
ఆకులన్నీ రాలిపోతాయి. చెట్లన్నీ మోడు వారతాయి. రాలిన ఆకులు ఎండిపోయి, గాలివాటుకు అటో ఇటో ఎగిరిపోతూ ఉంటాయి. అది శీతల శిశిరం మిగిల్చిన కోల్పోయిన దృశ్యం. అదేచోట- మోడువారిన చెట్ల కొమ్మల్లో కొత్త చివుళ్లు తొంగిచూస్తాయి. లేలేత ఆకులు నవనవలాడుతూ పరవశిస్తాయి. గుబురు కొమ్మల్లోంచి గండు కోయిల కూహూకూహూ గానం వినిపిస్తుంది. ఇది వసంతం తీసుకొచ్చిన ఆశావహ దృశ్యం. ఒక శోభ అదృశ్యమైన చోట- మరొక ఆశ అవతరిస్తుంది. ఆకు రాలిన చోట కొత్త చివురు పలకరిస్తుంది.
ఈ ఆశలు మోసులెత్తే సందర్భమే ఉగాది. తెలుగు వారి సంవత్సరాది.
చాలా పండగలు ప్రకృతిలోంచే ప్రభవిస్తాయి. మనిషికి, ప్రకృతికి ప్రాథమికంగా ఉన్న అనుబంధాన్ని అవి చాటి చెబుతాయి. ప్రకృతి తొలి నుంచీ మనిషికి ఆకలి తీర్చే ఆదరువు. బతుకు పాఠాలను విడమర్చి చెప్పే గురువు. ప్రకృతిలోని ప్రతి చెట్టూ, పుట్టా, వాగూ వంకా మాట్లాడతాయి; వినే మనసు ఉంటే. ప్రతి పిట్టా, పువ్వూ, మబ్బూ, మానూ సంభాషిస్తాయి, అర్థం చేసుకొనే మనిషి ఉంటే.
ప్రకృతిలో మన బంధం తరతరాలది. భూమ్మీద తొలి జీవి నడయాడిన కాలం అంత పాతది. మనిషి నేర్చుకున్న జ్ఞానమంతా ప్రకృతిలోనిదే! ప్రకృతిలో ఇమిడి ఉన్న కార్యకారణ సూత్రాలే మనకు బతుకు పాఠాలు. ప్రకృతిపరమైన, వ్యవసాయ సంబంధమైన ప్రతి పండగలోనూ మనిషికి ప్రకృతితో ముడిపడి ఉన్న అనుబంధం కనిపిస్తుంది. అలా చూసినప్పుడు ఉగాది అక్షరాలా ప్రకృతి పండగ. ఉగాది వేళ పల్లవించే ప్రతి మార్పులోనూ మన జీవితానికి అన్వయించే పాఠం ఒకటి అంతర్లీనంగా ఇమిడి ఉంటుంది. పరికించి చూస్తే - ఉగాది జీవితాన్ని నిర్వచించే పండగ. జీవితాన్ని నిర్మించే పండగ.
- పచ్చడిలో జీవిత పరమార్థం
ఉగాది ప్రత్యేకంగా తయారుచేసే పచ్చడి జీవిత పరమార్థాన్ని విడమర్చి చెబుతుందని అంటారు. సుఖదు:ఖాలు, కోపతాపాలు, ప్రేమాభిమానాలు, అభినందనలూ అవమానాలూ వంటివి ఎవరి జీవితంలోనైనా సహజమే! ఆరు రుచుల సమ్మేళంగా అలరించే ఉగాది పచ్చడి - అలాంటి అనుభవాలకు ప్రతీకగా అభివర్ణిస్తారు. ఉగాది వేళకు ప్రకృతిలోనే పచ్చడికి అవసరమైన దినుసులు సిద్ధంగా ఉంటాయి. పంట చేలో చెరుకు గడ పక్వానికి వచ్చి ఉంటుంది. తోటలోనో, ఇంటి పెరట్లోనో చిన్ని చిన్ని నక్షత్రాల్లాంటి గుత్తులను దిగేసుకొని, వేపచెట్టు కనిపిస్తుంది. లేలేత ఆకుల మధ్య టెంక కట్ట్టని దశలో మామిడి గుత్తులు వేలాడుతూ ఉంటాయి. విరగ్గాసిన చింత చెట్ల నుంచి అప్పటికే కొత్త చింతపండు వెదురు గంపల్లోకి చేరి ఉంటుంది. ముప్పేట తిరిగిన కొబ్బరి, పక్కాగా పండిన అరటి, కొరికితే పిండైపోయే వేపిన శనగపప్పు.. అన్నీ కొత్తకొత్తగా ఉంటాయి. ఈ దినుసులన్నిటికీ ఉప్పు కూడా జోడించి- సరైన పద్ధతిలో సమపాళ్లలో కలిపితే- ఉగాది పచ్చడి ఊరిస్తూ సిద్ధమవుతుంది. ఉగాది కవిత్వంలాగానే ఉగాది పచ్చడి మీదా బోలెడు జోకులూ, కార్టూన్లూ ఉన్నాయి. అదంతా సృజనకారుల అతిశయమే తప్ప- ఉగాది పచ్చడి వల్ల ఉత్పన్నమయ్యే పేచీ ఏమీ లేదు. హాయిగా ఆస్వాదించగలిగితే ఉగాది పచ్చడిలో ఉన్న ఆనందమే ఆనందం. ఇంకే వంటకంలోనూ, ఆహార పదార్థంలోనూ తారసపడని రుచి ఆ పచ్చడిది. తీయతీయగా, పుల్లపుల్లగా, చేదుచేదుగా.. కలగలపి చవి చూపే సందర్భం ఇది. చెంచాడు పచ్చడి నోట్లో వేసుకోగానే- తొలి తొలిగా నాలిక్కి తీపి స్ఫురిస్తుంది. ఆ వెంటనే పులుపు పలకరిస్తుంది. వగరు కూడా ఉన్నానని గుర్తు చేస్తుంది. పంటికింద చిక్కిన వేపమొగ్గను అదాటున కొరికితే- చేదు పలకరించి పరాక్రమిస్తుంది. 'అయ్యో, చేదు' అనుకొని- ఊసేయబోతే మిగతా రుచులూ నేలపాలవుతాయి. చేదు అనుకొని వదిలేయబోతే- తీపి కూడా దూరమవుతుంది మరి! అన్ని రుచులూ కలగలిసిన పచ్చడిని ఆస్వాదించటమే అప్పుడు చేయాల్సిన పని. తీపి కోసం చేదును స్వీకరించాలి. పులుపులోని పులకింత కోసం వగరులోని పొగరునూ ఆహ్వానించాలి. గెలుపు కోసం ఓటమిని ఎదుర్కోవల్సి ఉంటుంది. రేపటి సుఖం కోసం నేడొక కష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఆరు రుచులు కలగలిసిన ఉగాది పచ్చడి మనకు బోధించే జీవిత పరమార్థం ఇదే!
- శిశిరం తరువాత వసంతశోభ
ఉగాది వేళ పచ్చడిలోనే కాదు; ప్రకృతిలోనూ అలాంటి పాఠమే ఉంటుంది. ఉగాదికి ముందు వరకూ శిశిరం తాండవిస్తుంది. చలిగాలులు చుట్టుముడతాయి. చెట్టూ చేమల్లో చైతన్యం మందగిస్తుంది. జీవుల్లో కలివిడితనం తగ్గిపోతుంది. నేలనిండా నెమ్మదితనం ఆవరిస్తుంది. శీతల రాత్రులు సుదీర్ఘంగా నడుస్తాయి. వణికించే చలి మునగదీసుకొని పడుకునేలా చేస్తుంది. కొన్ని జీవుల సుప్తావస్థలోకి జారుకుంటాయి కూడా. జీవనక్రియలు మందగిస్తాయి. చెట్ల ఆకులు హరిత కాంతులను నెమ్మది నెమ్మదిగా కోల్పోతాయి. పచ్చదనాన్ని పోగొట్టుకొని, పసుపుపచ్చగా మారతాయి. ఆకులన్నీ రాలిపోతాయి. ప్రకృతి మొత్తం నిండుదనం కోల్పోయి, మోడువారినట్టు కళావిహీనం అవుతుంది.
ఇలా కొన్ని రోజులో, వారాలో గడుస్తాయి. శిశిరం సెలవు తీసుకొని, కాలంలో కలిసిపోతుంది. వసంతం ఆగమిస్తుంది. ఆకులు రాలిన కొమ్మల్లో లేలేత చివుళ్లు తలెత్తుతాయి. ఎర్రెర్రగా, లేలేతగా తళతళలాడతాయి. చిరుగాలుల తాకిడికి మిలమిల మెరుస్తూ ఆకులు కనువిందు చేస్తాయి. చూస్తుండగానే మోడువారిన చెట్లు కొత్త ఆకుల గుబర్లతో కొంగొత్తగా నవనవలాడతాయి. శీతల రాత్రులు, మంచు కురిసే ఉదయాలూ - మాయం అయిపోతాయి. నులివెచ్చని సూరీడు ప్రకృతికి గోరువెచ్చని హాయిని ప్రసాదిస్తాడు. కొత్త గాలులు పల్లవిస్తాయి. ఆకులు రాలిన వేప విచిత్రంగా తెల్లని పూగుత్తులు విరగకాస్తుంది. జేగురురంగు ఆకుతో కనువిందు చేసే మామాడిచెట్లు - పిందెలను పొదుపుకొని ఇంతింత కాయలను అలంకరించుకుంటుంది. శిశిరాన్ని చూసి నిరుత్సాహపడితే - వసంతాల వేళ ఇన్ని హాయిల ఆనందహేలను ఆస్వాదించగలమా? వ్యక్తి జీవితంలోనైనా, సామాజిక పరిణామాల్లోనైనా - ఇలాంటి ఎగుడు దిగుళ్లు సహజం. మనం ఆనందించే మార్పూ ఉంటుంది. ఆశ్చర్యపోయే విషాదమూ ఉంటుంది. ఆకులు రాల్చిన శిశిరం శాశ్వతంగా ఉండిపోదు. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అన్న కవివాక్యంలోని ఆశాభావం ఇదే!
- ప్రకృతినిండా వసంతగానం!
ఉగాది ఏతెంచిన తరుణాన ప్రకృతి అంతా పచ్చగా పరవశిస్తుంది. అందుకు తగ్గట్టుగానే జీవుల్లోనూ వసంతోత్సాహం వెల్లివిరుస్తుంది. గుబురు కొమ్మల్లో దాగి దాగి గండు కోయిల కుహూకుహూ గానం చేస్తుంది. లేత చిగుళ్లను తింటూ వసంత కాలానికి ఒక శబ్ద సౌందర్యాన్ని జత చేస్తుంది. తరతరాలను ఒకే రకమైన అనుభూతితో ముడిపెట్టే
- ప్రకృతి సహజ సంబంధం ఈ కోయిళ్ల కోలాహలం.
మన సమాజం పూర్తిగా వ్యవసాయ ప్రధానంగా సాగినప్పుడు- ఉగాది కాలం మొత్తం గొప్ప తీరుబాటు సమయం. సంక్రాంతికి పంటలన్నీ ఇంటికి చేరేవి. కొద్దోగొప్పో అపరాల పంటలు పొలాల మీద ఉండేవి. ఉగాదికి ప్రధానమైన వ్యవసాయ పనులు అయిపోయి, పొలాలు ఖాళీగా ఉండేవి. అది రైతులకు మమ్మరమైన పనుల నుంచి పుష్కలమైన విరామం దొరికే కాలం. ఆ విరామ తరుణంలో కుటుంబాల్లోని యుక్త వయస్కులకు పెళ్లిళ్లు.. ఆ సందర్భాన పిన్నలకు, పెద్దలకు సందళ్లు. ఇంటిముందూ, వీధుల్లో పెద్దపెద్ద తాటాకు పందిళ్లు. మున్ముందు ముదిరే ఎండలకు ఆ
పందిళ్లే చలువ కేంద్రాలు. ఆటపాటలకు, కబుర్లూ కాలక్షేపాలకు ఆరామాలు. వ్యవసాయం గాడి తప్పాక, అనేక ఆధునిక వ్యాపకాలూ, వృత్తులూ అనుభవంలోకి వచ్చాక- ఈ క్రమం కొంత మారింది. అయినా, పల్లెల్లో ఇప్పటికీ ఈ వాతావరణం ఎంతోకొంత మిగిలి ఉంది.
- పంచాంగ శ్రవణం.. పార్టీల గమనం
ఉగాది రోజున పచ్చడికి ఎంత ప్రాధాన్యం ఉందో పంచాంగ శ్రవణానికీ అంత ప్రాముఖ్యం ఉంది. ఆ రోజున ఏడాది మొత్తం ఎలా నడుస్తుందో పంచాంగ కర్తలు చెప్పటం ఆనవాయితీగా వస్తోంది. వానలు ఎలా కురుస్తాయి? ఏఏ పంటలు పండుతాయి? వంటి సంగతులను వివరిస్తారు. విజ్ఞానం ఇంతగా పెరిగిన దశలో వర్షాల రాక, సేద్యంలో మెలకువల గురించి చెప్పటానికి నేడు అనేక విభాగాలు ఉన్నాయి. అయినప్పటికీ ఒక తంతులా పంచాంగ శ్రవణం నడుస్తూనే ఉంది. రైతుల వెతలూ కతలూ ముడిపడి ఉన్నది పంచాంగంతో కాదని మనకు అర్థమవుతూనే ఉంది. అధికారంలో ఉన్న పార్టీలు అవలంబించే విధానాలే సాగుదారుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సాగుకు సాయం, పంటకు ధర కావాలంటే- అడగాల్సింది ప్రభుత్వాలనే! కాలానికి అనుగుణంగా ప్రవర్తించాలనేది ప్రకృతి పాఠం. పాత లెక్కల పంచాంగాన్ని పట్టుకు వేళ్లాడడం అందుకు విరుద్ధం. పంచాంగ శ్రవణాలు ఇప్పుడు ప్రహసనంగా మారిపోయాయి. రాజకీయ పంచాంగాలకైతే- కొద్దిపాటి పోలిక కూడా ఉండదు. ఒక్కో పార్టీ కార్యాలయంలో ఒక్కో రకం పంచాంగాలు నడుస్తున్నాయి.
- రైతు సంతోషమే నిజమైన ఉగాది
పరమార్థాలను పక్కన పెట్టి, పర్వదినాలను జరుపుకుంటే- వట్టి తంతు మాత్రమే అవుతుంది. ఇప్పటి రైతు పరిస్థితి కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది కాదు. అంతా సవ్యంగా సాగిపోయే స్థితి లేదు. సాగునీరు, పెట్టుబడి, ఎరువులు, మందులు, వాటి ధరలూ, దిగుబడి, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వంటివన్నీ ఆధునిక కాలపు అవసరాలు. వీటిని పంచాంగం తీర్చదు, ప్రభుత్వమే పట్టించుకోవాలి. పట్టించుకునేలా ప్రభుత్వాలూ వ్యవహరించకపోవటం మరొక ధోరణి. రైతులను నిర్వాసితులను చేసి, పంట భూములను బడా కంపెనీలకు కట్టుబెట్టటం మరొక విపరీతం. వీటిని అర్థం చేసుకొని, అడగగలిగిన, అడ్డుకోగలిగిన చైతన్యం రైతుల్లో రావాలి! రైతు శ్రమించి, వడ్డిస్తున్న వరిధాన్యాలనే మనం భుజిస్తున్నాం కాబట్టి- మనందరం రైతుకు అండగా నిలవాలి. అప్పుడే రైతుకు నిజమైన ఉగాది. దేశానికి బలమైన పునాది.
- పంచాంగం ప్రామాణికమా?
తెలుగు సంవత్సరాలు 60. వరుస క్రమం ప్రభవతో మొదలై అక్షయతో ముగుస్తుంది. ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరం పేరు శుభకృత్. వరుస క్రమంలో 36వది. ఇది ఇంతకముందు 1903, 1963లలో వచ్చింది. మళ్లీ 2083లో వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం ప్లవ. వీటిని అనుకోవటానికి తప్ప అనుకోగానే నిర్ధిష్టంగా గుర్తించలేం. ఎందుకంటే- సంఖ్యల్లో ఉండవు కాబట్టి. పైగా ప్రపంచంలో ఇంకెవరూ ఈ పేర్లను వాడరు. కాబట్టి- సులభంగా నమోదు చేయటానికి వీలుగా క్రీస్తుశకం పద్ధతినే మనం అనుసరిస్తున్నాం. ప్రపంచం మొత్తంతో కలిసి సాగాల్సిన ఆధునిక కాలంలో మనకు సౌలభ్యం ముఖ్యం తప్ప- సాంప్రదాయం కాదు. స్వదేశీ, స్వరాష్ట్రం పేరుతో మనం ప్రభవ, విభవ సంవత్సరాలనే అధికారిక లెక్కల్లో నమోదు చేస్తే- మనది మాత్రమే ఒక ప్రపంచంగా మిగిలిపోతుంది. పద్ధతి ఎక్కడిది, ఎవరిది అన్నది కాదు; అది మనకు సౌలభ్యమా, కాదా అన్నది ప్రధానం. వీలైనదానిని ఎక్కడినుంచైనా స్వీకరించటం, అనుసరించటం మనం పాటిస్తున్న పద్ధతి. పంచాంగాలు కూడా మనదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. కొందరిది సూర్యమాన పద్ధతైతే, మరికొందరిది చంద్రమాన పద్ధతి. పండగల నిర్వహణకు సంబంధించిన తిథుల గణనలో వ్యత్యాసాలూ, ఆ సందర్భంగా పంచాంగకర్తల మధ్య వాదోపవాదాలూ మనం తరచూ చూస్తూనే ఉంటాం. వీటితో సంబంధం లేకుండా ఏదొకరోజు జనం పండగలను జరుపుకుంటూనే ఉన్నారు. ఇక్కడ పదిమంది కలిసి చేసుకొనే సందడి ముఖ్యం తప్ప- ఆ సందర్భంగా తలెత్తే అశాస్త్రీయ వాదాల నిర్దేశాలు కావు. తరచూ ఆచరణలో జనం దీనిని నిరూపిస్తూనే ఉన్నారు.ఉగాది పంచాంగంలో రాజపూజ్యాలు, అవమానాలు, ఆదాయ వ్యయాలు అంటూ పేరును బట్టి- ఈ ఏడాది ఎవరికి ఎలా ఉండబోతుందో చెబుతారు. ఉపాధి, ఉద్యోగం, ఉత్పత్తి మీద ఆధారపడే ఆదాయం ఉంటుందని మనందరికీ తెలుసు. పేర్లను బట్టి పరిస్థితి అనుకుంటే- అంబానీ అప్పుడప్పుడు పేదోడు అవ్వాలి. మన పక్కింటి పార్వతీశం కనీసం ఒక్కసారన్నా కోటీశ్వరుడు అయితీరాలి. కానీ, అలా జరగదు. కాబట్టి- అదంతా ఒక తంతు. ప్రకృతి పండగ ఉగాదిని నేల నుంచి ఊహాల్లోకి, చేతన నుంచి చాదస్తంలోకి మళ్లించిన తతంగం.
- సత్యాజీ