May 16,2023 17:39

అంకారా :   టర్కీ ఎన్నికల ఫలితాల్లో సందిగ్థత నెలకొంది. మే 28న వెల్లడికానున్న ఫలితాలతో తరువాతి అధ్యక్షుడు ఎవరుకానున్నారో స్పష్టం కానుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మొత్తం 99.78 శాతం ఓట్లు లెక్కించగా.. ఎర్డోగాన్‌కు 49.50 శాతం ఓట్లు పోలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రతిపక్ష నేత కెమల్‌ కిలిక్‌డరోగ్లుకు 44.89 శాతం ఓట్లు పోలయ్యాయి. 3.4 మిలియన్లు ఉండే విదేశీ ఓటర్లకు చెందిన మెజారిటీ బ్యాలెట్‌లను లెక్కించాల్సివుందని అత్యున్నత ఎలక్టోరల్‌ బోర్డ్‌ పేర్కొంది. 2018 ఎన్నికల్లో ఎర్డోగాన్‌ 60 శాతం విదేశీ ఓట్లను గెలుపొందారు.

ఆదివారం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో తమ అధికారిక కూటమి మెజారిటీని సాధించిందని అధ్యక్షుడు ఎర్డోగాన్‌ పేర్కొన్నారు. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులోనూ మెజారిటీ సాధించామని అన్నారు. మొదటి రౌండ్‌లో ఎన్నికలు ముగుస్తాయో లేదో ఇంకా తెలియదని, ప్రజలు రెండో రౌండ్‌కు తీసుకువెళితే.. దానిని కూడా గౌరవిస్తామని అన్నారు. మే 28న జరిగే ఓట్ల లెక్కింపులో తాను విజేతగా నిలుస్తానని ఎర్డోగాన్‌ స్పష్టం చేశారు.