ప్రజాశక్తి - నిమ్మనపల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) ను పారిశుధ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. పాఠశాల చుట్టుప్రక్కల ఉన్న నివాశస్థుల నిర్లక్ష్యంగా మురుగునీరును పాఠశాల అవరణంలోకి వదులుతూ 63 మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కమిటీ సభ్యులు నివాశస్థులను హెచ్చరించినా వారి మాటలను లెక్కచేయకపోవడం గమనార్హం. దీనితో చేసేదేమిలేక మీడియాను ఆశ్రయించామని ప్రధానోపాధ్యాయురాలు అపర్ణాదేవి తెలిపారు. వివరాలలోకి వెళితే పాఠశాల ప్రహరిగోడకు అనుకోని ఉన్న అభు హానిఫా మసీదు రూముల నుండి, మరో వైపు నివాశస్థుల ఇళ్ల మరుగుదొడ్లు నుండి మురుగు నీరును పాఠశాలలోకి వదులుతున్నారు. మరోవైపు ఆలీ భారు అనే గుజీరి సామానులు వ్యాపారస్తులు పాఠశాల ఆవరణంలో గుజీరి సామానులను వేస్తూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మురుగునీరు చేరడం వలన దుర్గంధంతో దోమలు, ఈగలు ప్రభలుతున్నాయన్నారు. దీంతో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఉర్దూ పాఠశాల విద్యార్థులకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని హెచ్.ఎం అపర్ణాదేవి కోరుతున్నారు.










