- రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ కలీమ్
ప్రజాశక్తి-కలికిరి (అన్నమయ్య) : ఉర్దూ భాష అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ కలీం తెలిపారు. బుధవారం స్థానిక ఉర్దూ అకాడమీ కంప్యూటర్ శిక్షణ కేంద్రం, గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఉర్దూ భాషాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ఉర్దూ అకాడమీతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఓయు కుదుర్చుకుందన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ, నైపుణ్య అభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, విద్యార్థులు, యువత ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఉర్దూ అకాడమీ సిబ్బంది శ్రద్ధ తీసుకోవాలన్నారు. కంప్యూటర్ ఉచిత శిక్షణ కార్యక్రమ లక్ష్యాలను సాధించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రతి బ్యాచ్ కు 30 మంది తగ్గకుండా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం పట్ల అలసత్వం వహించరాదని, ముఖ్యంగా సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఖాన్ ఖలీల్ సాహెబ్ , సీటీసీ ఇంచార్జ్ నాజియా, గ్రంథాలయాధికారి జావీద్ హుస్సేన్, సిబ్బంది షాజహాన్, ఉమర్ పాల్గొన్నారు.










