రామవరంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతడి కొడుకు రాఘవ. యువకుడైన రాఘవ బాగా కష్టపడి పనిచేస్తూ నలుగురితో మంచిగా ఉంటాడు. పెళ్ళీడుకొచ్చిన తన కొడుక్కి భార్యగా మంచి అమ్మాయిని చూసే ప్రయత్నం మొదలుపెట్టాడు సీతయ్య. కోడలికి కూడా రాఘవలానే కష్టపడేతత్వం, నలుగురికీ పాయపడే గుణం ఉండాలనుకున్నాడు.
ఓ రోజు ఎడ్ల బండిలో మామిడిపండ్లు వేసుకుని చుట్టుపక్కల పల్లెలకు వెళ్లాడు సీతయ్య. ఇంట్లోని దుమ్మూ ధూళీ ఇస్తే బదులుగా మామిడిపండ్లు ఇస్తాం!' అని తన సహాయకుడి చేత చెప్పిస్తూ వీధులవెంట నడుస్తున్నారు. ఈ మాట విని, చాలా మంది ఇళ్లలోంచి దుమ్మూ ధూళీ తుడిచి మూటలుగా తెచ్చి, మామిడిపండ్లు తీసుకొని వెళ్తున్నారు. ఒక ఊళ్లో విమల అనే అమ్మాయి చిన్న గుడ్డలో దుమ్ము ధూళీ మూట కట్టుకు వచ్చింది. 'ఇంత తక్కువ చెత్త ఇస్తే ఎన్ని పండ్లు వస్తాయి చెప్పమ్మా?' అన్నాడు సీతయ్య. 'అయ్యో మా ఇంట్లో చెత్త లేదు. ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంచేసి ఉంచుతాం. మా స్నేహితురాలి ఇంటిని శుభ్రం చేయడానికి సాయానికి వెళ్లి వస్తున్నాను. ఈ చెత్త కూడా మీరు పండ్లు ఇస్తున్నారని విని నా స్నేహితురాలి ఇంటి నుంచి తెచ్చాను' అని చెప్పిందామె.
తన ఇంటికి కోడలిగా రావాల్సింది ఇలాంటి పిల్లే. ఈ అమ్మాయే అని నిశ్చయించుకున్నాడు సీతయ్య. మర్నాడు కొడుకుతో కలిసి ఆ ఊరు వచ్చి, విమల తల్లిదండ్రులతో మాట్లాడాడు. ఆమెను తన కోడలిగా చేసుకుంటామని చెప్పాడు సీతయ్య. విమల తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు.
ఎం. నాగశ్రావణి
10వ తరగతి, జడ్.పి.హెచ్ స్కూలు, పెద తాడేపలి,్ల తాడేపల్లి గూడెం మండలం
పశ్చిమ గోదావరి జిల్లా.