- స్కూలు సమీపంలో మహిళ కాల్చివేత : సిపిఐ(ఎం), సిపిఐ ఎంపీల బృందం పర్యటన
ఇంఫాల్, న్యూఢిల్లీ : మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ చెలరేగింది. దాదాపు రెండు మాసాల తరువాత స్కూళ్లు తిరిగి తెరిచిన ఒక రోజుకే పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో ఓ పాఠశాల సమీపంలో మహిళను కాల్చి చంపారు. స్థానిక శిశు నిష్తా నికేతన్ పాఠశాల ఎదుట గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. రెండు నెలలుగా హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో 122 మంది దాకా చనిపోయారు. మరో 300 మందికిపైగా గాయపడ్డారు. 50 వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. రాష్ట్రవ్యాపితంగా ఇంటర్నెట్‌ను బంద్ చేసింది. మణిపూర్ హింసాకాండలో బాధితులను పరామర్శించి, అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు సిపిఐ(ఎం), సిపిఐ ఎంపీల బృందం గురువారం రాష్ట్రంలో పర్యటించింది. శుక్రవారం కూడా పర్యటించి గవర్నరుకు ఒక మెమోరాండం సమర్పించనుంది.
హైకోర్టును ఆశ్రయించండి : మణిపూర్‌లో ఇంటర్‌నెట్ నిషేధంపై సుప్రీం
మణిపూర్‌లో రెండు మాసాలుగా అమల్లో వున్న ఇంటర్‌నెట్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. మణిపూర్ హైకోర్టు దీన్ని ఇప్పటికే విచారించిందని పేర్కొంది. ''దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్ళరు? ఎందుకంటే, మేం నోటీసులు జారీ చేసిన మరుక్షణం హైకోర్టు దీన్ని పరిశీలించడం ఆపేస్తుంది.'' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఇద్దరు పిటిషనర్లకు చెప్పింది. మణిపూర్ హైకోర్టు న్యాయవాది చోగతమ్ విక్టర్ సింగ్, వ్యాపారవేత్త మయేంగ్భమ్ జేమ్స్‌లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో హైకోర్టు ఇంతవరకు దామాషా సూత్రాన్ని పరిశీలించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది షాదన్ ఫరాసత్ చెప్పారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, హైకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో ఇంటర్‌నెట్‌ను పునరుద్ధరించవచ్చా లేదా అనేది పరిశీలించాల్సిందిగా ఆ కమిటీని ఆదేశించిందని చెప్పారు. ''షాదన్ ఫరాసత్ ఈ విషయంలో దామషా సూత్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం వుందని చెబుతున్నారు. పైగా 226వ అధికరణపై పిటిషన్ కూడా పెండింగ్‌లో వున్నందున, ఈ అంశాన్ని ఇక ఇక్కడితో ఉపసంహరించుకోవడానికి ఫరాసత్ అనుమతి కోరుతున్నారు.










