Dec 06,2022 11:14

న్యూఢిల్లీ   :   మోర్బీ బ్రిడ్జి ఘటనపై ట్వీట్‌ చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి సాకేత్‌ గోఖలేను గుజరాత్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాకేత్‌ సోమవారం రాత్రి ఢిల్లీ నుండి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లగా.. అక్కడి నుండి గుజరాత్‌ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని టిఎంసి సీనియర్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ ట్వీట్‌ చేశారు. సాకేత్‌ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చేందుకు కేవలం రెండు నిమిషాల సమయం ఇచ్చారని, అనంతరం అతని నుండి ఫోన్‌, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఇటువంటి చర్యలతో టిఎంసి గొంతుకను అణచివేయలేవని ఒబ్రెయిన్‌ మండిపడ్డారు. బిజెపి రాజకీయ కక్షలను మరింత తీవ్రం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల గుజరాత్‌లో మోర్బీలోని బ్రిడ్జీ కూలిన ఘటనలో 130 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన వారి కుటుంబసభ్యులను, గాయపడిన వారిని పరామర్శించేందుకు ప్రధాని గుజరాత్‌లో పర్యటించారు. దీంతో బాధిత కుటుంబాలకు ఇచ్చిన నష్టపరిహారం కన్నా మోడీ గుజరాత్‌ పర్యటన ఖర్చే అధికమంటూ సాకేత్‌ పేర్కొన్నారు. పత్రికలో వచ్చిన క్లిప్పింగ్‌లను కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ క్లిప్పింగ్‌లో ఈ విధంగా ఉంది. మోర్బీ ప్రాంతాన్ని ప్రధాని కొన్ని గంటల పాటు సందర్శించినందుకు అయిన ఖర్చు రూ.30 కోట్లు అని ఆర్‌టిఐ స్పష్టం చేసింది. ప్రధాని ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కి, ఫోటోషూట్‌ల కోసం రూ. 5.5కోట్లు ఖర్చు పెట్టినట్లు క్లిప్పింగ్‌లో ఉంది. మోర్బీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4లక్షల నష్టపరిహారం మొత్తం రూ. 5 కోట్లు కాగా, మోడీ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఫోటోషూట్‌ల ఖర్చు బాధితుల పరిహారం కన్నా రెట్టింపని ఆ క్లిప్పింగ్‌ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు ఫేక్‌ అంటూ 'ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో' (పిబిఐ) రీట్వీట్‌ చేసింది.

సాకేత్‌ అరెస్ట్‌పై గుజరాత్‌ ప్రభుత్వం కాని, బిజెపి కాని ఇప్పటివరకు స్పందించలేదు. జైపూర్‌ విమానాశ్రయ పోలీస్‌ ఇన్‌చార్జ్‌ దిగ్పాల్‌ సింగ్‌ను మీడియా ప్రశ్నించగా.. తనకు తెలియదని, ఎవరూ సమాచరమివ్వలేదని పేర్కొనడం గమనార్హం.