Nov 13,2023 13:17

ఒక పిల్ల జింక తన తల్లికి చెప్పకుండా బయటకు వచ్చింది. దానికి కొద్ది దూరంలో ఒక నక్క ఎదురై 'ఈరోజు నాకు దీని మాంసం తినాలనిపిస్తోంది. సింహం చేత దీన్ని చంపించి, తను తినగా మిగిలిన దీని మాంసాన్ని నేను తింటాను. అందువల్ల నేను దీనికి మాయమాటలు చెప్పి నా వెంట తీసుకొని వెళతాను' అని తన మనసులో అనుకుంది.
వెంటనే అది ఆ పిల్ల జింకతో 'ఒరేరు బుజ్జీ! నిన్ను సింహం తన వద్దకు రమ్మని నాతో చెప్పింది. దానికి పిల్లలు అంటే చాలా ప్రేమ. అందువల్ల నీవు నాతో వస్తే, అది నిన్ను తన పైన కూర్చుండబెట్టుకొని అడవి అంతా తిప్పుతుందట!' అని అంది.
దాని మాటలు విన్న పిల్ల జింక 'నేను మా అమ్మకు చెప్పకుండా వచ్చాను. మా అమ్మ నాకు అపరిచితులు ఎవరి వెంటా వెళ్లవద్దని చెప్పింది' అని అంది.
'అయ్యో! మీ అమ్మనే కాదు. ఎవరైనా అలాగే చెబుతారు. ఇప్పుడు నీవు నా వద్దకు వచ్చావు. నేను నిన్ను ఏమైనా అంటున్నానా? నీ మేలుకొరకే నేను చెబుతున్నాను' అని అంది నక్క.
దాని మాటలకు పిల్ల జింక కరిగిపోయి 'సరే! అలాగే వస్తాను' అని అంది.
నక్క తన ఎత్తు పారిందని సంతోషిస్తూ తాను ముందు నడుస్తూ దాన్ని తన వెనుక రమ్మని చెప్పింది. జింక సరేనంది.
అక్కడ సింహానికి చాలా ఆకలి అయింది. అది నక్క దేన్ని తీసుకొని వస్తే దాన్ని తింటానని అనుకుంది. ఇంతలో గాలి, వాన ప్రారంభమైంది. నక్క పిల్లజింకను తొందరగా పరిగెత్తమని చెప్పింది. సరేనంది జింక. నక్క వేగంగా ముందుకు పరిగెత్తుతుంటే దాని వెనుక పిల్లజింక నెమ్మదిగా పరిగెత్త సాగింది. నక్క ఒక పిల్లజింకను ఆలస్యంగా తీసుకొనిరావడం దూరం నుండి చూసిన సింహం కోపించింది. సింహాన్ని, దాని గర్జనను చూసి భయపడిన పిల్ల జింకకు నక్క పన్నాగం అర్థం అయింది.
ఇంతలో గాలి, వాన పెద్దదైంది. ఆ గాలి వానకు వెనుక వస్తున్న జింక యొక్క ముందు వైపుకు సరిగా ఆ రెండింటి నడుమ ఒక పెద్ద చెట్టు వేళ్ళతో సహా కూలి పడింది.
ఆ శబ్దానికి భయపడిన నక్క ముందు వైపుకు భయంతో పరుగెత్తింది.
పిల్ల జింక కూడా భయంతో చటుక్కున వెనుకకు తిరిగి, పరుగెత్తి.. ఇదే అదనని తన ఇంటికి పారిపోయింది.
అక్కడ నక్క సింహాన్ని చేరుకొని సింహంతో 'మృగరాజా! ఆ జింక ఈ దగ్గరే చెట్టు వెనుక ఉంది. నీవు వెంటనే పరుగెత్తి దానిని పట్టుకో' అని సింహాన్ని కోరింది.
సింహం ఆ జింక కొరకు వెంటనే పరుగెత్తింది. కానీ సింహానికి ఆ పడిపోయిన పెద్ద చెట్టు అడ్డంగా ఉండడం వల్ల దాన్ని దాటుకుని వెళ్లేసరికి, ఆలస్యం కావడంతో జింక కనబడలేదు. తర్వాత అది నిరాశతో వెనుదిరిగి పోయి, నక్క ఆలస్యంపై తన కోపాన్ని ప్రదర్శించింది.
అక్కడ ఇంటికి వెళ్లిన పిల్ల జింక తన కోసం ఎదురుచూస్తున్న తల్లికి ఈ విషయాన్ని వివరించి 'అమ్మా! ఈ ప్రకృతి ఎంత మంచిది. ఆ చెట్టు కూలిపోయి నన్ను కాపాడకపోతే నేను సింహానికి, నక్కకు ఆహారం అయ్యేదాన్ని. అందుకే మనం కూడా ఈ చెట్లను కాపాడుకుందాం. ఈ చెట్లు ఉంటేనే మనం రక్షింపబడతాము. లేకుంటే ఈ క్రూర మృగాల వల్ల మనకు ఆపదలు తప్పవు. నీకు చెప్పకుండా వెళ్లి, నేను కోరి ఆపదను కొని తెచ్చుకున్నాను. అందుకే పిల్లలము ఎవరమైనా అపరిచితుల మాయమాటలను నమ్మవద్దని ఈ రోజే నాకు తెలిసింది' అని అంది.
దాని మాటలకు తల్లి ఎంతో సంతోషించి 'ఒరేరు బుజ్జి కన్నా! నీవన్నది నిజమేరా! ఈ అడవి మనకు తల్లి లాంటిది. మనను మన తల్లి కాపాడకుంటే ఎవరు కాపాడుతారు? అందుకే అందరు కూడా మొక్కలు నాటి, వాటికి నీరు పోసి పెంచాలి. వాటిని మనం కాపాడితే, అవి మనలను కాపాడతాయి. ఇకముందు మరొకసారి దుర్మార్గుల, మోసకారుల మాయమాటలను నీవు నమ్మకు. వారు పిల్లలకు మాయమాటలు చెప్పి, ఏదో ఆశను చూపెట్టి తీసుకొని వెళతారు. అలా అపరిచితులతో వెళ్లడం నీ ప్రాణాలకే ప్రమాదం. తెలిసిందా? చాలా మంది పిల్లలు ఈ మాయమాటలకు లొంగి, అపరిచితుల వెంట వెళ్లి కోరి ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తారు' అని తన బిడ్డతో అంది.
'ఔనమ్మా! నీవు చెప్పిందే నిజం. ఈ సంగతి నా మిత్రులందరికీ చెబుతాను. తల్లిదండ్రులకు ఇక మీద దుఃఖం లేకుండా చేస్తాను. ఎవ్వరిని నమ్మినా ఆ నక్కలాంటి అపరిచితులను, దుర్మార్గులను మాత్రం నమ్మవద్దని అందరికీ చెబుతాను. అలాగే మొక్కలను పెంచి, పర్యావరణాన్ని కాపాడమని చెబుతాను' అని అంది.
దాని మాటలకు తల్లి జింక ఎంతో సంతోషించింది.

 

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
9908554535