న్యూఢిల్లీ: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా - కెనడా దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదానికి కారణమైంది. ఈ వివాదంలో కెనడాకు మద్దతుగా అమెరికా, బ్రిటన్ నిలిచాయి. దౌత్య సమానత్వం కోసం కెనడాకు సంబంధించిన 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని ఇండియా కోరింది. ఈ నెల 10 వరకు డెడ్ లైన్ విధించింది. లేకపోతే వారికి దౌత్యవేత్తలకు ఇస్తున్న రక్షణలను తొలగిస్తామని తెలిపింది. ఇరు పక్షాల చర్చల కారణంగా ఇది ఈ నెల 20 గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను ఇండియా నుంచి తిరిగి రప్పించుకుంది. భారత్ వియన్నా కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తుందని కెనడా విమర్శించింది. దౌత్య సమానత్వాన్ని కోరుకోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా చెప్పుకోవద్దని భారత్ కెనడాకు సూచించింది. ప్రస్తుతం భారత్, కెనడాల్లో ఇరు వైపుల 21 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కెనడాకు అమెరికా, బ్రిటన్ దేశాలు వత్తాసు పలికాయి. వియన్నా ఒప్పంద సూత్రాలను, దౌత్యసంబంధాలపై భారత్ తన బాధ్యతలను నిర్వర్తించాలని తాము ఆశిస్తున్నట్లు అమెరికా వ్యాఖ్యానించింది. మరోవైపు యుకె కూడా కెనడాకు మద్దతు ప్రకటించింది. ''భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలనే భారత నిర్ణయాన్ని మేం అంగీకరించలేము. దౌత్యపరమైన రక్షణలను ఏకపక్షంగా ఎత్తివేయడం, వియన్నా ఒప్పందానికి అనుగుణంగా లేదు'' అంటూ బ్రిటన్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.