May 21,2023 15:56

ప్రజాశక్తి-నరసరావుపేట : గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని పుస్తక పఠనం ద్వారా జ్ఞాన సంపదతో పాటు మానసికాభివృద్ది సొంతం చేసుకోవచ్చని పూర్వీకులు ఏనాడో విశ్వసించారని పిల్లలు పెద్దలు ఇలా ప్రతి ఒక్కరూ  పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి అన్నారు. స్థానిక పల్నాడు రోడ్డులోని శాఖ  గ్రంధాలయాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ సందర్శించి  గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజ్ఞానం పెంపొందాలంటే చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలను చదవాలన్నారు.పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు అయినప్పటికి అన్ని రకాల పుస్తకాలను సేకరించడం అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిన నేపథ్యంలో దీనికి పరిష్కారమే గ్రంథాలయాలు అని పేర్కొన్నారు. విద్యా, విజ్ఞానం, మహనీయులు రచించిన గాధలు, పిల్లల కోసం బాలల పుస్తకాలను అందరికీ అందుబాటులో ఉంచాలని గ్రంథాలయ శాఖ సిబ్బందికి సూచించారు. వేసవిలో చిన్నపిల్లల పుస్తక పఠనం పై ఎక్కువ మక్కువ ఉండేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గ్రంధాలయం మొత్తాన్ని తిరిగి అందుబాటులో ఉన్న పలు పుస్తకాలను జిల్లా కలెక్టర్ చదివారు. వేసవిలో పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడి చదివే పుస్తకాల తో పాటు వారికి ఇష్టమైన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శాఖా గ్రంధాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.