దేశంలో ఇటీవలి కాలంలో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు, ఆదేశాలు, నిరాకరణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సుప్రీంకోర్టు లోనే కోర్టు ధిక్కార కేసులు పెడుతున్నా విమర్శలు ఆగడం లేదు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లోనైతే హైకోర్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా లేఖ రాసేంత వివాద పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదంపై ఆయన భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ జాతీయంగానే దుమారం రేపింది. దాని పట్ల అనుసరించాల్సిన వైఖరి పైనా భిన్నాభిప్రాయాలు ఘర్షణ పడుతున్నాయి. అమరావతి రాజధాని తరలింపుతో సహా అనేక కేసులపై విచారణ సాగుతూనే వుంది. ఈ సందర్భంలో వస్తున్న తీర్పులు, కోర్టుల ఆదేశాలు ఆసక్తి రేపడమే గాక రాజకీయ పరిణామాలను రాజ్యాంగ వ్యవస్థలను కూడా చర్చకు పెడుతున్నాయి. పైగా మీడియాలో వాటి గురించి విరుద్ధ వార్తలు, వ్యాఖ్యలు వస్తున్నాయి గనక వాటి వివరాలు తెలుసుకోవడం తప్పనిసరి
మీడియా గొంతు నొక్కిన ఆదేశాలపై స్టే
అమరావతి రాజధాని ప్రాంతంలో ఎ.పి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ జరిపిన భూ లావాదేవీలపై ఎసిబి దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ను మీడియాలో గాని, సోషల్ మీడియాలో గాని ప్రచురించరాదంటూ హైకోర్టు సెప్టెంబరు 15న ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు నవంబరు 25వ తేదీన స్టే విధించింది. తద్వారా వాటి ప్రచురణకూ, ప్రజలు నిజానిజాలు తెలుసుకోవడానికీ అవకాశం కల్పించిందని చెప్పాలి. అదే సమయంలో ఆ కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే కేసును 2021 జనవరి వరకూ వాయిదా వేస్తూ ఆలోగా దమ్మాలపాటి పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆదేశించింది. ఆరోపణల ఎఫ్‌ఐఆర్ ప్రచురణకు అవకాశమివ్వడం ద్వారానూ, తదుపరి విచారణ కొనసాగకుండా నియంత్రించడం ద్వారానూ సుప్రీంకోర్టు చొరవ తన చేతి లోకి తీసుకున్నట్టయింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.కె.మహేశ్వరి అప్పటికప్పుడు స్టే ఇచ్చారే గాని కేసు సమగ్ర విచారణ జరగవలసే వుంది. కనుక హైకోర్టు కూడా ఇంకా అసలు కేసును తీసుకోలేదు.
ఈ తీర్పును ప్రభుత్వానికి చుక్కెదురుగా కొన్ని మీడియా సంస్థలు చెప్పడం వాస్తవ విరుద్ధం. మీడియా లోనూ విమర్శకుల లోనూ రాజకీయ పార్టీలూ న్యాయ వర్గాల లోనూ ఎక్కువ నిరసన వచ్చింది కోర్టు ముందుకు వచ్చిన అంశాల ప్రచురణ కాకుండా ఆంక్షలు విధించడం పైనే. దాన్ని కొట్టివేయడం కీలకమైన అంశం. ఈ ఆరోపణలు, దర్యాప్తు, ఎఫ్‌ఐఆర్ దురుద్దేశపూరితమని దమ్మాలపాటి తదితరుల తరపున ముకుల్ రోహ్తగి, హరీశ్ సాల్వే చేసిన ఆరోపణలను ప్రభుత్వ తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ గట్టిగానే ఎదుర్కొన్నారు. మాజీ అడ్వకేట్ జనరల్ అయినంత మాత్రాన నిబంధనలు మారవని, తప్పు జరిగినట్టు దృష్టికి వచ్చాక ప్రభుత్వం దర్యాపు జరపకుండా ఎలా వుంటుందని ప్రశ్నించారు. స్టే ఎత్తివేతకై హైకోర్టును ఆశ్రయించకపోవడం పొరబాటని ప్రతివాద లాయర్లు అన్నప్పుడు ఇంత దారుణమైన ఉత్తర్వునిచ్చిన తర్వాత న్యాయం ఎలా ఆశించగలమని ఆయన ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తి ఆ రోజు సాయంత్రమే విచారించి స్టే ఇవ్వడం చూస్తే ఏవో బాహ్య శక్తుల ప్రభావం కనిపిస్తుందని, అయితే తాము హైకోర్టుకు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదని అన్నారు. ఎ.పి లో ప్రస్తుతం సాగుతున్న న్యాయ రాజకీయ వివాదం నేపథ్యంలో సుప్రీం స్టే, కేసు విచారణకు వ్యవధి తీసుకోవడంలో చాలా లోతైన ప్రభావం వుంటుంది. మొదటిది ఎఫ్‌ఐఆర్‌ను ప్రచురించినప్పుడు అందులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి కుటుంబ సబ్యుల పేర్లు కూడా వుంటాయి. ఒకసారి ఆ వార్తలు ప్రచురణ అయ్యాక ముఖ్యమంత్రి జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డే కు రాసిన లేఖలో వాటిని పేర్కొనడం తప్పన్న వాదన పదును కోల్పోతుంది. హైకోర్టు ఆపడం వల్ల వాటి గోప్యత లభించిందిగాని లేకపోతే ఆయన బహిరంగ విషయాలే రాశారని చెప్పడానికి వీలుంటుంది. ముఖ్యమంత్రి లేఖతో ఆ గోప్యత ఇప్పటికే లేకుండా పోయింది గనక సుప్రీం కోర్టు నిషేధం ఎత్తివేసిందని కొందరు చేస్తున్నది తలకిందులు తర్కమే. జాతీయ మీడియాతో పాటు 'ప్రజాశక్తి' కూడా అప్పుడే ఎఫ్‌ఐఆర్ వివరాలు ప్రస్తావించిన సంగతి పాఠకులకు తెలుసు. సుప్రీం కోర్టు స్టే తర్వాత 'టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వంటి పత్రికలు ఎఫ్‌ఐఆర్ వివరంగా ఇచ్చాయి. హైకోర్టు ఆంక్షల పేరిట అప్పుడు వేయని పత్రికలు ఇప్పుడూ ఈ స్టేను ఉపయోగించుకుని వాటిని ప్రచురించే ప్రయత్నం చేయలేదు.
అర్నబ్ కు బెయిలులో ద్వంద్వనీతి
రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామికి ఆగమేఘాల మీద బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడం మరో విమర్శకు దారితీసింది. 2018లో ఆత్మహత్య చేసుకున్న అన్వరు నాయక్ అనే డిజైనర్ ఆత్మహత్య నోట్‌లో అర్నబ్ గోస్వామి పేరున్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు ఆయనను ఆరెస్టు చేశారు. ముంబాయి హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బిజెపి కి అనుకూలంగా రిపబ్లిక్ టీవీ లో మత విద్వేషం పెంచే ప్రసారాలు చేయడం, చర్చలు పెట్టడం, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యను ఇతరుల కారణంగా జరిగిందంటూ సిబిఐ దాకా తీసుకువెళ్లడం ఇవన్నీ విమర్శకు గురైనాయి. తర్వాత టిఆర్‌పి కుంభకోణంలోనూ రిపబ్లిక్ టీవీ సిబ్బందిని విచారించారు. ఇవన్నీ అయ్యాక ఈ కేసులో అరెస్టు చేశారు. ఇది కక్ష సాధింపు అని అర్నబ్ బృందం ఆరోపించడమే గాక అమిత్ షాతో సహా బిజెపి హేమాహేమీలు మాత్రం ఇప్పుడే ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛకు హాని అని ఖండించారు. గతంలో చాలామంది జర్నలిస్టులను ఘోర నిర్బంధానికి గురి చేసిన సంగతేంటనే ప్రశ్న ఎదురైంది. కాని సుప్రీం కోర్టు మాత్రం వేగంగా స్పందించి స్వల్ప వ్యవధి లోనే అర్నబ్‌కు బెయిల్ ఉత్తర్వులిచ్చింది. అంతేగాక హైకోర్టు తన బాధ్యత నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మేము ఈ చర్య తీసుకోకపోతే వ్యక్తి స్వాతంత్య్రాన్ని కాపాడినట్టే కాదని తీవ్రంగా వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంలో ప్రతివాదుల తరపున న్యాయవాదులు హత్రాస్‌లో అన్యాయంగా అరెస్టు చేసిన కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ గురించి వరవరరావు వంటి వారి విషయం గురించి ప్రస్తావిస్తే స్పందన లేకపోయింది. 'అర్నబ్ కు బెయిల్ ఇవ్వండి గాని...మిగిలిన వారిని గురించి కూడా ఇలాగే స్పందించకపోవడం ద్వంద్వనీతి' అని అనేక మంది బహిరంగంగానే విమర్శించారు. తర్వాత దశలో నిజంగానే వారి కేసులు మళ్లీ కోర్టు ముందుకు వచ్చాయి. అయితే ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డే నాయకత్వం లోని ధర్మాసనం వాటిని పరిగణన లోకి తీసుకోకపోగా హైకోర్టుకే తిప్పి పంపించింది. మేము 32వ అధికరణం కోసం వచ్చే ధోరణిని నిరుత్సాహపర్చ దల్చుకున్నామని బాబ్డే వ్యాఖ్యానించారు కూడా (రాజ్యాంగం 32వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు, 226 ప్రకారం హైకోర్టు రాజ్యాంగ న్యాయస్ధానాలుగా వుంటాయి). అందుకు తగినట్టే తర్వాత వరవరరావు, కప్పన్ కేసులు వచ్చినపుడు సుప్రీం కోర్టు వాటిని హైకోర్టుకే తరలించింది. అర్నబ్ కేసులో జస్టిస్ చంద్రచూడ్ చేసిన గంభీర వ్యాఖ్యలను ఈ విధంగా బాబ్డే పూర్వపక్షం చేసినట్టయింది. అయితే ఆ సమయంలో పూర్తి తీర్పు పాఠం రాకపోవడంతో తర్వాత ఏమైనా వివరణ వుంటుందని విమర్శకులతో పాటు మాజీ న్యాయమూర్తి ఎ.పి షా వంటి వారు కూడా నిరీక్షిస్తున్నట్టు ప్రకటించారు. తీరా ఇప్పుడు పూర్తి పాఠంలో కూడా సాధారణ సూత్రాలు పునరుద్ఘాటించడం తప్ప ఈ ద్వంద్వ వైఖరికి వివరణ లేదు, బెయిలు ఇవ్వడమే సాధారణ నిబంధన, జైలులో వుంచడం మినహాయింపుగా వుండాలని జస్టిస్ క్రిష్టయ్యర్ చెప్పిన ప్రసిద్ధ వాక్యాలను పునరుల్లేఖించారు. కింది కోర్టులు, హైకోర్టులు వాటిని దృష్టిలో వుంచుకుని వెనువెంటనే ఉపశమన చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్నీ చెప్పారు గాని వరవరరావు వంటి వారికి బెయిలు ఇప్పించింది లేదు. హైకోర్టు కూడా పదే పదే విచారించిన మీదట ఆయనను నానావతి ఆస్పత్రిలో చేర్చవలసిందిగా చెప్పిందే గాని ఆ వయో వృద్ధ అనారోగ్య పీడిత రచయితకు బెయిల్ ఇవ్వలేదు. జర్నలిస్టు కప్పన్‌కు విడుదల లేకపోగా యు.పి ప్రభుత్వం కుట్ర ఆరోపణలు మళ్లీ చేసింది. అంటే విమర్శలు మిన్ను ముట్టిన తర్వాత కూడా అత్యున్నత న్యాయవ్యవస్థ తన ద్వంద్వ వైఖరిని మార్చుకోవడానికి సిద్ధంగా లేదని తేలిపోయింది. శబరిమల, అయోధ్య వంటి తీర్పుల లోనూ, కాశ్మీర్ 370 రద్దు వంటి వాటిపై విచారణకు జాప్యం లోనూ వలస కార్మికులు విషయం లోనూ, కార్మికుల హక్కులను కోత కోయడం లోనూ, ఇఎంఐ వడ్డీల పట్ల కార్పొరేట్ బకాయిల పట్ల తీసుకున్న ద్వంద్వ విధానాల లోనూ కూడా ఈ సత్యం అవగతమైంది. పైగా ఈ సమయం లోనే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొన్ని మంచి తీర్పులను కూడా తప్పు పడుతూ మాట్లాడితే మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోర్టులను ప్రశ్నించడమే తప్పన్నట్టు వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థను మరీ ముఖ్యంగా సుప్రీం కోర్టును ఒత్తిడికి గురి చేసే మోడీ ప్రభుత్వ వైఖరి పర్యవసానాలుగా వీటిని చూడవలసి వుంటుంది. సుప్రీం కోర్టు అంతకంతకూ ఎగ్జిక్యూటివ్ కోర్టుగా మారిపోతున్నదని మాజీ న్యాయమూర్తి షా చేసిన వ్యాఖ్య ఇందుకు నిదర్శనం.
హైకోర్టులో అమరావతి
ఈ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఉత్కంఠ భరితమైన కేసులు నడుస్తున్నాయి. ఎసిబి మాజీ చీఫ్ ఎ.బి.వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు ఎత్తివేసింది. గతంలో ఆస్పత్రి అగ్ని ప్రమాదం కేసులో ఇచ్చిన ఆదేశాలను మార్చుకుని హైకోర్టు డా|| పి.రమేష్‌బాబు కస్టోడియల్ విచారణకు అనుమతినిచ్చింది. వివిధ సందర్భాలలో పోలీసులపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే కోర్టులను, న్యాయమూర్తులను కించపర్చేలా పోస్టులు పెట్టిన వారిపై తన ఆదేశం ప్రకారం సిబిఐ 16 కేసులు నమోదు చేసి నివేదికను సమర్పించగా విచారణ మరో రెండు మాసాలు వాయిదా వేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యం జరిగిందేమో విచారిస్తామని కూడా ఒక సందర్భంలో జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఫిర్యాదులు, స్థానిక ఎన్నికల నిర్వహణ సమస్యలు వంటివి కూడా విచారణలో వున్నాయి. అయితే వీటన్నిటిని మించి అమరావతి రాజధాని వికేంద్రీకరణ పేరిట విశాఖకు తరలింపుపై దాఖలైన వందలాది పిటిషన్ల రోజువారి విచారణ ఆసక్తికరంగా సాగుతున్నది. అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత, భూములిచ్చిన రైతులతో కుదర్చుకున్న ఒప్పందాన్ని, విశ్వాసాన్ని ఉల్లంఘిస్తూ తరలించడమేమిటని కోర్టు ప్రశ్నిస్తున్నది. రాజ్యాంగంలో గాని, విభజన చట్టంలో గాని ఈ అంశం వుందా? అమరావతిని నిర్ణయించిన శాసనసభకు మార్చే అధికారం కూడా వుంటుంది కదా వంటి ప్రస్తావనలు వచ్చాయి. కాగా మూడు రాజధానులకు రాజ్యాంగంలో అవకాశమే లేదని వాదనలు వినిపించాయి. ప్రభుత్వం తన విధానాన్ని సమర్ధించుకుంటున్నది. ఏతావాతా హైకోర్టు ప్రశ్నల ధోరణి రాజధాని మార్పుకు వ్యతిరేకంగా వుందనే భావం పెరుగుతున్నది.
- తెలకపల్లి రవి, వ్యాసకర్త











