
మోడీ సర్కార్‌పై మహువా మొయిత్రా విమర్శలు
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు కుంభకోణం గురించి ఎవరన్నా విమర్శిస్తే వెంటనే వారిని అణచివేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా శుక్రవారం విమర్శించారు. లోక్‌సభ నుండి తనను బహిష్కరించాలని నైతిక విలువల కమిటీ చేసిన సిఫార్సు, నిరాశా నిస్పృహలతో ఆ దిశగా తీసుకున్న చర్యేనని విమర్శించారు. పిటిఐ వీడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ప్రశ్నకు నగదు కుంభకోణంలో ఆమె పాత్రపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదానీ, రూ.13వేల కోట్ల బొగ్గు కుంభకోణానికి పాల్పడ్డారు. మరే ఇతర దేశంలోనైనా అయితే, ఈ కుంభకోణంతో ప్రభుత్వం కూలిపోయేది. మోడీకి కూడా ఈ విషయం తెలుసు, అందువల్లే వారు సాధ్యమైనంత కాలమూ దీన్ని దాచిపెట్టేందుకే చూస్తున్నారని మొయిత్రా విమర్శించారు. మోడీ,అదానీ ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎవరైనా వారిని ప్రశ్నించాలంటే భయాందోళనలకు గురవుతున్నారు. అలా ప్రశ్నించేవారిని నోరుమూయించి, జైల్లో కూర్చోబెట్టాలన్నది వారి ఆలోచన అని మొయిత్రా తీవ్రంగా విమర్శించారు. అబద్ధాల ఫ్యాక్టరీగా కాషాయ పార్టీ మారిందని వ్యాఖ్యానించారు.