Sep 11,2022 12:39

ఒక్కోసారంతే..
సీతాకోకచిలుకలు కొన్ని
రంగుల రెక్కలార్చుకుంటూ
గుంపుగా వచ్చి పెరట్లో వాలుతాయి
సుగంధ ద్రవ్యాలు ఏవో
మనసు మైదానంలో వెదజల్లబడి
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి

ఒక మృదు స్పర్శ
మెల్లగా చెంతచేరి
గుసగుసలు పోతుంది
పాదాల కింద నలిగే గడ్డిపూవు కూడా
గమ్మత్తుగా స్ఫురిస్తుంది
పగిలిన గుండె ముక్కలు
అతుక్కుని పురావైభవం
ప్రాప్తించినట్లే ఉంటుంది
అనూహ్యంగా సాగి వచ్చిన
ఓ కడలి కెరటం
హృదయాన్ని మెత్తగా నిమిరి
వెనుదిరిగి పోతుంది

అయితే కల కరిగి
కళ్లు విప్పాక కానీ తెలియదు
జీవితం ..
అనాలోచితంగా రాసే
ఉత్తరం లాంటిదని
ఎందుకో ఎక్కడో మొదలు పెట్టి..
ఏదేదో రాసేసుకొని
అలసటతో..అసంతృప్తితో
ముగిసిపోతుందని

సునీత గంగవరపు
94940 84576