వాడలేదు, వినలేదు లేడీస్ టాయిలెట్ గురించి. ఆమెకెలా తెలుస్తుంది పాపం?
'అటు ఎటో ఒకటి ఉండాలి స్టోర్‌రూమ్ వైపు' ఒక పాత రేకుల షెడ్డు చూపించింది.
ఆ దారి అంతా పిచ్చి మొక్కలు, నాచు. డోర్ దగ్గరికి వెళ్లి నిలబడింది. నీళ్లు రావు అని వెనక నుండి ఆయమ్మ కేక పెట్టింది.
'నీళ్లు లేకపోతే ఎలా? వెనక్కి పరిగెత్తింది. అర్జెంటు ఆయమ్మా. నాకు ఇప్పుడు మ్యాచ్ ఉంది. పీరియడ్స్ వచ్చేలా ఉన్నారు. నీళ్లు ఎలా? హెల్ప్ చేయవా ప్లీజ్' కంగారుగా అడిగింది.
ఖాళీ సీసా ఇచ్చి వెనకున్న పంపు దగ్గర పట్టుకోమని చెప్పింది.
డోర్ గొళ్లెం తీస్తుంటే కీచు మంటూ చప్పుడు. ఎన్ని రోజులైందో తెరిచి. తెరవగానే గుప్పుమని గబ్బిలాల వాసన. ముక్కు మూసుకుంది. ఎక్కడా లైట్ లేదు. ఫోన్‌లో టార్చ్ ఆన్ చేసింది. పై నుండి బూజులు మర్రిచెట్టు ఊడల్లా వేలాడుతూ గదంతా పరుచుకున్నాయి. రెండు కుర్చీల సందులో నుండి ఒక పాత డోర్ మీద ఎర్ర పెయింట్‌తో అష్ట వంకర్లలో 'లేడీస్' బోర్డు కనపడింది.
పరిగెత్తింది. గబ్బిలం ఒకటి మొహం మీద వరకూ వచ్చి, పక్కకు తిరిగింది. గుండె గొంతులోకి వచ్చినంత పనైంది. 'లేడీస్' డోర్ గొళ్లెం మరోసారి కీచ్ అంటూ తెరుచుకుంది. ముక్కులు పగిలిపోయేంత వాసన. ఫ్లోర్ అంతా ఎర్రటి చారలు.. ఎండి, నల్లగా మారిన మనిషి మలినాలు. గోడల మీద పాకే బల్లులు. కడుపులో చెయ్యి పెట్టి, దేవినట్టయింది. బయటకి పరిగెత్తి, పొద్దున తిన్నదంతా కక్కింది. కాస్త దూరంలో ఉన్న ఆయమ్మ వచ్చి పట్టుకుంది.
'ఏమైంది?'
చెప్పలేకపోయింది. తూలి పడిపోతుందేమో అన్నట్టుంది ఆమె పరిస్థితి. భుజం చుట్టూ చేతులు వేసి గ్రౌండ్‌లో బెంచ్ దగ్గరకు తీసుకొచ్చింది ఆయమ్మ.
చీఫ్ గెస్ట్ స్పీచ్ మొదలైంది. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, ముఖ్యంగా క్రీడల్లో మరింత మంది ముందుకు రావాలని, స్త్రీ, పురుష అథ్లెట్లకు ప్రభుత్వం సమాన సహాయాన్ని, ప్రోత్సాహకాలను అందిస్తోందని, శిక్షణ తదితరాలకు లింగ వివక్ష లేదని చెప్పుకుపోతున్నాడు. ఫైనల్ మ్యాచ్ చీఫ్‌గెస్ట్ స్పీచ్ తర్వాత ఆయన సమక్షంలో ఉంటుంది. కోచ్ జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టాడు. తనని రమ్మని చెయ్యి ఊపాడు.
వీక్ ప్లేయర్స్‌ని వెనక నుండి కవర్ చేసి, లాంగ్ షాట్స్ తీస్కోమని తనకి చెప్తున్నాడు. ఆయన మాటలు ఆమె మైండ్‌కి ఎక్కడం లేదు.
చీఫ్ గెస్ట్ ఇచ్చే స్పీచ్ వినపడుతోంది. 'అదేంటి శానిటేషన్ ప్రతి మానవుడి హక్కు అని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన శానిటేషన్ సదుపాయాలు పొందేందుకు అర్హులని చదువుకుంది? పుస్తకాల వరకే పరిమితమా?'
ఓ పక్క పీరియడ్స్ ప్రెషర్, మరోవైపు నెత్తిన మ్యాచ్ వల్ల స్ట్రెస్. తన బదులు ఎక్స్ట్రాని పంపమంటే కోచ్ ససేమిరా అన్నాడు. స్పీచ్ పూర్తయ్యింది. టాస్ వేశారు. అవతల టీం టాస్ గెలిచి, సర్వీస్ తీసుకున్నారు. ఎదురెండ లేని కోర్ట్ సెలెక్ట్ చేసుకుంది తను. కెప్టెన్స్ ఇద్దరూ చేతులు కలిపాక టీమ్స్ పొజిషన్స్ తీసుకున్నాయి. ఇప్పుడు పీరియడ్స్ వస్తే ఎలా అని ఆలోచిస్తూ వెళ్లి తన ప్లేస్‌లో నిలబడింది.
'లవ్ ఆల్' సర్వీస్ స్టార్ట్ చేసింది ఒప్పోనెంట్ టీం. 'వేర్ ఈస్ ది లవ్ ఫర్ విమెన్?' అనుకుంది మనసులో.
బాల్ తన దగ్గరకి వచ్చింది. రెండు పిడికిళ్లు బిగించి, మణికట్టుతో బాల్‌ని అవతల కోర్ట్‌లోకి కొట్టింది. ఆ లిఫ్ట్‌లో తన పవర్ లేదు. సరిగ్గా కొట్టుంటే ఆమె లిఫ్ట్ నుండి వచ్చే ప్రెషర్‌కి ప్లేయర్ వేళ్లు నొప్పి పుట్టి, బాల్ డ్రాప్ చేసుండేది. ఆమె ఆట అలాంటింది.
'ఎనర్జీ ఎనర్జీ' అరిచాడు కోచ్ వెనక నుండి.
కాసేపటికి ఒప్పోనెంట్ సర్వీస్ బ్రేక్ అయ్యింది. ఇప్పుడు ఆమె సర్వీస్.
'లవ్ నైన్' బాల్ పైకి లేపి, అరచేత్తో అవతల కోర్ట్‌లోకి కొట్టింది. సెంటర్ ఫార్వర్డ్ చేతిలో ల్యాండ్ అయ్యింది. నార్మల్‌గా రైట్ బ్యాక్ వెళ్లాల్సిన సర్వీస్ అది. 'అతికష్టం మీద ముందువరుస వరకూ వెళ్లింది' అనుకుంది. తన ఒక్క సర్వీస్‌తో సునాయాసంగా మ్యాచ్ ఫినిష్ చేసిన టార్నమెంట్లు ఎన్నో.
'ఫోకస్ ఫోకస్' వెనక నుండి మళ్లీ కోచ్ కాస్త చిరాగ్గా.
ఈసారి గట్టిగా సర్వీస్ చేసింది. రెండు పాయింట్లు వచ్చాయి. పొట్టలో నొప్పి ఎక్కువైంది. అసహనంగా ఆడింది. ఫార్వర్డ్ లెఫ్ట్ వల్ల తన సర్వీస్ బ్రేక్ అయ్యింది. అక్కడ నుండి ఒప్పోనెంట్ స్కోరింగ్ మొదలైంది. గేమ్ పాయింట్ దగ్గర పడేకొద్దీ మ్యాచ్ ఓడిపోతున్నామని టీంకి అర్థమైంది. కనీసం మంచి స్కోర్‌తో బయటకి వద్దాం అనుకుంటే డిఫెండ్ చేస్తూ చేస్తూ ముందుకి పడింది. అరక్షణం తర్వాత తడి తగిలి, నొప్పి తీవ్రత ఎక్కువైపోయింది. చుక్కలు కారుతుండగా, లేచి చేతులు అడ్డు పెట్టుకుని కోర్ట్‌కి వెనకున్న చెట్టు దగ్గరకి పరిగెత్తింది. మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఏడుస్తోందేమోనని ఇద్దరు ఎక్స్ట్రా ప్లేయర్స్ ఆమె వెనక పరిగెత్తుకొచ్చారు. పొట్ట పట్టుకుని ఏడుస్తుండగా కిందకి చూశారు. చిన్నగా రక్తం మరకలు తెల్లటి యూనిఫారం మీద పాకుతున్నాయి. వెంటనే ఒక అమ్మాయి బ్యాగ్‌లో నుండి తన స్కర్ట్ తీసి, పై నుండి నడుము వరకూ జార్చి కట్టింది. ఆ ఇద్దరు అడ్డం నిలబడగా వెనక చెట్లల్లోకి వెళ్లి ముందు ఫ్రెండ్ ఇచ్చిన కర్చీఫ్‌లతో చేసిన ప్యాడ్‌ను పెట్టుకుని వచ్చింది. అప్పటికే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది.
మ్యాచ్ ఓడిపోయిన బాధ కన్నా తనకి కలిగిన రిలీఫ్ వల్ల ఆమె కళ్లలో నీళ్లొచ్చాయి. వెళ్లి బెంచ్ మీద కూర్చుంది.
'వెల్ ట్రైడ్' అని ఒప్పోనెంట్స్, 'సచ్ ఏ డిస్సప్పోయింట్మెంట్' అని కోచ్, 'షిట్ యార్' అని తన టీం. సిగ్గుగా అనిపించింది. తనకి ఎంతో ఇష్టమైన గేమ్. అలా ఓడిపోవడం జీర్ణించుకోలేక ఆ భారం మోస్తూనే ఉంది.
'రిలీఫ్ ఎప్పుడో?'
పిల్లల వాదన అయిపోయినట్టుంది. వేరే వాడు బ్యాట్ పట్టుకున్నాడు. ఆలోచనల్లో నుండి తేరుకుని, మెల్లగా ఆఫీసుకు బయలుదేరింది.
ఆఫీసులో పెద్దావిడ, సీనియర్ ఇంజనీర్ మేడం ట్రాన్స్‌ఫర్ అవుతున్నారు. స్టాఫ్ చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఇబ్బందిగానే కూర్చుంది. సీనియర్స్ మాట్లాడాక, మేడమ్‌కి మైక్ ఇచ్చి ఆవిడ అనుభవాలు చెప్పమన్నారు.
పెద్దావిడ. తనకి చాలా ఇష్టం ఆమె అంటే. జాయిన్ అయినప్పుడు దగ్గరుండి పని నేర్పించింది. పొట్టిగా, పోచంపల్లి చీరల్లో, ముగ్గుబుట్ట లాంటి జుట్టుతో ఏదో హుందాతనం ఉంటుంది ఆమెలో. పెద్ద టోట్‌బ్యాగ్ ఆమె ట్రేడ్ మార్క్. కూతురు అమెరికా నుండి పంపిన సెంటిమెంట్ అని చెప్తుంది. క్లీన్ చేసిన టాయిలెట్‌ని మళ్లీ మళ్లీ క్లీన్ చేయిస్తుందని, 'ఇంట్లో మా ఆడవాళ్లే అనుకుంటే, మీరూ ఏంటి మేడం ఈ అతి శుభ్రం?' జోకులు వేస్తుంటారు మేల్ కొలీగ్స్. 'ఆ మీకేం తెలుసు మా బాధలు' అని మాట దాటేసేది.
అంతా సమోసాల కోసం, చారు కోసం ఎదురు చూస్తున్నారు. 'ఇన్ని సంవత్సారాల నా సర్వీస్‌లో..' మేడం మొదలుపెట్టారు.
ఎప్పుడూ వినే స్పీచులే. చివరి వరసలో కూర్చుని, మేడం చెప్పేదాని మీద ఒక చెవి వేసి మధ్య మధ్యలో ప్యాడ్ ర్యాష్ వల్ల ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా అని గూగుల్‌లో సెర్చ్ చేస్తోంది.
'ఈ ఆఫీసులో ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. ఎంతో మంది ఆఫీసర్స్ దగ్గర నేర్చుకున్నాను. కొత్త కొత్త పాలసీలు ప్రవేశపెట్టాను. దీనివల్ల డిపార్టుమెంటులో చాలా మార్పులొచ్చాయి. ఇంతచేసిన దాన్ని ఒక్కటి మాత్రం మార్చలేకపోయాను.'
అందరి చూపులు సమోసా టేబుల్ మీద నుండి మేడం వైపు కుతూహలంగా చూశాయి. ఆమె కళ్లల్లో నుండి బాధ తొంగి చూసింది. ఏదో చెప్పాలని, ఎప్పటి నుండో బయటకి చెప్పుకోలేనిదేదో మనస్ఫూర్తిగా అందరి ముందు బయట పెట్టాలని తపన. చెప్పే కొద్దీ ముందున్న కొలీగ్స్‌తో మేడం ఐ కాంటాక్ట్ తగ్గిపోయి, నేల మీద ఒక పాయింట్‌కి ఫిక్స్ అయ్యి మాట్లాడుతోంది.
'మన టాయిలెట్స్. స్త్రీ, పురుషులు అందరికీ కలిపి ఒకటే టాయిలెట్. ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు మేడం అని అడిగేవారు కదా? ఇందులో డెట్టాల్ సీసా, పేపర్ నాప్కిన్స్ లాంటివి ఉంటాయి' బ్యాగ్‌ని చూపిస్తూ అంది.
'ఔను. రోజూ పది మంది వాడుతుంటే రెగ్యులర్‌గా క్లీన్ చేయించక తప్పలేదు. ఆడవారి ఇబ్బంది అలాంటిది మరి. ఎవరూ తెలుసుకోలేరు' అంది ఇద్దరు ముగ్గురు మగ కొలీగ్స్ ఆమె నుండి చూపు తప్పించారు.
'ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడు మన జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఆ టాయిలెట్‌లో పడిన అవస్థ నాకు ఇంకా గుర్తు. అంత పొట్టేస్కుని ఆమె కిందకి ఎలా కూర్చుందో నాకు ఇప్పటికీ వింతే. పైకి లేవలేక పాక్కుంటూ ముందుకి వచ్చి, డోర్ హ్యాండిల్ సాయంతో అతి కష్టం మీద బయటపడింది. ఎంతో పోరు పెడితే కానీ వెస్ట్రన్ ఫెసిలిటీ ఇవ్వలేదు. అక్కడ నుండి నా శుభ్రం గోల మరింత ఎక్కువైంది. మన తర్వాత వెళ్లే వాళ్ల కోసం నీట్‌గా ఉంచాలి కదా? మన తర్వాత ఏంటని ఎందుకు ఆలోచించము? వాళ్లు చేసిన తప్పుకి నేను ఎన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డానో. మార్పు రావాల్సింది మనలో. 'వాష్' అనేది చాలా ముఖ్యం. వాటర్, శానిటేషన్, హైజీన్. శానిటేషన్ డిపార్ట్మెంట్‌లో ఉండి, మనం ఇది పాటించకపోతే ఇక బయట అంతంత మాత్రం ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ గతేంటి? ఇది ఇవ్వాళ ఎందుకు చెప్తున్నానంటే, రేపటి నుండి నేను ఈ ఆఫీసుకి రాను, నా బ్యాగ్ గురించి ఆరాలుండవు, నన్ను జడ్జ్ చేసేవాళ్లు ఉండరనే ధైర్యం.'
హాల్ అంతా నిశబ్దం పూనుకుంది.
'ప్రాపర్ శానిటేషన్ ఈస్ హ్యూమన్ డిగ్నిటీ. అది అందరికీ దక్కాలి. దక్కేలా చెయ్యాలి' ముగిస్తూ స్నాక్స్ టేబుల్ వైపు నడిచింది. ఆమెని అనుసరించారు స్టాఫ్.
వెనక సీట్‌లో అలాగే ఆలోచిస్తూ కూర్చుంది. అంత సీనియర్‌కి ఈ తిప్పలా? ఫీల్డ్ నుండి రాగానే టాయిలెట్ ఉంటే చాలు అనుకుంటుంది తను. ఉన్నది శుభ్రంగా లేకపోవడం, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం ఇప్పుడే వింటోంది.
నెల రోజుల తర్వాత ఒక పని మీద హెడ్ ఆఫీస్‌కి వెళ్లింది. మేడం అక్కడే ఉంటరాని తెలిసి లంచ్ టైంలో కలవడానికి వెళ్లింది. ప్రేమగా ఆహ్వానించింది పెద్దావిడ. పని గురించి, బ్రాంచ్ గురించి అడిగి తెలుసుకుంది.
కాసేపటికి, 'ఇక్కడైనా వసతులు బాగున్నాయా మేడం? మీరు మన పాత బ్రాంచ్లో టాయిలెట్ గురించి అంత ఇబ్బందిపడ్డారని తెలీలేదు' టేబుల్ వెనకున్న ఆమె పెద్ద బ్యాగ్ గమనిస్తూ అడిగింది.
'లేదమ్మా. మార్పు లేదు'.. 'అంటే?'.. 'అదే సమస్య.'
'ఎలా మేడం మరి? ఎలా అడ్జస్ట్ అవుతున్నారు?'
'ఎలా అంటే? ఇలానే' వెనకున్న బ్యాగ్ చూపిస్తూ.
'అంటే?'.. 'మరీ తప్పదు అనిపిస్తేనే టాయిలెట్ వాడతాను. లేదంటే నా ఏర్పాటు నేను చేసుకున్నాను.'
'మీ ఏర్పాట్లు అంటే? మళ్లీ అన్నీ బ్యాగ్‌లో తెస్తున్నారా?'
'అన్నీ కాదు. ఒకటే.'..'ఏంటది?'
'అడల్ట్ డైపర్స్.'
శ్రీ ఊహ