గత ఏడాది చలికాలంలో ఉల్లి ధరలు కొన్ని చోట్ల కిలో రూ.160 నుంచి 180 వరకు పలికాయి. తిరిగి ఈ ఏడాది అదే పునరావృతం కానుందా? ధరల పెరుగుదల తీరు అదే ధోరణిలో ఉంది. ఉల్లి ధరల గురించి గత ఏడాది డిసెంబరులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల మీద పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సభ్యురాలు సుప్రియా సూలే పెరిగిన ఉల్లి ధరల గురించి ఒక ప్రశ్న అడిగారు. సమాధానం పూర్తయిన తరువాత ఒక సభ్యుడు 'మీరు ఈజిప్షియన్ ఉల్లిపాయలు తింటారా?' అని అడిగారు. దానికి ఆమె 'నేను పెద్దగా ఉల్లి, వెల్లుల్లి తినను కనుక మీరు ఆందోళన చెందవద్దు. నేను పెద్దగా ఉల్లి, వెల్లుల్లి తినని కుటుంబం నుంచి వచ్చాను' అని చెప్పారు. ఈ మాటలను వేరే విధంగా వక్రీకరించారని బిజెపి ఉడుక్కుంది. నేను పెద్దగా తినను గనుక ధరలు పెరుగుతాయని మీరు ఆందోళన పడవద్దు అన్న అర్ధం ఆమె మాటల్లో స్ఫురించింది. ఇప్పుడు మరోసారి ఉల్లి ధరల సమస్య ముందుకు వచ్చింది. తమిళనాడులో కిలో ధర రూ. 120 నుంచి రూ. 130 వరకు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ సగటున ఉల్లి ధర దేశంలో కిలో రూ. 55.60 ఉన్నదని, ఢిల్లీలో రూ.50 ఉన్నట్లు ప్రకటించింది. అదెంత వరకు వాస్తవమో వినియోగదారులకు తెలుసు కనుక వారికే వదలి వేద్దాం. ఉల్లి నాణ్యతను బట్టి ధరలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కిలో ఉల్లి కొంటే సగం పనికిరాని వాటి గురించి చెబుతున్నదేమో తెలియదు.
గత ఏడాది అక్టోబరు 20వ తేదీన ఉల్లి ధరలతో పోలిస్తే అదే రోజున ఈ ఏడాది 12.61 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన నిత్యావసర వస్తువుల చట్టం చెప్పినదాన్ని బట్టి ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నది ప్రభుత్వ ప్రకటన సారంగా చెప్పుకోవాలి. ఉల్లి, పప్పుధాన్యాలు, ఖాద్య తైలాలు, నూనె గింజలు, తృణధాన్యాలు, బంగాళాదుంపల నిల్వలకు సంబంధించి ఎలాంటి పరిమితులు ఉండవు, ఎన్నయినా చేసుకోవచ్చని తాజా చట్ట సవరణ తెలిపింది. అయితే మరి నియంత్రణ ఎప్పుడు అంటే నిల్వ ఉండని తోట పంటల ఉత్పత్తుల (ఉల్లి, బంగాళాదుంప) ధరలు వంద శాతం, ఇతర నిల్వ ఉండే ఆహార వస్తువుల ధరలు యాభై శాతం పెరిగినపుడు మాత్రమే ప్రభుత్వాలు నియంత్రణలను అమల్లోకి తెస్తాయి. మరి ఈ పెరుగుదలను ఎలా లెక్కిస్తారు. గత పన్నెండు నెలలు లేదా గత ఐదు సంవత్సరాల సగటు ధరలను తీసుకొని వాటిలో ఏవి తక్కువగా ఉంటే వాటితో ఇప్పుడు మార్కెట్లో ఉన్న ధరలతో పోల్చి ధరల పెరుగుదల ఎంత ఉందో నిర్ణయించి దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు. ఉల్లి ధరలు గత పన్నెండు నెలల్లో కిలో సగటున రూ.40, ఐదేళ్ల సగటు రూ.35 అనుకుందాం. తక్కువ రూ. 35 కనుక వంద శాతం అంటే రూ. 70 దాటినపుడు మాత్రమే ప్రభుత్వం నిల్వల మీద నియంత్రణలు విధిస్తుంది. గత ఏడాది రూ. 40 నుంచి ఇప్పుడు రూ. 65కు పెరిగినా ప్రభుత్వాలు కదలాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం పైన చెప్పిన విధంగా గత ఏడాదితో పోలిస్తే పెరుగుదల 12.61 శాతమే గనుక...గత ఐదేళ్ల సగటు ఇంకా తక్కువ ఉంటుంది గనుక...ఇప్పట్లో ఉల్లి ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలూ తీసుకోదన్నది స్పష్టం. ఈ లెక్కలు వ్యాపారుల జేబులు నింపటానికా? వినియోగదారుల పర్సులను కొల్లగొట్టటానికా ?
మన దేశంలో ఉల్లి ఏడాదికి మూడు పంటలు పండుతుంది. వేసవి పంట ఏప్రిల్‌లో, ఖరీఫ్ తొలి పంట సెప్టెంబరు, ఖరీఫ్ రెండవ పంట నవంబరు తరువాత మార్కెట్‌కు వస్తుంది. వర్షాలు, వాటితో వచ్చే తెగుళ్ల కారణంగా కొంత పంట నష్టం జరిగిందని, పది శాతం ఉల్లి విత్తనాల కొరత, రబీ పంటలో నిల్వ చేసినదానిలో 35 శాతం పాడైపోవటం ప్రస్తుత ఉల్లి ధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. ఉల్లి వ్యాపారం మొత్తం ప్రయివేటు వ్యాపారుల చేతుల్లోనే ఉంది. గత ఏడాది ధరలు పెరిగి సొమ్ము చేసుకున్న వ్యాపారులు మూడో వంతు పంట పాడైపోయే అసమర్ధంగా నిల్వలు చేసుకుంటారంటే నమ్మేదెలా? వీటి కంటే అసలు కారణం ఈ ఏడాది జూన్‌లోనే ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిల్వలపై నియంత్రణలు ఎత్తివేసిన వాటి జాబితాలో ఉల్లి ఉండటం, రాబోయే రోజుల్లో కొరత ఏర్పడనుందని వ్యాపారులు ఊహించటం లేదా కృత్రిమ కొరత సృష్టించటం అన్నది స్పష్టం.
కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నుంచి ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ అక్టోబరు 18 వరకు గత ఏడాది కంటే తక్కువే ఉన్నాయి. గతేడాది దేశవ్యాపిత సగటు ధర కిలో రూ.46.33 కాగా పది రోజుల్లో కిలోకు రూ.11.56 పెరిగి చిల్లర ధర 51.95కు పెరిగింది(ట). ముందస్తు చర్యగా సెప్టెంబరు 14న కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిల్వ చేసిన ఉల్లిని విడుదల చేస్తున్నది. రాబోయే రోజుల్లో మరింతగా విడుదల ఉంటుంది. డిసెంబరు 15 వరకు దిగుమతులను సులభతరం చేస్తూ 2003 నాటి ఉత్తరువులను కేంద్ర ప్రభుత్వం సడలించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే సరకుతో వచ్చే తెగులు, ఇతర వాటి నివారణకు దిగుమతి చేసుకొనే ఉల్లిని శుభ్రం చేసేందుకు అవసరమైన చర్యలను... ఓడలకు ఎక్కించే చోట గాకుండా మన దేశంలో దిగుమతి చేసే చోట చేపట్టేందుకు కూడా సవరణలు చేసింది. ఇది సక్రమంగా జరగకపోతే కొత్త సమస్యలు తలెత్తవచ్చు.
ప్రపంచంలో ఉల్లి సాగు విస్తీర్ణం మన దేశంలో ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుబడి ఎక్కువ కారణంగా చైనాలో తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ ఉత్పత్తి చేస్తూ మొదటి స్ధానం ఆక్రమించింది. మూడవ స్ధానంలో ఒక ఏడాది అమెరికా ఉంటే మరో ఏడాది ఈజిప్టు ఉంటోంది. భారత్, చైనా రెండూ కూడా సాధారణ పరిస్ధితిలో అవసరానికి మించి ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి. మనం పది శాతం ఎగుమతులు చేస్తున్నాము. ధరలు పెరిగినపుడు నిషేధిస్తున్నాము. విధానాల మీద చర్చను వెనక్కు నెట్టే క్రమంలో అనేక అంశాలను రాజకీయ పార్టీలు ముందుకు తెచ్చాయి. గత నాలుగు దశాబ్దాలుగా తరచూ ఉల్లి రాజకీయాలు ముందుకు వస్తున్నాయి. 1980 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ నేత ఇందిరా గాంధీ ఉల్లిని ఎన్నికల సమస్యగా ముందుకు తెచ్చారు. తరువాత కూడా ఎన్నికల సమయంలోనూ తరువాత ప్రతిపక్షాల అస్త్రంగా మారింది.1998లో ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఉల్లి ధరల కారణంగానే ఓడిపోయిందని విశ్లేషించారు. తరువాత కాలంలో ఎవరు అధికారంలో ఉన్నా సత్పరిపాలనకు ఉల్లి ధరలు ఒక గీటురాయిగా మారాయంటే అతిశయోక్తి కాదు. 2015లో కేంద్ర ప్రభుత్వం ధరల స్ధిరీకరణ నిధిగా రూ. 500 కోట్లను ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్రాలు సగం మొత్తాన్ని జత చేసి ఆ నిధి నుంచి సొమ్ము తీసుకొని లేదా రాష్ట్రాలు కేంద్రానికి చెల్లించి ఉల్లిపాయలను కొనుగోలు చేసి మార్కెట్ ధరల కంటే తక్కువకు విక్రయించే ఏర్పాట్లు చేశారు. అయితే ఇది ధరల మీద పెద్ద ప్రభావం చూపటం లేదు. గతేడాది దిగుమతి చేసుకున్న ఉల్లి సరైన గోదాము సౌకర్యాలు లేక పాడైపోయినట్లు వార్తలు వచ్చాయి. దాంతో అయినకాడికి తెగనమ్మి ప్రభుత్వం సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించింది. దిగుమతి చేసుకున్న ఉల్లి ధర రూ. 45-50 పడితే దాన్ని పది-పదిహేను రూపాయలకే అమ్మాల్సి వచ్చింది.
దేశాల మధ్య ఉల్లి దౌత్యపరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దులో విబేధాల కారణంగా చైనా పెట్టుబడులు, దిగుమతుల మీద ఆంక్షలు విధించిన కేంద్రం టర్కీ విషయానికి వస్తే అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చిందనే విమర్శలు వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని టర్కీ బహిరంగంగానే విమర్శించింది. అయినా గత ఏడాది పదకొండువేల టన్నుల ఉల్లి దిగుమతి చేసుకున్నాము. మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఒక సమావేశంలో మాట్లాడుతూ మన విదేశాంగ విధానంలో వేగంగా మార్పులు వస్తున్నప్పటికీ వస్తువుల విషయానికి వచ్చినపుడు ఆర్థిక విషయాలే ప్రధాన నిర్ణాయక శక్తిగా ఉంటాయని చెప్పారు.
ధరల స్ధిరీకరణ చర్యల్లో భాగంగా గతేడాది నాఫెడ్ 52 వేల టన్నుల ఉల్లిని మహారాష్ట్ర, గుజరాత్‌లో కొని నిల్వ చేసింది. ఆగస్టులో బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 40 దాటినపుడు దానిలో సగాన్ని రాష్ట్రాలకు విక్రయించింది. వర్షాలకు గోదాముల్లో నీరు చేరటంతో సరకు పాడైపోతున్నట్లు గుర్తించి బహిరంగ మార్కెట్లో ఎంత వస్తే అంత అన్న ప్రాతిపదికన విక్రయించింది. సరైన నిల్వ ఏర్పాట్లు కూడా చేయలేని నిర్లక్ష్యాన్ని ఈ ఉదంతం వెల్లడించింది.
గత ఏడాది కూడా సెప్టెంబరు చివరి వారంలో ఎగుమతులపై నిషేధం విధించింది. నిల్వ పరిమితులను చిల్లర వ్యాపారులకు వంద నుంచి ఇరవై క్వింటాళ్లు, హోల్‌సేలర్లకు 500 నుంచి 250కి తగ్గించినప్పటికీ ధరలు తగ్గలేదు. నవంబరు, డిసెంబరు మాసాల్లో రూ. 150 వరకు పలికింది. లక్షా 20 వేల టన్నులు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించి, 42 వేల టన్నులకు టెండర్లు ఖరారు చేసి తరువాత ఐదు వేల టన్నులకు రద్దు చేసి చివరికి 37 వేల టన్నులు దిగుమతి చేసుకున్నారు. రకరకాల కారణాలు తోడై దిగుమతులు ఆలస్యం కావటంతో లక్ష్యం నీరుగారిపోయింది. అవి వచ్చే సమయానికి స్ధానిక మార్కెట్లో ధరలు పడిపోయాయి. దాంతో అంతకు ముందు తమకు 33 వేల టన్నులు కావాలన్న రాష్ట్రాలు దిగుమతి సరకు ధరలు ఎక్కువగా ఉండటంతో తమ ఆర్డర్లను సగానికి తగ్గించుకున్నాయి. వాటిని కూడా పూర్తిగా తీసుకుపోలేదని వార్తలు వచ్చాయి. చిత్రం ఏమంటే ఇదే సమయంలో ప్రయివేటు వ్యాపారులు 75 వేల టన్నులను వేగంగా దిగుమతి చేసుకొని వాటి ద్వారా కూడా లబ్ధి పొందారు.
ఎం. కోటేశ్వరరావు










