May 18,2023 14:07

ప్రజాశక్తి-కోసిగి రూరల్ : ఉపాధి హామీ పథకం రక్షణకై ఈనెల 22వ తేదీన కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో కోసిగి మండలంలోని ఉపాధి కూలీలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోసిగి మండల ప్రజాసంఘాల (రైతు సంఘం, సిఐటియు) నాయకులు  రాముడు, వీరేష్ కోరారు. గురువారం మండలంలోని దొడ్డి బేళగల్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి, ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని క్రమంగా ఎత్తివేయడానికి కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించిందని వారు అన్నారు. ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే పేదలు తిరగబడతారని ఉద్దేశంతో ఈ పథకానికి అనేక షరతులు పెట్టి ఉపాధి కూలీలను ఇబ్బందులకు గురి చేసిందని వారు అన్నారు. గతంలో సమ్మర్ అలవెన్స్ ఇచ్చే వారిని ఇప్పుడు వాటిని రద్దు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా మంచినీళ్లకు, గడ్డపారకు, తట్ట పదునకు ఇచ్చే డబ్బులు కూడా నిలిపివేశారని ఆన్లైన్ మాస్టర్ పెట్టి పేదలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు అన్నారు. ఆన్లైన్ మాస్టారు విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలని, అదేవిధంగా పేస్లిప్ లు ఇవ్వాలని 100 రోజుల పూర్తయిన ప్రతి కుటుంబానికిఅదనంగా పనులు కల్పించాలని, రోజు వేతనం 600 ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడానికి ఈనెల 22వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద  జరుగు ధర్నాలో ఉపాధి కూలీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.