- లారీ ఓనర్లను, డ్రైవర్లను ఆదుకోవాలి
- పక్కన గ్రీన్ టాక్స్ రూ.వందల్లో... రాష్ట్రంలో రూ.వేలల్లో..
- రవాణా రంగాన్ని ప్రభుత్వం దివాలా
- కర్నూలు ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించిన పట్టణ పౌర సంక్షేమ సంఘం, లారీ ఓనర్స్ సంఘాలు
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : రవాణా రంగంపై పెంచిన వివిధ పన్నుల భారాలను ఉపసంహరించుకొని ప్రభుత్వం లారీ ఓనర్స్ కం డ్రైవర్స్ ను ఆదుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరిగినేని పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు నగరం నుంచి ఆర్టీవో కార్యాలయం వరకు పెద్ద సంఖ్యలో లారీ ఓనర్లు డ్రైవర్లు తమ లారీలతో ర్యాలీ చేపట్టారు. ఆర్టీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిటిసి శ్రీధర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ పౌరుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లారెడ్డి, లాంగ్ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు పీ.మినల్లా సలార్ భాష మాట్లాడుతూ... పక్కరాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ తోపాటు, గ్రీన్ టాక్స్, త్రైమాసికం పన్ను పెంచి లారీ ఓనర్ల డ్రైవర్ల నడ్డి విరుస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పగ పట్టినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో పుట్టడమే లారీ ఓనర్లు చేసిన తప్పా? రాష్ట్రం వదిలిపోవాలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి రవాణా రంగంపై భారాలు వేస్తున్నారన్నారు. ఈ భారాల వల్ల ఒక్కో లారీపై ఏడాదికి రూ.3లక్షల అదనపు భారం పడుతుందన్నారు. లక్ష రూపాయలు పెట్టి పాత వాహనం కొని తిప్పుకుంటున్న ఓనర్ కమ్ డ్రైవర్లకు రేషన్ కార్డులు రద్దుచేసి అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ లాంటివి వర్తించకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనం చెడిపోయినా, దొంగలు తీసుకెళ్లినా పన్ను చెల్లించాల్సి వస్తుందన్నారు. 2016లో చోరీకి గురైతే పోలీస్ కేసు నమోదు చేసినప్పటికీ ప్రతి ఏటా టాక్స్ చెల్లిస్తూనే ఉన్నానని, ఏ అదికారీ పట్టించుకోవడంలేదనీ లారి యజమాని ఆఫీస్ అన్నారు. జగన్ ప్రభుత్వం రవాణా రంగంపై భారాలు వేయడం వల్ల నిత్యవసర సరుకులతో పాటు బస్సు చార్జీలు కూడా పెరిగి మొత్తం భారం ప్రజలపై పడుతుందన్నారు. పెట్రోల్ డీజిల్ తో పాటు అన్ని రకాల పన్నులు తగ్గించకపోతే రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుందన్నారు. రమణారంగంపై పెంచిన భారాలను తగ్గించాలని కోరారు. డిప్యూటీ కమిషనర్ శ్రీధర్ స్పందిస్తూ పన్నులు ఎక్కువ ఉన్న విషయం వాస్తవమేనని దీనివల్ల వాహనాలు కొనుగోలు తగ్గిపోయిందని అంటూ మీరిచ్చిన మెమొరండాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఏ సామేలు, ఎస్ బాబు, రమణ, మినీ లారీ ఓనర్ అసోసియేషన్ నాయకులు బ్రహ్మం, వెంకట స్వామి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నగర బాధితులు ఏ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.