
తమ విధానాలను గురించి విమర్శనాత్మకంగా వ్యవహరించే వ్యక్తులు, సంస్థల గొంతు నొక్కేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నించడం దారుణం. దేశ రాజధానిలోని స్వతంత్ర మేథోసంస్థ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సిపిఆర్), ప్రముఖ ఎన్‌జిఒ ఆక్స్‌ఫామ్, బెంగళూరులోని ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండేషన్ (ఐపిఎస్‌ఎంఎఫ్), మరికొన్ని సంస్థలపైనా బుధవారంనాడు ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించడం బెదిరింపు చర్యలే ! విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) ఉల్లంఘిస్తున్నారన్న కోణంలో ఈ దాడులు నిర్వహించడం ఆయా సంస్థలను భయభ్రాంతులకు గురి చేయడమే. ఇలాంటి అభియోగాలపైనే గతంలో ఎన్‌డిటివి, న్యూస్‌క్లిక్ తదితర మీడియా సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి ఇప్పటికీ వారిని వేధిస్తున్నాయి. మరోవైపున అదానీ గ్రూప్ దొంగతనంగా దొడ్డిదారిన ఎన్‌డిటివిని హస్తగతం చేసుకోవడానికి యత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలనూ, మతతత్వ విద్వేష ఎజెండా లోగుట్టును వెల్లడించే మీడియా సంస్థల, ప్రతినిధుల గొంతు నులిమే యత్నాలే ఇవన్నీ. ఏకకాలంలో ఒక పథకం ప్రకారమే చేస్తున్నారు.
ప్రభుత్వ విధానాలపై విశ్లేషణ, విధానాల పర్యవసానాలు, ప్రజలపై ప్రభావం వంటివాటి కోసం సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్ (సిపిఆర్) ఒక స్వచ్ఛంద సంస్థగా 1973లో ప్రారంభించబడింది. తన స్థాపిత లక్ష్యాల సాధన కోసం పని చేస్తున్న సంస్థల్లో ఇది ఒకటి. గతంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలనుండి తెచ్చిన అప్పులు, వాటి పర్యవసానాలు, డబ్ల్యుటిఓ ఒప్పందాలతో భారత్‌పై ప్రభావం తదితర విషయాలపై విమర్శనాత్మక విశ్లేషణలు, ప్రముఖుల ఉపన్యాసాలు వంటివి చేపట్టింది. అదే సమయంలో విపరీతంగా పెరుగుతున్న పట్టణీకరణ, వాతావరణ మార్పుల ముప్పు లాంటి అంశాలపైనా ఈ సంస్థ మేధో కృషి చేస్తోంది. ప్రభుత్వ విధానాలపై నిరపేక్షంగానూ వస్తుగత సమాచారంతోనూ చాలా విశ్లేషణలు వెలువరిస్తుంది. అలాంటివి ప్రజాదరణ పొందడం సహజం. బహుశా అందుకే కేంద్ర సర్కారుకు కంటగింపుగా ఉంది. జెఎన్‌యు ప్రొఫెసర్ మీనాక్షి గోపీనాథ్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అలాగే బెంగళూరు కేంద్రంగావున్న ఐపిఎస్‌ఎంఎఫ్ ఒక ధార్మిక సంస్థ (పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్). ప్రజా ప్రయోజన సమాచారాన్ని అందించే మీడియా సంస్థలకు, ప్రతినిధులకు గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం చేస్తుంది. ది వైర్, ది ప్రింట్, ఆల్ట్ న్యూస్, ది లైవ్‌లా వంటివాటికి ఆర్థిక తోడ్పాటునిస్తోంది. ప్రఖ్యాత సంపాదకుడు టిఎన్ నినాన్ ఈ ట్రస్టు అద్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రయోజన సమాచారాన్నిచ్చే మీడియాకు ఆర్థిక చేయూతనివ్వడమే లక్ష్యంగా నిర్ణయించుకున్న ఐపిఎస్‌ఎంఎఫ్ అందుకనుగుణంగానే పని చేయడం ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఈ దాడులు! ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్‌ఫాం సంస్థ పేదరికం, ఆదాయ అంతరాలు, పౌష్టికాహార లభ్యత వంటి అంశాలపై సాగిస్తున్న పరిశోధన, వాటి ప్రాతిపదికన వెల్లడించే నివేదికల గురించి అందరికీ తెలిసిందే. వారిపైనా మోడీ సర్కారు కత్తిగట్టినట్టుంది.
ప్రజానుకూల సమాచారాన్ని అందించడం మీడియా బాధ్యత. కాని, ప్రస్తుతమున్న కార్పొరేట్ మతతత్వ కూటమి ప్రభుత్వానికి అది కంటగింపుగా ఉంది. అలాంటి గళాల్ని నొక్కేయాలన్నదే వారి ఏకైక లక్ష్యంగా ఉంది. ప్రతిపక్ష పార్టీలను, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా వాడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తమకు గిట్టని మీడియా పైనా వాటిని ప్రయోగించడం తగని పని. ఒకే దేశం, ఒకే భాష, ఒకే పన్ను, ఒకే మతం, ఒకే ఎన్నికలు, ఒకే నాయకుడు.... ఇలాంటి ఏకీకృత వ్యవస్థ వైపు నడపాలన్నది వారి కోరిక. కాని, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో వారి ఆటలు సాగనివ్వరాదు. రాజ్యాంగానికి నాలుగో మూల స్తంభంగా భావించే మీడియాపై అదీ ప్రజానుకూల సంస్థలపై దాడిని ప్రజాస్వామ్య శక్తులు నిరసించాలి, ప్రతిఘటించాలి. సర్కారు దుర్నీతిని సాగనివ్వరాదు.