ప్రజాశక్తి- తుగ్గలి : జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వము ఘోరంగా విఫలం అయిందని వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ అధ్యక్షులు శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగరాజు అన్నారు. సోమవారం తుగ్గలి,మారెళ్ల గ్రామంలో జరుగుచున్న పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి పథకంలో కూలీలకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఎండ వేడిమికి తాళలేక చెట్లు కింద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ కూలీలకు సరైన వసతులు సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. కేవలం గ్రామాలలో పనులు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పూను కుందన్నారు. ఇప్పటికీ గ్రామాలలో పనులను పూర్తిగా తగ్గించిందన్నారు. ఇలాగే కొనసాగితే గ్రామాలలో కూలీలు వలసలు వెళ్లిపోవడానికి ఆస్కారం ఉందన్నారు. పై సమస్యలపై ఈనెల 22న కర్నూల్ కలెక్టరేట్ దగ్గర చేస్తున్నధర్నాకు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.










