
బడికి సెలవులు మొదలయ్యాయి. ఓరోజు రాము ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. అప్పుడు రాముకి ఓ మంచి ఆలోచన వచ్చింది. వెంటనే తన స్నేహితుల దగ్గరికి వెళ్లి 'మనకి సెలవులు మొదలయ్యాయి కదా, ఈ సమయాన్ని మనం మంచి పనులకు ఉపయోగించుకుందాం' అని చెప్పాడు.
అప్పుడు వాళ్ళల్లో ఒక పిల్లవాడు 'అలాగే రాము. కానీ ఏం చేద్దాం?' అని అడిగాడు.
'మనం మొక్కలని పెంచుదాం. మొక్కలు కొన్ని రోజులకు పెద్ద పెద్ద చెట్లవుతాయని, అవి మన స్నేహితులు అని, వాటిని నాటడం వల్ల మన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని, మనకి గాలి, నీడని ఇస్తాయని మన సైన్స్ టీచర్ చెప్పారు కదా! అందుకే మనం ఈ సెలవుల్లో మొక్కలు పెంచుదాం' అని చెప్పాడు రాము.
అందరూ సరే అన్నారు.
పోయినసారి వినాయకచవితికి మట్టి వినాయకుడితో పాటు వచ్చిన గింజలను భద్రంగా దాచుకున్న రాము, వాటిని తీసుకొచ్చి తన స్నేహితులతో కలిసి మట్టిలో నాటాడు.
ప్రతిరోజూ నీళ్లు పోస్తూ భూమిలో నుండి మొక్క ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు.
ఒకరోజు స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వెళ్లిన రాము, తను గింజలు నాటిన చోట ఒక చిన్న మొలక రావడం గమనించి, చాలా సంతోషించాడు. వెంటనే తన స్నేహితులను కూడా తీసుకొచ్చి చూపించాడు. అందరూ ఆనందంగా గెంతారు.
అప్పటి నుంచి వాళ్ళందరూ కలిసి ఆ చిన్న మొక్కని జాగ్రత్తగా చూసుకున్నారు. అలా కొన్ని రోజులకు అది పెద్ద చెట్టుగా పెరిగింది.
ఒక రోజు రాము స్నేహితులంతా చెట్టును చూడడానికి వెళ్లారు. అప్పుడు రాము చెట్టు దగ్గర పడిపోయి ఉంటాడు. రాము స్నేహితులని చూసి సహాయం అడిగాడు. ఎందుకంటే రాము కాలికి దెబ్బ తగిలింది. అప్పుడు అతని స్నేహితులు ఆ చెట్టు ఆకులను నలిపి, రాము కాలి గాయంపై పెట్టారు.
మరుసటిరోజుకి రాముకి దెబ్బ తగ్గిపోయింది. అప్పటి నుంచి రాముకి ఆ చెట్టు అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది.
రోజూ రాము, ఇంకా అతని స్నేహితులు ఆ చెట్టు కింద ఆడుకోవడానికి వెళ్తుంటారు. ఇంకా చాలా రోజులు గడిచాయి.
రాముకి పరీక్షలు మొదలయ్యాయి. దానివల్ల రోజూ సాయంత్రం ఆ చెట్టు దగ్గరికి వెళ్లలేకపోయేవాడు. కానీ బడికి పోయేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి దూరం నుంచే ఆ చెట్టుని చూసి బడికి వెళ్లేవాడు. ప్రతిరోజూ ఇలానే గడిచిపోయేది.
ఒక రోజు ఎవరో కొంతమంది వచ్చి ఆ చెట్టుని అక్కడి నుంచి తీసేస్తుండడం చూసి చాలా ఏడ్చాడు.
వాళ్ళ దగ్గరికి వెళ్లి 'అంకుల్! ఇది నా ఫ్రెండ్. ప్లీజ్ దీన్ని ఇక్కడి నుంచి తీసేయొద్దు. ఈ చెట్టు అంటే నాకూ, నా ఫ్రెండ్స్‌కి చాలా ఇష్టం. మేమే దీన్ని ఇక్కడ నాటాము. దీని కిందే మేము రోజూ ఆడుకుంటాము. దీన్ని ఇక్కడి నుంచి తీసేయొద్దు' అని చాలా రిక్వెస్ట్ చేశాడు.
కానీ వాళ్ళు వినలేదు. రోడ్డు విస్తీర్ణం పెంచడానికి ఆ చెట్టుని పెద్ద పెద్ద క్రేనులతో తీసేశారు. రాము వాళ్ళ అమ్మ, నాన్న సాయంతో వాళ్ళతో మాట్లాడి, ఆ చెట్టుని తన ఇంటి పక్కనే అవే క్రేన్ల సాయంతో తిరిగి భూమిలో నాటించాడు. ఆ చెట్టు బతుకుతుందో లేదో అని రోజూ చాలా దిగులు పడ్డాడు.
కానీ ఆ తర్వాత ఆ చెట్టు ఎప్పటిలాగే మంచిగా పెరుగుతుండడం చూసి రాము ఇంకా తన స్నేహితులు ఎంతో ఆనందించారు.
ఎప్పుడైనా మనం చెట్లని బాగా చూసుకోవాలి. ఎందుకంటే అవే మనకి ఊపిరి అందిస్తాయి. అందరూ మేఘాల వల్ల లేకపోతే గాలి దేవుడు వల్ల గాలి మనకి అందుతుంది అని అనుకుంటారు. కానీ చెట్లే మనకి గాలిని ఇస్తాయి. అందుకే చెట్లని జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ గుర్తు పెట్టుకుంటారు కదూ!
పి. సాయి యువన్,
2వ తరగతి, హైదరాబాద్