
న్యూఢిల్లీ : గుజరాత్‌లో గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న జెండా వివాదం, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శుక్రవారం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఎఐటిఎంసి) మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి)కి ఫిర్యాదు చేసింది. ఈ వివాదాస్పద ఘటనలో ముస్లిం వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులను గుజరాత్ పోలీసులు తీవ్రంగా హింసించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహరంపై ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా కేసు స్వీకరించకపోవడం సిగ్గు చేటని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. రాళ్లురువ్వారని ఆరోపిస్తూ ... ముస్లిం వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులను విద్యుత్ స్తంభానికి కట్టేసి, పోలీసులు తీవ్రంగా లాఠీలతో కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని ఉంధేతా గ్రామంలో జరిగిన గర్భా కార్యక్రమంపై రాళ్లు రువ్వారంటూ ఓ ముస్లిం వర్గంపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సి స్పందించకపోవడం సిగ్గుచేటని టిఎంసి నేత గోఖలే తెలిపారు. రాళ్లు రువ్వినందుకు శిక్ష అంటూ వారిని పోలీసులు బహిరంగంగా హింసించారని పేర్కొన్నారు. ముస్లింలు కావడంతో చట్ట ప్రకారం వారిని అరెస్ట్ చేయకుండా అమానవీయంగా క్రూరత్వాన్ని ప్రదర్శించారని అన్నారు. గుజరాత్‌లోని మైనారిటీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనమని అన్నారు.