Nov 13,2023 15:19

డెహ్రాడూన్‌ :  ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌ శిథిలాల కింద చిక్కుకున్న 40 మంది కార్మికులు సురక్షితంగానే ఉన్నారని అధికారులు సోమవారం తెలిపారు. వారితో కమ్యూనికేషన్‌ జరుపుతున్నామని, ఆహారం, నీరు అందించామని సిల్కియారా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ తెలిపింది. ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్‌ ఆదివారం తెల్లవారుజామున కుప్పకూలిన సంగతి తెలిసిందే.   వీరంతా వలసకార్మికులే కావడం గమనార్హం. సుమారు 30 గంటలు కార్మికులు శిథిలాల కిందే ఉన్నారు.

కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని, వాకీ-టాకీలో వారితో మాట్లాడామని, వారికి ఆహారం, నీరు అందిస్తున్నామని నేషనల్‌ హైవే మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్‌) డైరెక్టర్‌ అన్షు మనీష్‌ పేర్కొన్నారు. టన్నెల్‌ నుండి మట్టిపెళ్లలు విరిగిపడకుండా కాంక్రీట్‌ను చల్లుతున్నామని అన్నారు.  శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికుల వివరాలను డిస్ట్రిక్ట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ విడుదల చేసింది. జార్ఖండ్‌ (15 మంది), ఉత్తరప్రదేశ్‌ (ఎనిమిది మంది), ఒడిస్సా (ఐదుగురు), బీహార్‌ (నలుగురు), పశ్చిమబెంగాల్‌ (మూడు), ఉత్తరాఖండ్‌, అస్సాం (ఇద్దరేసి చొప్పున), హిమాచల్‌ ప్రదేశ్‌ (ఒకరు)కు చెందిన కార్మికులు ఉన్నట్లు తెలిపింది.

ఘటనా ప్రాంతాన్ని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి సందర్శించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం తమ బాధ్యతని పుష్కర్‌ సింగ్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నాయని అన్నారు. త్వరలోనే వారిని రక్షిస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.